తెలంగాణలో మున్సిపల్  ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్ట్...

 

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదంటూ దాఖలైన అన్ని పిటిషన్లను న్యాయ స్థానం కొట్టివేసింది. హై కోర్టు తీర్పుతో తెలంగాణలో ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు లైన్ క్లియర్ అవుతుంది. దీనిపై రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం సానుకూలంగా ఉంటే నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశముంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లలో హడావుడిగా వార్డుల పునర్విభజన చేయడం, ఓటరు జాబితా రూపకల్పన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా ఓటర్ల గణనకు గడువు కుదించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన రెండు ప్రజాహిత వ్యాజ్యాలను హై కోర్టు ధర్మాసనం కొట్టివేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల్లో పురపాలక మండలి ఎన్నికలకు గరిష్టంగా తీసుకోవాల్సిన సమయాన్ని మాత్రమే తెలపారని కనీస సమయం ఎంతనేది ఎక్కడా లేదని ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని అభిప్రాయపడింది. 

తెలంగాణ మున్సిపాలిటీల చట్టంలోని సెక్షన్ పదకొండు ప్రకారం అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన ఓటరు జాబితాను అనుసరించి మున్సిపల్ ఎన్నికలకు ఓటరు జాబితా రూపొందించుకోవచ్చని కోర్టు తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా ఓటర్ల గణన చాలా సులువని అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఆ పనిని మరింత తేలిగ్గా చేయవచ్చని చెప్పింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా ఓటర్లకు సంబంధించి తప్పుగా గుర్తించిన ఒక్క ఓటర్ ని కూడా పిటిషనర్ల తరపు న్యాయవాదులు చూపలేకపోయారన్న న్యాయస్థానం ఈ అంశానికి సంబంధించి ఒక్క ఓటరు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదని తెలిపింది. న్యాయవాదులు చేసిన వాదనలు ఆమోదించదగ్గవి కాదని స్పష్టం చేసింది. జూలై మూడున జారీ చేసిన నోటిఫికేషన్ ను ఎంత వరకు అమలు చేయలేదని ఓటరు జాబితా రూపకల్పనకు సంబంధించి అదనపు ఏజీ ఎన్నికల కమిషన్ తరపు సీనియర్ న్యాయవాది తెలిపిన విషయాన్ని గుర్తు చేసింది. ఎన్నికల కమిషన్ ఇంకా ఎన్నికల క్యాలెండర్ ను ప్రకటించలేదని దానిని రూపొందించే లోపు ఓటరు జాబితా ఎప్పుడైనా ఖరారు చేసుకునే అవకాశముందని కోర్టు తెలిపింది. జూలై మూడు న జారీ చేసిన నోటిఫికేషన్ ను సవాల్ చేయడం సరి కాదని తేల్చి చెప్పింది. ఈ కారణాలతో రెండు ప్రజాహిత వ్యాజ్యాల్లో కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది. 

డెబ్బై మునిసిపాలిటీల ఎన్నికలపై హై కోర్టు సింగిల్ జడ్జి మధ్యంతర స్టే ఆదేశాలు ఇచ్చారని వాటిని ఎత్తి వేయాలని అదనపు ఏజి జె రామచంద్ర రావు అభ్యర్థించారు. దానిని తిరస్కరించిన ధర్మాసనం ఆ అంశాన్ని సింగిల్ జడ్జి ముందే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి కోర్టులో స్టే ను ఎత్తివేసిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే నూట ఇరవై మునిసిపాలిటీలు పది కార్పొరేషన్ లకు ఎన్నికలు జరగవచ్చు. రాష్ట్రంలో నూట ఇరవై ఎనిమిది మున్సిపాలిటీలు పదమూడు కార్పొరేషన్లున్నాయి.వీటిలో గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ లకు సిద్దిపేట, అచ్చంపేట మునిసిపాలిటీల పాలక మండళ్లకు పదవీ కాలం ముగియ లేదు. మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసిన నకిరేకల్ తో పాటు మరో చోట ప్రస్తుత గ్రామ పంచాయతీ పాలక మండళ్ల పదవీ కాలం ముగిసిపోలేదు. ఇతర కారణాలతో మరో నాలుగు చోట్ల ఎన్నికలు వెంటనే నిర్వహించే వీల్లేదని తెలుస్తుంది. మున్సిపాలిటీలకూ రిజర్వేషన్ లను త్వరలో ఖరారు చేయనున్నారు. ప్రభుత్వం ఆదేశిస్తే వారంలో పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. వార్డుల విభజన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తయింది. ఎన్నికల సిబ్బంది శిక్షణా చాలా వరకూ పూర్తయింది. అయితే ఆర్టీసీ సమ్మె కారణంగా ఎన్నికలపై వెంటనే నిర్ణయం తీసుకునే అవకాశం లేదంటున్నారు అధికారులు.