బోటు డ్రైవర్ సంఘాడి నూకరాజు మృతదేహం లభ్యం

 

కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో బోటు డ్రైవర్ కూడా మృతి చెందాడు.బోటు వెలికితీయడంతో మృతుల కుటుంబ సభ్యులు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి దగ్గర మృతదేహాల కోసం పడిగాపులు కాస్తున్నారు. బోటు నుంచి వెలికితీసిన ఎనిమిది మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు అధికారులు. బోటు డ్రైవర్ సంఘాడి నూకరాజుతో పాటు బోటులో ప్రయాణించిన వరంగల్ కు చెందిన పర్యాటకుడు కొమ్ముల రవీందర్ మృతదేహాలను అధికారులు గుర్తించారు. మిగిలిన ఆరు మృతదేహాలు ఎవరివన్నది నిర్ధారించాల్సి ఉంది. మొత్తం మృతదేహాల్లో ఒక్కటి మాత్రమే మహిళది. ఆ మృతదేహం మంచిర్యాలకు చెందిన రమ్యశ్రీదిగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వటానికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. వెలికితీసిన వశిష్ట బోటులో ఎనిమిది మృతదేహాలు బయటపడ్డాయి. బురదలో కూరుకుపోయి కొన్ని బోటు రేకులకు పట్టుకుని కొన్ని మృతదేహాలు ఉన్నాయి. ఈ మృతదేహాలన్నీ బోటు ఏసీ క్యాబిన్ లో ఉన్నాయి. బోటు గల్లంతైన రోజునే గల్లంతయిన వాళ్లంతా ఏసీ క్యాబిన్ లో ఉండి ఉంటారని అనుమానించారు. దానికి తగ్గట్టుగానే కొన్ని మృతదేహాలు అందులో చిక్కుకొని ఉన్నాయి. ఇవి ఎవరివో గుర్తించాల్సి ఉంది. గల్లంతైన వారిలో పన్నెండు మంది జాడ తెలియాల్సి ఉండగా ఇప్పటికే ఎనిమిది బయటపడటంతో మిగిలిన నలుగురి జాడ కోసం బోటు ఉన్న ప్రాంతాల్లోనే గాలిస్తున్నారు.మృత దేహాలు బాగా కుళ్ళీపోయి ఉండటంటో ఎవరివో గుర్తించటం చాలా కష్టంగా మారింది. మృతుల బంధువులు కుటుంబ సభ్యుల రోదనలతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర విషాదకర వాతావరణం నెలకొంది.