దేశంలో వరస్ట్ సీఎంగా కేసీఆర్.. ఏప్రిల్ లో కేటీఆర్ కు పగ్గాలు 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై గతంలో ఎప్పుడు లేనంతగా ప్రజా వ్యతిరేకత కనిపిస్తోందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన కేసీఆర్ కు.. గత ఏడదిగా వరుస ఎదురుదెబ్బలు తగులుతుండటం ఇందుకు సాక్ష్యంగా నిలిచాయి. ముఖ్యంగా కేసీఆర్ సొంత గడ్డ మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో అధికార పార్టీ ఓడిపోవడం గులాబీ పార్టీలో గుబులు రేపింది. తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ హోరాహోరీగా తలపడింది. ఈ రెండు ఫలితాలు కేసీఆర్ పై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనమనే చర్చ జరిగింది. ఆ తర్వాత నుంచి కేసీఆర్ పై ప్రజల్లో ఆగ్రహం మరింత పెరిగిందనే ప్రచారం సాగుతోంది.

తాజా వచ్చిన సర్వేలోనూ అదే తేలింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని ఐఏఎన్‌ఎస్ (ఇండో-ఏసియన్‌ న్యూస్‌ సర్వీస్‌), సీ-ఓటర్‌ సర్వే వెల్లడించింది. అన్ని రాష్ట్రాల సీఎంలలో.. ప్రజాగ్రహం అధికంగా ఉన్న సీఎం ఆయనేనని పరిపాలన సూచీ పేరిట నిర్వహించిన తాజా సర్వేలో తేలిందని ఆ రెండు సంస్థలు ప్రకటించాయి.

ఆయనపై 30.30శాతం మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పై 28.1 శాతం వ్యతిరేకతతో రెండో స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో ఉన్న గోవా ముఖ్యమంత్రిపై 27.7 శాతం ప్రజలు ఆగ్రహంతో ఉన్నట్లు సర్వేలో తేలింది. అతి తక్కువ వ్యతిరేకత ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో.. ఛత్తీస్‌గఢ్‌,  ఉత్తరాఖండ్‌, ఒడిసా ముఖ్యమంత్రులు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ భగెల్‌పై 6శాతం మంది మాత్రమే వ్యతిరేకత ప్రదర్శించారు. ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ పై 10.10, ఒడిసా సీఎం నవీన్‌పట్నాయక్‌పై 10.4శాతం ప్రజలు మాత్రమే ఆగ్రహంతో ఉన్నట్లు సర్వేలో తేలింది.

సర్వే ఫలితాలతో తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టమవుతోంది. సీ-ఓటర్‌ వ్యవస్థాపకుడు యశ్వంత్‌ దేశ్‌ముఖ్‌  కూడా ఇదే విషయం చెప్పారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ పనితీరుకు మంచి రేటింగ్‌ ఉన్న నేపథ్యంలో బీజేపీ అధికారాన్ని చేపట్టే అవకాశాలున్నాయన్నారు. కేటీఆర్‌ను సీఎం చేయడానికి ఇదే మంచి సమయమని, లేదంటే పరిస్థితి చేయిదాటి పోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సీఈవో తరహాలో పనిచేసే సీఎంలకు ప్రజాదరణ ఉంటోందని, కేంద్రీకృత నిర్ణయాలు తీసుకునే వారిని ప్రజలు ఇష్టపడుతున్నారని తెలిపారు.

సీ ఓటర్ సర్వే ఫలితాలతో తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఉండవచ్చనే చర్చ మళ్లీ జోరందుకుంది. చాలా కాలంగా జరుగుతున్న ప్రచారం నిజమయ్యే అవకాశాలు ఉన్నాయని, కేటీఆర్ కు పగ్గాలు అప్పగించడానికి సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. తన కలల ప్రాజెక్టు అయిన యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణ పనులు తుది దశకు వచ్చాయి. మార్చి28న ముహుర్తం కూడా నిర్వహించారు. దీంతో యాదాద్రి ఆలయం ప్రారంభోత్సవం తర్వాత సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిని వదులుకుని, కేటీఆర్ కు పట్టాభిషేకం చేస్తారనే చర్చ సాగుతోంది.