లోకేశ్‌ను అరెస్ట్ చేస్తారా? హ‌త్యాయ‌త్నం, అట్రాసిటీ కేసులు ఎందుకు?

అత్త‌ను కొట్టి కోడ‌లు ల‌బోదిబోమంటూ అరిచింద‌ట‌. ఇదో సామెత‌. కానీ, ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం తీరు ఇలానే ఉందంటూ మండిప‌డుతున్నారు. టీడీపీ ఆఫీసుల‌పైపడి వైసీపీ రౌడీ మూక‌లు దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. క‌ర్ర‌లు, రాడ్లు, సుత్తిల‌తో విధ్వంసం సృష్టించారు. కార్యాల‌య సిబ్బంది త‌ల‌లు ప‌గ‌ల‌గొట్టారు. ఇంతా చేసి.. అడ్డుకోబోయిన టీడీపీ నాయ‌కుల‌పై తిరిగి కేసులు పెట్ట‌డం ఏపీ పోలీసుల ప‌క్ష‌పాత వైఖ‌రికి నిద‌ర్శ‌నం అంటున్నారు. వాళ్లు పోలీసులా? వైసీపీ కార్య‌క‌ర్త‌లా? అనే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 

న‌వ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న‌ట్టు ఉంది పోలీసుల తీరు అంటున్నారు. తాజాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సహా మరికొందరికిపై మంగళగిరి పోలీసులు కేసులు నమోదు చేశారు. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ ప్ర‌ధాన‌ కార్యాలయంపై దాడి అనంతరం అక్కడికి వచ్చిన సీఐ నాయక్‌పై దాడి చేశారంటూ వారిపై అభియోగాలు మోపారు. హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. 

సీఐ నాయ‌క్‌పై దాడి చేశారంటూ న‌మోదు చేసిన కేసుల్లో.. ఏ-1గా నారా లోకేశ్‌, ఏ-2గా అశోక్‌బాబు, ఏ-3గా ఆలపాటి రాజా, ఏ-4గా తెనాలి శ్రవణ్‌ కుమార్‌, ఏ-5గా పోతినేని శ్రీనివాసరావు సహా మరికొందరిపై కేసులు నమోదు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. 

ఎప్ప‌టి నుంచో నారా లోకేశ్‌ను వైసీపీ ప్ర‌భుత్వం టార్గెట్ చేస్తోంద‌నే ఆరోప‌ణ ఉంది. ఇటీవ‌ల గుంటూరు జిల్లాలో అత్యా-చార బాధితురాలి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌డానికి ఆమె ఇంటికి వెళ్లే ప్ర‌య‌త్నం చేసిన నారా లోకేశ్‌ను మ‌ధ్య‌లోనే అడ్డుకొని.. బ‌ల‌వంతంగా స్టేష‌న్‌కు త‌ర‌లించారు. కేసుల‌తో భ‌య‌పెట్టాల‌ని చూశారు. తాజాగా, టీడీపీ ఆఫీసుపై దాడి ఘ‌ట‌న‌లో బాధితులపైనే హ‌త్యాయ‌త్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్ట‌డం.. నారా లోకేశ్‌ను టార్గెట్ చేయ‌డ‌మేనంటున్నారు. లోకేశ్‌ను అరెస్ట్ చేస్తారా? అనే అనుమాన‌మూ వ్య‌క్త‌మ‌వుతోంది.