తెలంగాణా యం.యల్సీ. ఎన్నికలలో అరాచకం
posted on May 23, 2015 11:29AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యం.యల్యే కోటా క్రింద జరిగే నాలుగు యం.యల్సీ. స్థానాలకు తెదేపా తరపున ముగ్గురు, వైకాపా తరపున ఒక్కరు నామినేట్ చేయబడటంతో వారి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కానీ తెలంగాణాలో ఆరు యం.యల్సీ. స్థానాలకు ఏడుగురు అభ్యర్ధులు బరిలో దిగడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి.
ఒక్కో యం.యల్సీ. అభ్యర్ధి గెలుపుకి కనీసం 18 మంది యం.యల్యేల మద్దతు అవసరం ఉంటుంది. కాంగ్రెస్, తెదేపాల నుండి వచ్చిన వారితో కలిపి చూసుకొంటే తెరాసకు మొత్తం 75 మంది యం.యల్యేలున్నారు. వారిలో 72మంది మద్దతుతో నలుగురు యం.యల్సీ.లను తెరాస అవలీలగా గెలిపించుకోగలదు. కానీ తెరాస ఐదవ అభ్యర్ధిని కూడా పోటీలో నిలిపింది. తనకున్న మిగిలిన ముగ్గురు యం.యల్యేలు కాకుండా మరొక 15 మంది యం.యల్యేల మద్దతు అవసరం ఉందన్న మాట. తెరాసకు మిత్రపక్షంగా ఉన్న మజ్లీస్ పార్టీకి ఏడుగురు యం.యల్యేలున్నారు. బహుశః మజ్లీస్ పార్టీ మద్దతు ఇస్తానని హామీ ఇచ్చినందునే తెరాస ఐదవ అభ్యర్ధిని బరిలో దించిందని భావించినా, దానికి ఇంకా మరో 8 మంది యం.యల్యేల మద్దతు అవసరం ఉంటుంది. తెలంగాణాలో వైకాపా, సీపీయం. సీపీఐ పార్టీలకు ఒక్కో యం.యల్యే. ఉన్నారు. వాటిలో సీపీయం పార్టీ ఈ ఎన్నికలకు దూరంగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. కనుక మిగిలిన వైకాపా, సీపీఐ పార్టీలు తెరాసకు మద్దతు కూడా కీలకం కానుంది.
ఒకవేళ ఆ రెండు పార్టీలు కూడా తెరాస ఐదవ అభ్యర్ధికి మద్దతు ఇచ్చేందుకు సిద్దపడినా ఇంకా మరో ఆరుగురు యం.యల్యేల మద్దతు అవసరం ఉంది. అంటే కాంగ్రెస్(18), తెదేపా(11), బీజేపీ(5) పార్టీలకున్న యం.యల్యేలలో కొందరు క్రాస్ ఓటింగ్ చేస్తే తప్ప తెరాస అభ్యర్ధి గెలుపు కష్టమని అర్ధమవుతోంది. కానీ తమ ఐదవ అభ్యర్ధి కూడా ఖచ్చితంగా గెలుస్తారని తెరాస బల్ల గుద్ది మరీ చెపుతోంది. అంటే ఆ మూడు పార్టీలలో ఎవరో కొందరు యం.యల్యేలకు ఎర విసరబోతోందని స్పష్టమవుతోంది. అందుకే ఆ మూడు పార్టీలు తెరాస మీద తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి.
అవి తమ పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవాలని అవి తాపత్రయపడుతుంటే, తెరాస ఆ పార్టీల యం.యల్యేలను క్రాస్ ఓటింగ్ చేసేందుకు ప్రోత్సహించడం జీర్ణించుకోలేకపోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు యం.యల్యేలు, తెదేపాకు చెందిన నలుగురు యం.యల్యేలు క్రాస్ ఓటింగ్ చేసేందుకు తెరాస ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆ రెండు పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేయవచ్చును. కానీ వారు పార్టీ ఫిరాయించడానికి సిద్దపడితేనే క్రాస్ ఓటింగ్ చేసేందుకు దైర్యం చేస్తారు కనుక పార్టీలు విప్ జారీ చేసినా ఏమీ ప్రయోజనం ఉండబోదు.
తెదేపా-బీజేపీ కూటమి తరపున వేమ్ నరేందర్ రెడ్డి యం.యల్సీ. అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. ఆయన గెలుపుకి మరొక ఇద్దరు యం.యల్యేల మద్దతు అవసరం ఉంది. తెదేపా కూడా వామపక్షాల మద్దతు మీదే ఆశలు పెట్టుకొంది. కానీ ఈ ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించిన సీపీయం పార్టీని ముందు ఒప్పించి దాని మద్దతు పొందవలసి ఉంటుంది. కానీ ఒకవేళ తెదేపాకు చెందిన ఏ ఒక్క యం.యల్యేని తెరాస తనవైపు తిప్పుకొన్నా, వామపక్షాలు మద్దతు ఇచ్చినప్పటికీ ప్రయోజనం ఉండబోదు.
కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. ఆపార్టీకి చెందిన పువ్వాడ అజయకుమార్ ఏదో స్వంత పనిమీద అమెరికా వెళ్ళారు. ఆయన జూన్ 1న ఎన్నికలు జరిగే సమయానికల్లా తిరిగి హైదరాబాద్ చేరుకోనట్లయితే కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపు కూడా కష్టమే. ఇక పార్టీ కార్యక్రమాలకి చాలా కాలంగా దూరంగా ఉంటున్న మాజీమంత్రి కోమటి రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధి ఆకుల లలితకు మద్దతు ఇస్తారో లేదో చివరి నిమిషం వరకు అనుమానమే. ఇటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి చెందిన యం.యల్యేలను కొందరిని తెరాస తనవైపు త్రిప్పుకోవాలని ప్రయత్నిస్తుండటంతో ఆ పార్టీ కూడా తెరాసపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఏది ఏమయినప్పటికీ మరొక రెండు రోజుల్లో తెరాస తన ఐదవ అభ్యర్ధిని బరిలో నుండి వెనక్కు తీసుకోకపోయినట్లయితే అది ఏదో ఒక పార్టీకి ఎసరు పెట్టేందుకు రంగం సిద్దం అయినట్లే భావించవచ్చును.