మోడీ పాలనపై కాంగ్రెస్ విమర్శలా?
posted on May 22, 2015 12:56PM
గత పదేళ్ళ కాలంలో అవినీతికి, అసమర్ధతకు మారుపేరుగా సాగిన కాంగ్రెస్ పాలనను చూసి దేశప్రజలందరూ ఆ పార్టీని తిరస్కరించారు. అయినా ఆ పార్టీ నేతలు ఆత్మవిమర్శ చేసుకొన్నట్లు కనబడటం లేదు. అందుకే ఆ పార్టీ నేతలలో నేటికీ ఎటువంటి పశ్చాతాపం కనబడటం లేదు. ప్రజలు తమ పార్టీని ఎందుకు తిరస్కరించారని ఆలోచించకుండా, అఖండ మెజార్టీతో ప్రజలు పట్టం కట్టిన మోడీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు విమర్శించడం చూస్తుంటే వారు కనీసం తమ వ్యవహార శైలిని కూడా మార్చుకోలేకపోయారని అర్ధమవుతోంది.
ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేతల ప్రధాన ఆరోపణ ఏమిటంటే ఆయన నియంతృత్వంగా వ్యవహరిస్తూ, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని. కానీ నిజమేమిటంటే ఆయన అధికారం చేప్పట్టిన తరువాతనే మళ్ళీ అన్ని వ్యవస్థలను ప్రక్షాళనం చేసి వాటికి జవజీవాలు కల్పించారు. ప్రభుత్వానికి భారంగా తయారయిన అనేక సంస్థలను, కమిటీలను,చివరికి మంత్రిత్వ శాఖలను కూడా రద్దు చేసి పరిపాలనలో సంస్కరణలు తద్వారా వేగాన్ని తీసుకువచ్చారు. ఒకప్పుడు ప్రణాళికా సంఘం అంటే అది ఎవరికీ అంతుపట్టని, ఎవరికీ సంబంధం లేని ఒక ‘బ్రహ్మ పదార్ధం’ గా భావించేవారు అందరూ. కానీ మోడీ దానిని సమూలంగా ప్రక్షాళన చేసి అందులో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించారు.
కేంద్ర మంత్రులకు, ఉన్నతాధికారులకు పూర్తి స్వేచ్చ కల్పిస్తూనే వారినే తమపనులకు జవాబుదారీగా చేస్తున్నారు. ఆయన ప్రభుత్వం చేప్పట్టిన అనేక చర్యల వలన ఇప్పుడు దేశ ఆర్ధిక వ్యవస్థ మళ్ళీ మెల్లగా గాడిన పడుతోంది. ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు భారత్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. ఈ మార్పులన్నీ కేవలం మోడీ సమర్ధత, నాయకత్వ లక్షణాల కారణంగానే సాధ్యమవుతున్నాయి. దానినే కాంగ్రెస్ నేతలు నియంతృత్వం అని ఏక వ్యక్తి పరిపాలన అని వర్ణిస్తున్నారు. అదే నియంతృత్వం అయితే, దాని వలననే దేశానికి మేలు జరుగుతుంటే అందుకు బాధపడటం ఎందుకు? మోడీ ప్రదర్శితున్న ఈ సమర్ధత వలన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎన్నడూ అధికారంలోకి రాలేదనే భయం, అభద్రతాభావంతో ఉంది. బహుశః అందుకే అది మోడీని చూసి ఉలికి పడుతోందేమో?
ఒకవేళ దానినే కాంగ్రెస్ పార్టీ నియంతృత్వంగా భావిస్తే, ఇదివరకు డా. మన్మోహన్ సింగ్ ని డమ్మీ ప్రధానమంత్రిగా చేసి ఏ అధికారమూ లేని సోనియా, రాహుల్ గాంధీలు చేసిన పరిపాలనను ఏమనాలి? ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వమూ పరిష్కరించవలసిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాన్ని ఎటువంటి అధికారమూ లేని సోనియా గాంధీ ఎందుకు తన చేతిలోకి తీసుకొన్నారు? అని ప్రశ్నిస్తే ఆమె తెర వెనుక నుండి దేశాన్ని ఏవిధంగా పరిపాలించారో అర్ధమవుతుంది. కానీ ప్రజామోదంతో ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన నరేంద్ర మోడీ ప్రదర్శిస్తున్న నాయకత్వ లక్షణాలను, సమర్ధతను నియంతృత్వమని కాంగ్రెస్ అభివర్ణిస్తోంది. కాంగ్రెస్ పార్టీ గత పదేళ్ళలో చేయలేని అనేక పనులను మోడీ చేసి చూపిస్తుంటే అందుకు ఆయనను మెచ్చుకోకపోగా, సహజసిద్ధమయిన తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ ఇటువంటి మాటలతో ప్రజలను తప్పు ద్రోవ పట్టించే ప్రయత్నాలు చేస్తోంది.
కానీ దేశంలో అభివృద్ధి జరుగుతోందా లేదా? దేశానికి ఎవరు మేలు చేస్తున్నారు? ఎవరు కీడు చేస్తున్నారు? అనే విషయాలు గ్రహించలేనంత తెలివి తక్కువ వాళ్ళు కాదు భారతీయులు. అందుకే వారు దేశాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టారు. బీజేపీకి అఖండ మెజార్టీతో పట్టం కట్టారు. మోడీ పరిపాలన గురించి కాంగ్రెస్ పార్టీ ఏమనుకొంటోంది? అనేది అప్రస్తుతం. దేశ ప్రజలు ఏమనుకొంటున్నారనేదే ముఖ్యం. మోడీ అధికారం చేప్పట్టిన తరువాత నుండే పాలనలో వేగం, పారదర్శకత కనబడుతోంది. ఏడాది పాలనలో ఒక్క కుంభకోణం కూడా జరగలేదు. దేశ వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబడ్డాయి. ఈ సంగతి ప్రజలందరికీ స్పష్టంగా కనబడుతూనే ఉన్నాయి ఒక్క కాంగ్రెస్ కి తప్ప. కనుక కాంగ్రెస్ పార్టీ తనను మభ్యపెట్టుకొంటూ ప్రజలను కూడా మభ్య పెట్టేందుకు ఎన్ని కబుర్లు అయినా చెప్పుకోవచ్చును. దాని మాటలకు ప్రజల దృష్టిలో ఎటువంటి విలువ ప్రాధాన్యత లేదు. ఉండబోదు కూడా.