తెరాసకు ముందు నుయ్యి వెనుక గొయ్యి

 

తెలంగాణా శాసనసభ నుండి వారం రోజుల పాటు సస్పెండ్ చేయబడిన తెదేపా సభ్యులు, నిన్నటితో ఆ గడువు ముగియడంతో ఈరోజు నుండి మళ్ళీ సభకు హాజరుకానున్నారు. కానీ వివిధ అంశాలపై వారు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక వారిపై ఎదురుదాడి చేస్తున్న తెరాస మంత్రులు మళ్ళీ వారిని ఏదో ఒక వంకతో సభ నుండి సస్పెండ్ చేయకుండా ఉంటారని భావించలేము. కాంగ్రెస్ పార్టీ సభ్యులు పార్టీ ఫిరాయింపుల అంశంపై ప్రభుత్వాన్ని సభలో గట్టిగా నిలదీస్తున్నారు. అర్హులయిన వేలాది మంది పెన్షనర్ల పేర్లను జాబితా నుండి తొలగించడంపై వారు ప్రభుత్వంతో యుద్ధం చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు వారికి తెదేపా నేతలు కూడా మళ్ళీ తోడయినట్లయితే, సభలో ప్రతిపక్షాలను తట్టుకోవడం తెరాసకు చాలా కష్టమవుతుంది. అందువలన మళ్ళీ ఏదో ఒక సాకుతో వారిని సభ నుండి సస్పెండ్ చేసినా ఆశ్చర్యం లేదు.

 

అదే చేస్తే ఈసారి తెదేపా సభ్యులు మరింత ఉదృతంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నా కార్యక్రమాలు నిర్వహించవచ్చును. ఇంతకు ముందు వారిని వారం రోజుల పాటు సభ నుండి సస్పెండ్ చేసినప్పుడు, వారు ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలను రాజధానికి వెంటబెట్టుకొని వచ్చి వారితో కలిసి ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. వారి ధర్నాకు మంచి మీడియా కవరేజ్ కూడా రావడంతో అది రాష్ట్ర ప్రజలందరి దృష్టికి వెళ్ళింది.

 

సభలో ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోవడానికి తెరాస ఎంత గట్టిగా కసరత్తు చేసినప్పటికీ వారిని ఎదుర్కోవడం చాలా కష్టమవుతోంది. అందుకు కారణం ప్రతిపక్ష సభ్యులలో చాలామంది ప్రభుత్వపాలన, వ్యవహారాలలో తెరాస సభ్యులు, మంత్రుల కంటే చాలా అనుభవం ఉన్నవారు కావడమే. కానీ వారిని సభలో ధీటుగా ఎదుర్కోలేకపోయినంత మాత్రాన్న తెరాస ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదని భావిస్తే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదని చెప్పవచ్చును. విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, పెన్షన్లు తదితర ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న తమకు సమాధానం ఈయకుండా తప్పించుకోవడానికే తమను సభ నుండి సస్పెండ్ చేసి బయటకు పంపించి వేస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా బాధిత కుటుంబాలకు బాగానే చేరుతున్నాయి. దాని వలన తెరాస పార్టీకి దీర్ఘకాలంలో జరిగే నష్టాన్ని ఎవరూ ఊహించలేరు.

 

ఇంతకు ముందు తెదేపా సభ్యులను వారం రోజులు సస్పెండ్ చేసిన తెరాస ప్రభుత్వం,తరువాత 14మంది కాంగ్రెస్ సభ్యులను కూడా సభ నుండి ఒకరోజుకి సస్పెండ్ చేయడంతో వారు కూడా తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్దతులకు, సాంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చి సభలో ప్రతిపక్షాల గొంతు వినబడకుండా చేసి చాలా నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆ తరువాత వారు గవర్నరును కలిసి ప్రభుత్వంపై పిర్యాదు చేసారు కూడా.

 

కనుక తెదేపా సభ్యులను మళ్ళీ సభ నుండి సస్పెండ్ చేయాలనుకొంటే తెరాస ప్రభుత్వం ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించుకోక తప్పదు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్న ప్రతిపక్షాలకు సమాధానాలు చెప్పలేక వారిని ఏదో సాకుతో సభ నుండి సస్పెండ్ చేస్తోందనే అపఖ్యాతి మూట గట్టుకోవడం మంచిదా లేకపోతే వారు సభలో వివిధ అంశాలపై తమ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే సమాధానాలు చెప్పలేక నీళ్ళు నమలడం మంచిదా? అనేది తెరాసయే నిర్ణయించుకోవలసి ఉంటుంది. తెరాస పరిస్థితి చూస్తుంటే ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుంది.