కొడాలిపై కొత్త బాణం..!

టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. ఆయా పార్టీల అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ అమరావతిలో ఒకే వేదిక మీద నుంచి ఎన్నికల బరిలో దిగనున్న ఆయా పార్టీల అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అయితే అందులో గుడివాడ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థిగా వెనిగండ్ల రాము పేరును ప్రకటించారు. దీంతో గుడివాడ రాజకీయం రసవత్తరంగా మారింది. గుడివాడ టీడీపీ ఇన్‌చార్జీగా వెనిగండ్ల రాము పేరును గతంలోనే ప్రకటించినా.. ఆయన్ని మారుస్తారంటూ ఓ ప్రచారం అయితే అడపా దడపా జరిగినా.. చివరకు రాముకే ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేయడంతో.. స్థానిక సైకిల్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకొంటున్నాయి. 

ఇక టీడీపీకి గుడివాడ కంచుకోట అన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి గుడివాడను.. కొడాలి నాని అంటేనే గుడివాడ.. గుడివాడ అంటేనే కొడాలి నాని అన్నట్లుగా స్థానిక రాజకీయాన్ని ఈ మాజీ మంత్రి మార్చేశారని.. అలాంటి వేళ.. వెనిగండ్ల రామును చంద్రబాబు బరిలోకి దింపడం ద్వారా గుడివాడలో కొడాలి నాని రాజకీయానికి చెక్ పెట్టనున్నారనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో చాలా ఆసక్తికరంగా జరుగుతోంది. 

గత ఎన్నికల వేళ.. అంటే 2019 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ గెలుపు కోసం.. ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్.. కొత్త క్యాస్ట్ ఈక్వేషన్స్‌తో ముందుకు వెళ్లారని.. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. నాడు శింగనమల, చిలకలూరిపేట, తాడికొండ, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో ఈ ఈక్వేషన్స్‌తోనే పార్టీ అభ్యర్థులను ఆయన గెలిపించుకున్నారని... దాంతో ఆ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ గెలుపు నల్లేరు మీద నడకే అయిందని సదరు సర్కిల్‌లో ఓ చర్చ హల్‌చల్ చేస్తోంది. దాదాపుగా ఇదే ఈక్వేషన్‌ను ఈ సారి గుడివాడలో చంద్రబాబు అమలు చేస్తున్నారని...అందులోభాగంగా వెనిగండ్ల రామును బరిలో దింపినట్లు తెలుస్తోంది. 
 
ఎందుకంటే.. కొడాలి నాని వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలుత టీడీపీ టికెట్‌పై ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసినా.. ఆ తర్వాత.. 2012లో ఆయన ఫ్యాన్ పార్టీలోకి జంప్ కొట్టి.. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి.. అసెంబ్లీకి పంపిన టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగేవారు. ఇక జగన్ పార్టీ అధికారంలోకి రావడంతో.. ఆయన కేబినెట్‌లో పౌరసరఫరాల శాఖ మంత్రిగా కొడాలి నాని బాధ్యతలు చేపట్టిన తర్వాత.. అదే చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్‌పై బండ బూతులతో విరుచుకు పడిపోయేవారు. దీంతో బూతు సరఫరా శాఖ మంత్రిగా ఆయన అపఖ్యాతిని మూట కట్టుకున్నారు. 

అయితే వరుసగా అయిదో సారి కూడా గుడివాడ నుంచి గెలిచేందుకు కొడాలి నాని తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. అలాంటి వేళ.. ఈ ఎన్నికల్లో కొడాలి నానికి వెనిగండ్ల రాము సరైన ప్రత్యర్థి అనే ఓ ప్రచారం సైతం సాగుతోంది. అదీకాక.. గుడివాడ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇప్పటికే పలుమార్లు వెనిగండ్ల రాము  పర్యటించారని... అలాగే అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకొని.. వాటిని తనదైన శైలిలో పరిష్కరిస్తూ.. ముందుకు సాగుతున్నారని.. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడలో వెనిగండ్ల రాము సారథ్యంలో టీడీపీ జెండా రెపరెపలాడితే మాత్రం కొడాలి నాని శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకున్నట్లేననే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో వాడి వేడిగా కొన.. సాగుతోంది. 

మరి చంద్రబాబు ప్రయోగిస్తున్న ఈ రామ బాణం.. కొడాలి నానిపై ఎంతగా పని చేస్తుందనేది తెలియాలంటే మాత్రం ఎన్నికల ఫలితాల వెలువడే  వరకు వేచి చూడాల్సిందేనని సదరు సర్కిల్‌లో ఓ చర్చ అయితే హాట్ హాట్‌గా సాగుతోంది.