క‌ర్నూల్‌ పై బాబు వ్యూహం... వైసీపీ గిల‌గిల‌!

సీమ ముఖద్వారం కర్నూలు. ఇక్కడి రాజకీయం అంటే ఎప్పటికీ ప్రత్యేకమే ! కర్నూలు పార్లమెంట్ స్థానంతో పాటు.. లోక్‌సభ పరిధిలోని అన్ని 7 అసెంబ్లీలను క్లీన్‌స్వీప్‌ చేసిన వైసీపీ.. ఈసారి సీన్ రిపీట్ చేయాలని ప్లాన్‌ చేస్తుంటే.. కొండారెడ్డి బురుజుపై జెండా పాతాలని టీడీపీ ఫిక్స్ అయింది. దీంతో క‌ర్నూల్‌ రాజకీయం ఆసక్తికరంగా మారింది. అయితే కర్నూలు పొలిటికల్ పిక్చర్ ఏంటి?  వైసీపీని వెంటాడుతున్న టెన్షన్ ఏంటి.. ఇక్క‌డ ప‌ట్టు కోసం టీడీపీ వ్యూహం ఏమిటి?  2024 బరిలో నిలిచే రేసుగుర్రాలు ఎవరు?  కొండారెడ్డి బురుజుపై జెండా పాతేది ఎవరు….ఆసక్తి కరంగా మారిన‌ కర్నూలు రాజకీయంపై తెలుగువ‌న్ గ్రౌండ్ రిపోర్ట్‌.
క‌ర్నూల్ పార్ల‌మెంట్‌కు ద‌మ్మున్న అభ్య‌ర్థి ని నిల‌బెట్టాల‌ని టీడీపీ భావిస్తోంది.  రెడ్డి సామాజిక వ‌ర్గం కాకుండా బీసీకి ఇవ్వాల‌ని టీడీపీ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతోంది.  గ‌తంలో బోయ సామాజిక వ‌ర్గానికి ప్రాధాన్య‌త ఇచ్చిన టీడీపీ ఇప్పుడు కురువ సామాజిక వ‌ర్గానికి  ప్ర‌ధాన్య‌త ఇస్తోంది. పంచ‌లింగ‌లా బ‌స్తిపాడు నాగ‌రాజు పేరు దాదాపుగా ఖాయ‌మైన‌ట్లేన‌న్న టాక్ అయితే వినిపిస్తోంది. గ‌తంలో ఆయ‌న ఎంపిటీసీగా గెలిచారు. వైపీసీని ఎదుర్కొవాలంటే ఓ సామాన్యుడికి, బీసీకి ఇవ్వాలనుకుంటోంది టీడీపీ అధిష్టానం. పైగా రైతు కుటుంబం నుంచి వున్నారు కాబ‌ట్టి పంచ‌లింగ‌లా బ‌స్తిపాడు నాగ‌రాజు పేరు దాదాపు ఖాయం అయిన‌ట్లే.
వైసీపీకి పెట్టని కోటలా మారింది కర్నూల్‌ లోక్‌సభ స్థానం. 2014, 2019లో వరుసగా విజయం సాధించిన వైసీపీ.. హ్యాట్రిక్ కొట్టాలన్న పట్టుదలతో ఉంటే.. ఈసారి గెలిచి కొండారెడ్డి బురుజుపై గెలుపు జెండా ఎగురవేయాలని టీడీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది.
కర్నూలు పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో.. అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరు వైసీపీని ఇబ్బంది పెడుతున్నాయ్. దీంతో కేడర్‌లో అయోమయం కనిపిస్తోంది. అంతర్గత విభేదాలను చక్కబెట్టేందుకు అధిష్టానం దూతలను పంపినా.. ఫలితం కనిపించడం లేదు. వైసీపీలో ఈ పరిస్థితులను క్యాష్ చేసుకోవాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. ఐతే అనుకున్న స్థాయిలో దాన్ని అందుకోవడంలో సైకిల్ పార్టీ విఫలం అవుతుందనే చర్చ జరుగుతోంది. వైసీపీతో కంపేర్‌ చేస్తే టీడీపీలో వర్గపోరు తక్కువగానే ఉన్నా.. అది కూడా పార్టీకి నష్టం కలిగించే ప్రమాదం లేకపోలేదనే చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిణామాల మధ్య కర్నూలు పార్లమెంట్‌ ఫైట్ ఆసక్తికరంగా మారింది.
కర్నూలు పార్లమెంట్ ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. ఎక్కువసార్లు కాంగ్రెస్ విజయం సాధించగా.. టీడీపీ రెండుసార్లు, వైసీపీ రెండుసార్లు గెలిచాయ్‌. కర్నూలు పార్లమెంట్ నుంచి ఎన్నికైన వారు ఎన్నో ఉన్నత పదవులను పొందారు. కోట్ల, కేఈ కుటుంబానికి పెట్టని కోటగా ఉన్న కర్నూలు పార్లమెంట్‌లో రెండు కుటుంబాలకు చెందిన వారు ఎంపీగా గెలుపొందారు. గతంలో ఇక్కడి నుంచి గెలిచిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి.. కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన కుమారుడు కూడా కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయ్‌. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి.. టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు.
టీడీపీ నుంచి జిల్లాలో మంచి పట్టు ఉన్న మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కూడా టీకెట్ ఆశిస్తున్నారు
కేఈ కుటుంబసభ్యులతో పాటు పలువురు బీసీ నేతలు కూడా టీడీపీ నుంచి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 
వైసీపీ ఎంపి అభ్యర్ధిగా గుమ్మనూరు జయరాంను బరిలోకి దింపే ఆలోచనలో వుంది,
ప్రస్తుతం ఏపీ రాజకీయం మొత్తం కర్నూలు చుట్టే నడుస్తోంది.  
అసెంబ్లీ పరిధిలో వైసీపీలో కనిపిస్తున్న అంతర్గత కలహాలను క్యాష్ చేసుకోవాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. దీంతో 2024 ఎన్నికల ఫైట్ ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
కర్నూలు పార్లమెంట్‌ పరిధిలో కర్నూలుతో పాటు పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయ్. ఇందులో కొడుమూరు ఎస్సీ రిజర్వ్‌డ్‌ కాగా.. మిగతా నియోజకవర్గాలన్నీ జనరల్‌. 

1)  కర్నూలు అసెంబ్లీలో అబ్దుల్ హఫీజ్ ఖాన్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. వర్గవిభేదాలు ఇక్కడ వైసీపీని టెన్షన్ పెడుతున్నాయ్. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయ్‌. ఇద్దరు నేతల తీరుతో పార్టీ కేడర్‌లో అయోమయం కనిపిస్తోంది.  
ఐతే ఇద్దరి మధ్య వర్గపోరును క్యాష్‌ చేసుకునేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. ఇక్కడ సైకిల్ పార్టీ నుంచి టీజీ భరత్ బరిలో దిగబోతున్నారు. 
2) కోడుమూరులోనూ వైసీపీని ఆధిపత్య పోరు ఇబ్బందిపెడుతోంది.  కోడుమూరులో సుధాకర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఐతే ఆధిపత్య పోరు ఇక్కడ వైసీపీకి ఇబ్బందిగా మారింది. 
ఇక్క‌డి నుంచి టీడీపీ టికెట్ సాధించాలని.. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి వర్గాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయ్.
3) ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఐతే రాష్ట్ర లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రగౌడ్‌ వర్గానికి.. ఎమ్మెల్యే వర్గానికి మధ్య అంతర్గ విభేధాలు తారాస్థాయికి చేరుకున్నాయ్. 
ఎమ్మిగనూరు ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. 2004వరకు ఇక్కడ టీడీపీ హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకుంది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున జయనాగేశ్వర రెడ్డి పోటీ చేశారు. ఐతే వర్గవిభేదాలు సైకిల్‌ పార్టీకి ఇక్కడం ఇబ్బందిగా మారాయ్‌. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున జయనాగేశ్వరరెడ్డి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుండగా.. ఆయనకు టికెట్ రాకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ నడుస్తోంది. 
4) ఆలూరులో మంత్రి గుమ్మనూరు జయరాం సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీని ఇక్కడ వర్గవిభేధాలు వెంటాడుతున్నాయ్.  ఐతే ఈసారి మంత్రి గుమ్మనూరును.. కర్నూలు ఎంపీ బరిలో దింపేందుకు వైసీపీ అధిష్టానం ప్లాన్‌ చేస్తోంది.
ఆలూరు టీడీపీలో ఇప్పటికే టికెట్ల లొల్లి మొదలైంది. పార్టీ ఇంచార్జిగా ఉన్న కోట్ల సుజాతమ్మతో పాటు.. వైకుంఠ మల్లికార్జున, వీరభద్రగౌడ్ టికెట్ ఆశిస్తున్నారు. ఎవరికి వారు అధిష్టానం మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆలూరులో టీడీపీ మూడు వర్గాలు విడిపోయినట్లు కనిపిస్తోంది.  
5)  పత్తికొండలో కంగాటి శ్రీదేవి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ వైసీపీకి వర్గపోరు ఇబ్బందిగా మారింది. ఎమ్మెల్యే శ్రీదేవిపై అవినీతి ఆరోపణలున్నాయి.
టీడీపీ నుంచి మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తనయుడు శ్యామ్‌బాబు ఈసారి బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. పత్తికొండ నియోజకవర్గంలో కురువ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ. దీంతో అదే సామాజికవర్గానికి చెందిన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు కూడా పత్తికొండ నుంచి టీడీపీ తరఫున టికెట్ ఆశిస్తున్నారు.
6) ఆదోనిలో సాయిప్రసాద్‌ రెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరుసగా రెండుసార్లు గెలిచిన ఆయన.. హ్యాట్రిక్‌ మీద కన్నేశారు. సాయిప్రసాద్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో వినిపిస్తున్న అవినీతి ఇక్కడ వైసీపీకి ఇబ్బందిగా మారే చాన్స్ ఉంది. ల్యాండ్ సెటిల్‌మెంట్లు, రిజిస్ట్రేషన్‌లో కమీషన్ వంటి ఆరోపణలతో.. వైసీపీ నుంచి ఎవరు పోటీ చేసిన గెలుపు కష్టమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. 
టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడుతో పాటు.. నియోజకవర్గ మాజీ ఇంచార్జి గుడిసె కిష్టమ్మ కూడా టికెట్ రేసులో ఉన్నారు.  
7)  మంత్రాలయంలో బాలనాగిరెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009 నుంచి వరుసగా ఆయనే విజయం సాధిస్తూ వస్తున్నారు. మళ్లీ వైసీపీ తరఫున ఆయనే ఈసారి కూడా బరిలోకి దిగడం ఖాయం. 
మంత్రాలయంలో ఎలాగైనా జెండా పాతాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. నియోజకవర్గం ఇంచార్జి తిక్కారెడ్డి.. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఈసారి మళ్లీ ఆయనకే టికెట్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.