క‌విత అరెస్ట్ త‌ప్ప‌దా..? అదంతా సింప‌తీ డ్రామాయేనా?

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఏడాదిగా స్త‌బ్దుగా ఉన్న కేసు మ‌రోసారి సంచ‌నాలు రేపుతోంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను ఈ స్కాంలో  సీబీఐ ఏకంగా నిందితురాలిగా చేర్చింది. ఇంత‌వ‌ర‌కు సాక్షిగా మాత్ర‌మే క‌విత‌ను  విచారించిన సీబీఐ.. ప్ర‌స్తుతం నిందితురాలిగా చేర్చ‌డంతో బీఆర్ ఎస్ వ‌ర్గాల్లో ఆందోళ‌న వ్య‌క్తం అవుతుంది. గ‌తంలో 41ఏ సీఆర్పీసీ నోటీసుల‌ను స‌వ‌రించి సోమవారం (ఫిబ్రవరి 26) విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని క‌వితకు పంపించిన నోటీసుల్లో సీబీఐ పేర్కొంది. క‌విత‌ను ఇప్ప‌టికే మూడు సార్లు సీబీఐతోపాటు ఈడీ విచార‌ణ చేసింది. అయితే, ఈసారి క‌విత విచార‌ణ‌కు వెళితే అరెస్టు ఖాయ‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇప్ప‌టికే   లిక్క‌ర్ స్కాంలో విచార‌ణ‌కు రావాల‌ని సీబీఐ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు నోటీసులు పంపించింది. ప‌లు సార్లు నోటీసులు అందించినా కేజ్రీవాల్ విచార‌ణ‌కు హాజ‌రు కాలేదు. అయితే ఈసారి కేజ్రీవాల్ తో పాటు క‌విత‌ను కూడా విచార‌ణ అనంత‌రం అరెస్టు చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు సీబీఐ వ‌ర్గాల స‌మాచారం.  తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో బీఆర్ ఎస్ వ‌ర్గాల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్నా.. మ‌రోప‌క్క సంతోషంకూడా వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికి కార‌ణం త్వరలో పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌ట‌మేన‌ంటున్నారు.

ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసు విచార‌ణ ముదుకు సాగుతున్న కొద్దీ అనేక సంచ‌ల‌నాల‌కు తెర‌లేస్తోంది. ఈ కేసులో ఇప్ప‌టికే వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయ‌న కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డిలు అఫ్రూవర్ గా మారిన విష‌యం తెలిసిందే. ఢిల్లీలోని క‌విత పీఏ అశోక్ కౌశిక్ కూడా అప్రూవ‌ర్ గా మారిపోయారు. ఈ నేప‌థ్యంలో క‌విత‌కు ఈ స్కాంలో ప్ర‌మేయం ఉంద‌ని ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో క‌విత‌ను నిందితురాలిగా చేరుస్తూ సీబీఐ నోటీసులు జారీ చేసింది. మ‌రి కొద్ది నెల‌ల్లో పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ అంశం బీఆర్ ఎస్ కు మేలు చేస్తుంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.   సీబీఐ అధికారులు క‌విత‌ను నిజంగానే అరెస్టు చేస్తే..  లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ కు సానుభూతి పవనాలు వీచే అవకాశం ఉందని  ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నార‌ని బీఆర్ ఎస్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. లిక్క‌ర్ స్కాం కేసులో క‌విత పేరును త‌ప్పించేలా ఢిల్లీ కేంద్రంలో కేసీఆర్ పావులు క‌దిపే అవ‌కాశాలు ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే,  ఎన్నిక‌లున్న నేప‌థ్యంలో కేసీఆర్ ఆ ప్ర‌య‌త్నాలు చేయ‌క‌పోవ‌చ్చున‌ని ప‌రిశీలకులు అంటున్నారు. 

లోక్‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో క‌విత‌ను నిందితురాలిగా చేర్చుతూ సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేయ‌డం తెలంగాణ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది. గ‌త కొంత‌కాలంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లిక్క‌ర్ కేసులో క‌వితను కాపాడుతున్నార‌ని బీజేపీపై ఆరోప‌ణ‌లు చేస్తుంది. బీజేపీ, బీఆర్ ఎస్ రెండు పార్టీలు ఒక్క‌టేన‌ని, అందుకే లిక్క‌ర్ స్కాం కేసులో క‌విత ఇప్ప‌టి వ‌ర‌కు అరెస్టు కాలేద‌ని కాంగ్రెస్ నేత‌లు విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ అధిష్టానం మాత్రం.. విచార‌ణ జ‌రుగుతుంద‌ని, పూర్తి ఆధారాలు సేక‌రించ‌గానే క‌విత అరెస్టు ఉంటుంద‌ని పేర్కొటోంది. అయితే, గ‌త‌ కొంత‌ కాలంగా క‌విత పేరు ఎత్త‌ని సీబీఐ.. తాజాగా లోక్ స‌భ ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ క‌వితను ఏకంగా నిందితురాలిగా చేర్చ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ వ్య‌వ‌హారం మొత్తం పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొందేందుకేన‌ని, బీఆర్ ఎస్, బీజేపీ క‌లిసి ఆడుతున్న నాట‌కంలో ఇదొక భాగ‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు పేర్కొంటున్నారు. 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా అమ‌లు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీపై ప్ర‌జ‌ల్లో రోజురోజుకు ఆద‌ర‌ణ పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో అత్య‌ధిక స్థానాల్లో విజ‌యం సాధించ‌డ‌ంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టిసారించారు. గ‌ రోజుల క్రితం జ‌రిగిన కొస్గీ బ‌హిరంగ స‌భ‌లో మ‌హ‌బూబ్ న‌గ‌ర్ అభ్య‌ర్థిని సైతం ప్ర‌క‌టించిన రేవంత్‌.. 14 పార్ల‌మెంట్ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగ‌ర‌వేయాల‌ని కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపు నిచ్చారు. ఇటీవ‌ల ప‌లు సంస్థ‌ల స‌ర్వే ఫ‌లితాల్లోనూ కాంగ్రెస్ పార్టీ అత్య‌ధిక స్థానాల్లో విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని తేలింది. ఈ నేప‌థ్యంలో బీజేపీ, బీఆర్ ఎస్ లోపాయికారి ఒప్పందం ప్ర‌కారం కాంగ్రెస్ ను ఢీకొట్టేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేసిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.

ఈ క్ర‌మంలోనే లిక్క‌ర్ స్కాం కేసులో క‌విత‌ను నిందితురాలిగా చేర్చ‌డంతో పాటు సోమవారం (ఫిబ్రవరి 26)  విచార‌ణ‌కు రావాల‌ని సీబీఐ నోటీసులు అందించింది. క‌విత విచార‌ణ‌కు వెళితే అరెస్ట్ అవ్వ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ ప‌రిణామాల‌ను లోక్ స‌భ ఎన్నిక‌ల వేల బీఆర్ ఎస్‌, బీజేపీ ఆడుతున్న డ్రామాగా కాంగ్రెస్ నేత‌లు బ‌లంగా వాదిస్తున్నారు. క‌విత అరెస్ట్ అయితే సంప‌తీ ఓట్ల‌తో బీఆర్ ఎస్ అధిక స్థానాల్లో విజ‌యం సాధించాల‌ని చూస్తున్నద‌ని, మ‌రోవైపు.. మేము మాట ఇచ్చిన ప్ర‌కారం క‌విత‌ను అరెస్టు చేశామంటూ బీజేపీ ప్ర‌జ‌ల్లోకి వెళ్లి ఎక్కువ స్థానాల్లో  కాషాయం జెండా ఎగుర‌వేయాల‌ని ప్లాన్ చేస్తున్నదని కాంగ్రెస్ నేత‌లు పేర్కొంటున్నారు. ఫ‌లితంగా కాంగ్రెస్ నిర్దేశించుకున్న 10 నుంచి 14 పార్ల‌మెంట్‌ సీట్ల ల‌క్ష్యానికి గండిప‌డుతుంద‌ని బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు భావిస్తున్నాయ‌ని కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మొత్తానికి ఎన్నిక‌ల వేళ లిక్క‌ర్ కేసు వ్య‌వ‌హారం తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.