జగన్ కు జైలు భయం!
posted on Apr 9, 2021 2:55PM
సీఎం జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం.. ఈ మాట ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ నేతలు అక్రమాస్తుల కేసులో జగన్ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమని ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ కూడా ఇదే వ్యాఖ్య చేశారు. కొన్ని రోజులుగా కమలనాధులు కూడా జగన్ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని చెబుతున్నారు. జగన్ కేసులపై విచారణ జరుపుతోంది జాతీయ దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు కూడా జగన్ కు పదవి గండం ఉందని చెబుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.
తాజాగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు సీఎం జగన్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జగన్‌ను జైలులో పెడతారనే భయంతోనే వైసీపీ ఎంపీలు పార్లమెంటులో మాట్లాడలేక పోతున్నారన్నారని ఆయన ఆరోపించారు. తన కేసుల నుంచి ఎలా బయటపడాలనే విషయంపైనే జగన్ ఆలోచిస్తున్నారని, ప్రజల సమస్యల గురించి ఆలోచించట్లేదని చెప్పారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు.. రాష్ట్రంలో వైసీపీ నేతలు ఇసుక అమ్ముకుని అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర విద్యా సంస్థలు, రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయని జగన్.. తిరుపతి ఉప ఎన్నికలో ఓట్ల కోసం మాత్రం ఇంటింటికీ లేఖలు రాస్తున్నారని విమర్శించారు. టీడీపీ పాలనలోనే తిరుపతిలో అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేపట్టారా? అని ప్రశ్నించారు. తిరుపతి ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని రామ్మోహన్ నాయుడు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.