కత్తిపోట్లతో జంట హత్య! పాపం పసిపాప..

నాలుగేళ్ల పాప. బాల్కనీలో నిల్చుని బోరున ఏడుస్తోంది. ఆ చిన్నారి ఏడుపునకు చుట్టుపక్కల వాళ్లంతా పరుగున వచ్చారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. కాప్స్ వచ్చి డోర్ ఓపెన్ చేయాలని చూస్తే తెరుచుకోలేదు. లోపలి నుంచి డోర్ లాక్ చేసి ఉంది. తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లగా.. అంతా షాక్. రక్తపుమడుగులో ఆ చిన్నారి పేరెంట్స్ చనిపోయి ఉన్నారు. ఒళ్లంతా కత్తి పోట్లు. అందుకే ఆ పాప ఏడుపు. అమెరికా న్యూజెర్సీలో భారతీయ దంపతుల అనుమానాస్పద మృతి కలకలంగా మారింది. 

మహారాష్ట్ర, బీద్‌ జిల్లాకు చెందిన 32ఏళ్ల బాలాజీ రుద్రావర్‌ ఐటీ ఉద్యోగి. 2015 ఆగస్టులో కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు. వీరికి నాలుగేళ్ల కుమార్తె. బాలాజీ భార్య ఆర్తి(30) ప్రస్తుతం 7నెలల గర్భిణి. పోలీసులు వచ్చే సరికి బాలాజీ, ఆయన భార్య లివింగ్‌ రూంలో రక్తపుమడుగులో కన్పించారు. ఇద్దరి శరీరాలపై బలమైన కత్తిపోట్లు ఉన్నాయి. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. బాలాజీనే తన భార్యను పొడిచి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఆపై అతను కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటారని అంటున్నారు. 

దంపతుల మృతిపై మహారాష్ట్రలో ఉంటున్న బాలాజీ కుటుంబానికి సమాచారమిచ్చారు. ‘‘నా కొడుకు, కోడలు చాలా ఆనందంగా ఉండేవారు. ఎవరితోనూ గొడవల్లేవు. ఎలా చనిపోయారో అర్థం కావట్లేదు’’ అని బాలాజీ తండ్రి భరత్‌ రుద్రావర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ చిన్నారి.. మృతుడి స్నేహితుడి సంరక్షణలో ఉంది.