గర్ల్‌ఫ్రెండ్ కోసం ఆ ముగ్గురు..
posted on Apr 9, 2021 3:11PM
ఒక అమ్మాయి. ముగ్గురు అబ్బాయిలు. ఆ ముగ్గురూ ఒకరికి తెలీకుండా మరొకరు ఆ యువతిని ప్రేమించారు. ఆ విషయం తెలియడంతో అంతా గొడవ పడ్డారు. నువ్వెంతంటే నువ్వెంతంటూ సవాల్ చేసుకున్నారు. గ్రౌండ్‌లో చూసుకుందామంటూ ఫైటింగ్‌కు టైమ్ ఫిక్స్ చేశారు. కట్ చేస్తే.. ఆ ముగ్గురూ డిష్యూం డిష్యూం. ఓ రేంజ్‌లో కొట్టుకున్నారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఫైటింగ్ పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. కేసు నమోదైంది.
ఆ ముగ్గురు ఇంటర్ విద్యార్థులు. అందులో ఇద్దరు మైనర్లు. రహ్మత్‌నగర్ డివిజన్‌లో ఉండే 18 ఏళ్ల యువకుడు, మరో ఇద్దరు మైనర్లు ఇంటర్ చదువుతున్నారు. వాళ్లంతా ఫ్రెండ్స్. అందులో ఒకరి మేనకోడలు ఇంటర్ చదువుతోంది. అతను ఆమెను చిన్నప్పటి నుంచీ ప్రేమిస్తున్నాడు. వన్ ఫైన్ డే.. తన లవ్ మేటర్ ఆమెకు చెప్పేశాడు. అటునుంచి 'నో' వచ్చింది. ఇక అంతే, ఆ యువకుడు లవ్ ఫెయిల్యూర్‌తో ప్రస్టేషన్‌కు లోనయ్యాడు. ఎలాగైనా తన మేనకోడలిని ప్రేమకు ఒప్పించాలని అనుకున్నాడు. అందుకు తన స్నేహితుల సాయం కోరాడు. వారు సరేనన్నారు.
అయితే, ఆ ఫ్రెండ్స్ కన్నింగ్ గాళ్లుగా మారారు. వారు కూడా ఆమెను ప్రేమించడం స్టార్ట్ చేశారు. అందులో ఒకడు ఆమె మొబైల్‌కు 'ఐ లవ్ యూ' అంటూ మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ విషయం లీక్ అయింది. విషయం తెలిసి ఆ యువకుడు తన ఫ్రెండ్‌ని నువ్వెందుకు మెసేజ్ పెట్టావ్ అంటూ నిలదీశాడు. ఆ సందర్భంలోనే మరో స్నేహితుడు సైతం తాను కూడా ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నానంటూ చెప్పేశాడు. దీంతో ముగ్గురి మధ్య లవ్ మేటర్ ముదిరింది. గొడవ మొదలైంది. అంతలోనే పెద్దదైంది. బస్తీమే సవాల్ అంటూ ఆ ముగ్గురూ సవాళ్లు విసురుకున్నారు. నిమ్స్‌మే గ్రౌండ్‌లో చూసుకుందామంటూ ఫైటింగ్‌కు స్పాట్ ఫిక్స్ చేసుకున్నారు.
గ్రౌండ్‌లో ఆ ముగ్గురు పరస్పరం కొట్టుకున్నారు. అందులో ఒకడు బ్లేడ్‌తో అటాక్ చేయడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తాలు కారాయి. బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని ఆ ముగ్గురికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు పోలీసులు.