జగన్ కు చంద్రబాబు వార్నింగ్ 

తిరుపతిలో జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సభపై రాళ్ల దాడి చేయడం ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది. రాళ్ల దాడి ఘటనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తన సభపై జరిగిన దాడిపై మరోసారి తీవ్రంగా స్పందించారు చంద్రబాబు. ఈ రౌడీయిజం ఎందుకు? చేతకాని మనుషులు.. అలిపిరి ఘటనలో మైన్స్‌కు భయపడని నేను.. గులకరాళ్లకు భయపడతానా...?  నేను అనుకుంటే ఒక్కరూ బయటకు వచ్చేవాళ్లు కాదని చంద్రబాబు అన్నారు. . రౌడీల తోకలు కట్ చేస్తామని హెచ్చరించారు. తిరుపతికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తారు.. వైసీపీ అరాచకాలతో తిరుపతి శోభ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని చంద్రబాబు  వ్యాఖ్యానించారు.

తిరుపతి టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు.టీడీపీకి  తిరుపతి కంచుకోట అని ఈ సందర్బంగా చెప్పారు.  అన్నారు.  అభివృద్ధి అంతా టీడీపీ హయాంలోనే జరిగిందని.. రెండేళ్ల వైసీపీ పాలనలో తట్ట మట్టి కూడా వేయలేదని విమర్శించారు.  ఎన్టీఆర్‌తో పాటు నేను, పార్టీ నాయకులు.. ఎవరు తిరుపతి వచ్చినా... పవిత్ర భావంతో స్వామివారి దర్శనం చేసుకునే వాళ్లం. అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. అపచారానికి దూరంగా ఉన్నాం. విద్యాసంస్థలన్నీ టీడీపీ హయాంలో వచ్చినవే. మహిళా యూనివర్సిటీ నుంచి ఐఐటీ వరకు అన్నీ టీడీపీ తీసుకువచ్చినవే. అభివృద్ధి ఒక పంథా. దాన్ని సమర్థవంతంగా ప్రజల దగ్గరకు తీసుకు వెళ్లాలి. నవరత్నాలు కావవి.. నవ మోసాలు అంటూ వైసీపీ పాలనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు.

ఉగాది  వేడుకకు టీడీపీకి చెందిన పలువురు అగ్ర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. చంద్రబాబును ఆశీర్వదించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, 'తిరుపతి ఎన్టీఆర్ భవన్ లో తెలుగుదేశం నేతలతో కలిసి ఉగాది వేడుకల్లో పాల్గొన్నాను. తెలుగు సంస్కృతిని చాటేలా జరిగిన పంచాంగ శ్రవణం, వేపపచ్చడి సేవనం వంటి కార్యక్రమాలు ఆహ్లాదాన్నిచ్చాయి. తెలుగు ప్రజలందరూ ఆనందారోగ్యాలతో, భోగభాగ్యాలతో తులతూగాలని ఈ సందర్భంగా ఆ వేంకటేశ్వరుని కోరుకున్నాను' అని తెలిపారు.