జూబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం వెనుక తెలుగుదేశం క్యాడర్?!

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించేలా పార్టీని ముందుండి నడిపించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయం సాధించారు. జూబ్లీ ఉప ఎన్నిక విజయంతో ఇటు జనంలోనే కాకుండా పార్టీ హైకమాండ్ వద్ద కూడా రేవంత్ ఇమేజ్ ఇనుమడించిందనడంలో సందేహం లేదు. నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుందనుకున్న జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దాదాపు పాతిక వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం గమనార్హం. అయితే పోలింగ్ ముగిసి ఫలితం వచ్చిన తరువాత.. ఇప్పుడు మరో చర్చ తెరపైకి వచ్చింది. ఈ ఉప ఎన్నికలో తెలుగుదేశం క్యాడర్ మద్దతు ఎవరికి లభించింది? అందుకు కారణమేంటి? అన్న చర్చ ఇప్పుడు తెలంగాణ పోలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. 

గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ విజయం వెనుక ఉన్న నిర్ణయాత్మక శక్తి తెలుగుదేశం క్యాడరే అని అప్పట్లో పరిశీలకులు సోదాహరణంగా, గణాంకాలతో సహా వివరించారు. ఇప్పుడు జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్ కు తెలుగుదేశం క్యాడర్ అండగా నిలవడం వల్లనే ఆ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో సునాయాస విజయం సాధించారని అంటున్నారు. 

ఇందుకు కారణాలు కూడా పరిశీలకులు వివరిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి  శ్రీశైలం యాదవ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నారు. ఇప్పటికి కూడా ఆయన తెలంగాణలో తెలుగుదేశం నాయకులు, శ్రేణులతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అలాగే గతంలో తెలుగుదేశంలో అత్యంత కీలకమైన, బలమైన నాయకుడైన రేవంత్ రెడ్డి పట్ల తెలంగాణ తెలుగుదేశం శ్రేణులలో అభిమానం చెక్కు చెదరలేదు. ఈ కారణంగానే జూబ్లీ బైపోల్ లో తెలుగుదేశం క్యాడర్, ఆ పార్టీ మద్దతుదారులు, అభిమానులు మొత్తంగా కాంగ్రెస్ కు అండదండగా నిలిచారని పరిశీలకులు అంటున్నారు. 

ఈ ఉప ఎన్నిక సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం కారణంగా వచ్చింది. మాగంటి గోపీనాథ్ కూడా గతంలో తెలుగుదేశం నాయకుడే. 2019, 2023 ఎన్నికలలో మాగంటి విజయం వెనుక ఉన్నది తెలుగుదేశం క్యాడరే. అయితే రాష్ట్రంలో మారిన  పరిస్థితి,  మాగంటి మరణం తరువాత తెలుగుదేశం  క్యాడర్ బీఆర్ఎస్ కు దూరం జరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే తెలుగుదేశం క్యాడర్ ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా నిలిచిందని చెబుతున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu