జూబ్లీలో ఓటమిని కేసీఆర్ ముందే ఊహించారా?
posted on Nov 15, 2025 2:45PM

బీఆర్ఎస్ చావో రేవో అన్నట్లు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జూబ్లీ హిల్ ఉప ఎన్నికలో అనూహ్యంగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కాంగ్రెస్ కు కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయింది. దాదాపు పాతిక వేల ఓట్ల తేడాతో ఇక్కడ పరాజయాన్ని మూటగట్టుకుంది. 2023 ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత జరిగిన రెండు ఉప ఎన్నికలలోనూ కూడా బీఆర్ఎస్ పరాజయం పాలైంది. అయితే కంటోన్మెంట్ పరాజయంతో పోలిస్తే ఈ పరాజయం బీఆర్ఎస్ కు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. 2023 ఓటమి తరువాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాదాపుగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు.
పార్టీ వ్యవహారాలన్నీ ఆయన కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావే ముందుండి నడిపిస్తున్నారు. అయితే జూబ్లీ ఉప ఎన్నికలో మాత్రం స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ముందుగా కేసీఆర్ పేరు కూడా ఉంది. దీంతో పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జూబ్లీ ఉప ఎన్నిక ప్రచార సారథ్యం కేసీఆర్ చేపడతారని అంతా భావించారు. బీఆర్ఎస్ క్యాడర్ కూడా అలానే అనుకుంది. అయితే కేసీఆర్ మాత్రం గడపదాటి బయటకు రాలేదు. జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారం చేయలేదు. దీంతో ఇప్పుడు పార్టీ ఓటమి తరువాత.. కేసీఆర్ జూబ్లీ ఓటమిని ముందే ఊహించారా? అన్న చర్చ మొదలైంది.
జూబ్లీ హిల్స్ లో క్షేత్రస్థాయి పరిస్థితి ఏమిటన్నది అర్ధం అయ్యింది కనుకనే కేసీఆర్ ప్రచారానికి దూరంగా ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎటూ ఓడిపోయే ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడం అనవసరమని ఆయన భావించి ఉంటారని అంటున్నారు. తాను ప్రచారం చేసిన తరువాత కూడా పార్టీ అభ్యర్థి పరాజయం పాలైతే అది గత అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం కంటే ఎక్కువ అవమానకరమని కేసీఆర్ భావించి ఉంటారని అంటున్నారు. జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారం వైపు కేసీఆర్ కన్నెత్తి కూడా చూడకపోవడంతో పార్టీ క్యాడర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నది.