బాబుకి చెప్పే ఢిల్లీకి...ఆ ఫిరాయింపు ఎంపీ కోసమే ?


ఏపీలో క్షణక్షణానికి మారుతున్న రాజకీయం విశ్లేషకులను కూడా కలవరపెడుతోంది. మొన్న ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఘోరంగా దెబ్బతినడంవలన ఏపీలో దాని పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలు పార్టీ మారి కాషాయం కప్పుకోగా మిగిలిన కొందరు నేతల మీద కూడా బీజేపీ కన్నేసింది. ఇక ఈ నేపథ్యంలో, గుంటూరు జిల్లా రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఢిల్లీలో బీజేపీ నేతలతో భేటీ అయ్యారనే వార్త నిన్న ప్రకంపనలు సృష్టించింది. ఆయనతో వెంట మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని వీరదరినీ ఇటీవలే బీజేపీలో చేరిన ఎంపీ గరికపాటి రామ్మోహన్ బీజేపీ పెద్దల దగ్గరకు తీసుకెళ్లినట్టు ప్రచారం జరిగింది. అయితే అలా ప్రచారం జరిగిన వారిలో తెలుగుదేశం అధికార ప్రతినిదిగా ఉన్న లంకా దినకర్ అనే వ్యక్తి ఒక్కరే బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.

ఈ ప్రచారం మీద ఢిల్లీలోనే ఉన్న రేపల్లె ఎమ్మెల్యే స్పందించారు. తాను బీజేపీలో చేరుతున్నానని వస్తున్న వార్తలు అబద్ధమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ను తాను కలిసినట్టు వస్తున్న వదంతులను నమ్మొద్దని కోరారు. ఈరోజు టీడీపీ మీటింగ్ ఉందని నిన్ననే తనకు ఫోన్ వచ్చిందని, వ్యక్తిగత పనుల నిమిత్తం ఢిల్లీకి వెళ్తున్నానని, రాలేననే విషయాన్ని అధినేత చంద్రబాబుకి చెప్పానని అన్నారు. అయితే గరికపాటిని ఎందుకు కలవాల్సి వచ్చిందన్న విషయం మీద కూడా ఆయన స్పందిస్తూ అనారోగ్యంతో బాధ పడుతున్న తనకు ఆప్తుడయిన గరికపాటి రామ్మోహన్ రావుని కలిసేందుకే ఇక్కడికి వచ్చానని వారి నివాసంలో తామిద్దరం కలిసి లంచ్ చేశామని అంతే నని అంతకు మించి ఏమీ లేదని అన్నారు. రేపల్లె నుండి రెండో మారు ఎమ్మెల్యేగా గెలిచిన ఈయనకు పరిటాల కుటుంబంతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.