ఎన్డీయే ప్రభుత్వంలో తెదేపాకు కీలక శాఖలు
posted on May 24, 2014 9:53AM
.jpg)
ఎన్డీయే కూటమిల భాగస్వామి అయిన తెదేపా కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో చేరబోతున్నట్లు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించినందున, అదే విషయమై బీజేపీ అగ్రనేతలతో మాట్లాడేందుకు ఆయన ఈరోజు సాయంత్రం డిల్లీ వెళ్లబోతున్నారు. ఏవో అప్రదాన్యమయిన శాఖలు కాక కీలకమయిన ఒకటి రెండు కేంద్రమంత్రి పదవులయినా తమకు ఇమ్మని చంద్రబాబు కోరాలని ఆ పార్టీ నేతలు ఆయనపై గట్టిగా ఒత్తిడి తెస్తున్నారు. కానీ బీజేపీలో ఉన్న అనేక మంది సీనియర్ నేతలకి ఇప్పటికే కీలక శాఖలన్నీ కేటాయించబడినట్లు తెలుస్తోంది గనుక తెదేపాకు కీలక శాఖలలో క్యాబినెట్ మంత్రి హోదా దక్కకపోయినప్పటికీ సహాయమంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది.
తెదేపా నుండి కేంద్రమంత్రి పదవులు ఆశిస్తున్నవారిలో సుజనా చౌదరి, సీయం. రమేష్, రాయపాటి సాంభశివరావు తదితరులు చాలా మంది పోటీలో ఉన్నారు. అందువల్ల ముఖ్యమయిన శాఖలను దక్కించుకోవడం ఒక ఎత్తయితే, వాటి కోసం పోటీలో ఉన్నవారి నుండి ఒత్తిళ్ళు తట్టుకోవడం చంద్రబాబుకి మరో ఎత్తవుతుంది. నరేంద్ర మోడీ తన మంత్రివర్గంలో సమర్ధులు, నిజాయితీపరులు, తన ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా చురుకుగా పనిచేయగలవారినే తీసుకోవాలని భావిస్తున్నందున, చంద్రబాబు అందుకు తగిన వ్యక్తులనే ఎంపికచేసుకోవలసి ఉంటుంది. ఈరోజు సాయంత్రం చంద్రబాబు బీజేపీ నేతలతో మాట్లాడిన తరువాత ఈవిషయమై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.