తెదేపా వైపు చూస్తున్న మజ్లిస్ ?

 

వాపును చూసి బలుపనుకొన్న మజ్లిస్ పార్టీకి కిరణ్ సర్కార్ నుండి బయట పడిన తరువాత వాపుకి బలుపుకి ఉన్న తేడాను గ్రహించగలిగింది. అందువల్లే, జైలు నుండి బయటకి వచ్చిన తరువాత అక్బరుద్దీన్ మరెక్కడా కూడా అసందర్భ ప్రసంగం చేసే దైర్యం చేయలేదు, అదే విధంగా ఆ మధ్య మీడియాలో ఒక వెలుగు వెలిగిన అతని సోదరుడు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ కూడా మీడియాకు మొహం చాటేశాడు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినపుడే, ‘జగన్ మంచోడనే సర్టిఫికేట్’ కూడా జారీచేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపాలనే తమ మనసులో ఆలోచనలను మజ్లిస్ స్పష్టం చేసినప్పటికీ, మళ్ళీ తన మనసు మార్చుకొనడంవలననేమో, మొన్న ఆ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలుకకుండా ఓటింగులో తెదేపా పద్ధతినే అనుసరించింది.

 

ఈ సంకేతాలు అర్ధం చేసుకొన్నతెదేపా కూడా మజ్లిస్ పార్టీతో జత కట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెడుతూ, మొట్ట మొదటి చర్యగా ఆ పార్టీ కోరుతున్నవిధంగా వచ్చేనెలలో జరగనున్న హైదరాబాద్‌ స్థానిక సంస్థ ఎన్నికల్లో మజ్లిస్‌కు మద్దతునివ్వాలని టీడీపీ నిర్ణయించుకొన్నట్లు సమాచారం.

 

ఒకవేళ, వీరిరువురి ఎన్నికల పొత్తులు ఖాయం అయినట్లయితే అది వారికి మేలు చేయడమే కాకుండా, తెరాస, కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు కొత్త సవాలు విసురుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా బలమయిన ముస్లిం ఓటు బ్యాంకు గల మజ్లిస్, బలమయిన పార్టీ క్యాడర్ గల తెదేపాలు ఏకమయితే, వారి విజయావకాశాలు గణనీయంగా పెరగవచ్చును.

 

అయితే, ఈ పరిణామాలను చూస్తూ తెరాస, కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు చేతులు ముడుచుకొని కూర్చోవు గనుక, ఆ మూడు కూడా ఎన్నికల లోపుగానే చేతులు కలిపినా ఆశ్చర్యంలేదు. తెలంగాణా అంశంపై ఏదో ఒక నిర్దిష్టమయిన ప్రకటన చేసి తెరాసను, జగన్ మోహన్ రెడ్డిని జైల్లోంచి విడుదల చేసి వైకాపాను తనలో కలిపేసుకోవడమో లేక వారితో ఎన్నికల పొత్తులు పెట్టుకొని తెదేపా+మజ్లిస్+లెఫ్ట్+లోకసత్తా కూటమిని ఎదుర్కోవడమో కాంగ్రెస్ పార్టీ చేయవచ్చును.

 

కానీ, రాష్ట్రంలో అధికారం కోరుకొంటున్న జగన్ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలు రెండూ కలిసిపనిచేయడం అసంభవం కావచ్చును. అదే జరిగితే, మళ్ళీ ఎన్నికలలో ముక్కోణపు పోటీ అనివార్యం కావచ్చును. తద్వారా వచ్చే ఎన్నికల తరువాత రాష్ట్రంలో ఏ పార్టీకి పూర్తీ మెజారిటీ లబించక రాష్ట్రం పరిస్థితి ఇంకా అద్వానంగా మారే అవకాశాలున్నాయి.