ఏపీని పట్టించుకోని టాటా గ్రూప్.. జగనన్న పాలనే శాపమా? 

ప్రభుత్వాలు ఏవైనా ఉపాధికల్పను ప్రధమ ప్రాధాన్యతగా తీసుకుంటాయి. తమ రాష్ట్రంలోని యువతకు ఉపాధి కలిగేలా చర్యలు తీసుకుంటాయి. ఇందుకోసం పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తుంటాయి. కొత్త పరిశ్రమల ద్వారా ఉపాధి లభిస్తుంది కాబట్టి.. పారిశ్రామిక వేత్తలకు వివిధ రాయితీలు ప్రకటించి తమ వైపు తిప్పుకోవాలని చూస్తాయి. అందుకే దిగ్గజ సంస్థలను ఆకర్షించడానికి రాష్ట్రాలు పోటీ పడుతుంటాయి. కాని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సర్కార్ మాత్రం అలాంటిదేమి పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

వైసీపీ ప్రభుత్వం వచ్చాకా కొత్త పరిశ్రమలు రాకపోగా.. గతంలో ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంస్థలు కూడా బైబై చెప్పేస్తున్నాయి. ఇప్పటికే చాలా దిగ్గజ కంపెనీలు ఏపీని ఇతర ప్రాంతాలకు తరలివెళ్లాయి. కొత్త కంపెనీల కోసం ఎవరూ ఏపీ వైపు చూడటం లేదు. తాజాగా తమ కొత్త పరిశ్రమ స్థాపన ఏర్పాట్లలో ఉన్న  టాటా గ్రూప్ కూడా ఆంధ్రప్రదేశ్ ను పట్టించుకున్న పాపాన పోలేదు. దక్షిణాదిలో టాటాలు సెమీ కండక్టర్స్ యూనిట్ పెట్టాలని నిర్ణయించింది టాటా గ్రూప్. సాఫ్ట్ వేర్ పరిశ్రమలో నెంబర్ వన్‌గా ఉన్న టీసీఎస్‌కు తోడుగా హార్డ్ వేర్ విషయంలోనూ రాణించాలని భావించింది. ఇందుకోసం రూ. 2200 కోట్లతో సెమీ కండక్టర్ పరిశ్రమ పెట్టాలని ప్రణాళికలు వేసింది. ఇందుకోసం తెలంగాణ, కర్ణాటక , తమిళనాడులతో టాటా సంస్థ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. ఆయా రాష్ట్రాలు ఇచ్చే ప్రోత్సాహకాలు, పరిస్థితులను బట్టి టాటాలు వచ్చే నెలలో నిర్ణయం ప్రకటిస్తారు. 

నిజానికి పారిశ్రామికంగా వెనుకబడిన రాష్ట్రానికి టాటాలు చేయూతనందించడానికి సిద్ధంగా ఉంటారు. విశాఖ, అనంతపురం, విజయవాడ వంటి చోట్ల ఇలాంటి పరిశ్రమలకు అనుకూలమైన ప్రాంతాలుగా ఉంటాయి. కాని టాటా గ్రూప్ మాత్రం తమ సెమీ కండక్టర్ పరిశ్రమ కోసం ఏపీని అసలు పరిగణలోకే తీసుకోవడం లేదు. జగన్ సర్కార్ విధానాలే ఇందుకు కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పరిశ్రమ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని తెలుస్తోంది. అనంతపురం బెంగళూరుకు సమీపంలో ఉంటుంది. ఇలాంటి అడ్వాంటేజ్‌ను వాడుకుని టాటాలకు ప్రతిపాదనలు పంపి.. మిగిలిన రాష్ట్రాల కన్నా మెరుగైన ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి పరిశ్రమను రాబడితే.. యువతకు ఎంతో మేలు జరుగుతుంది. టాటాల పరిశ్రమ వస్తే ఒక్క పరిశ్రమతో ఆగిపోదు. అలాంటి పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు చాలా వస్తాయి. వాటి వల్ల రాష్ట్రానికి మేలు. కాని జగన్ సర్కార్ మాత్రం అలాంటి ప్రయత్నాలేవి చేయడం లేదు. 

ఏపీ ‘అభయహస్తా’నికి ఎల్ఐసీ గుడ్ బై!

కానీ అంత దీర్ఘంగా ఆలోచించే నాయకులు ప్రస్తుతం ఏపీలో లేరని అంటున్నారు. టాటాలకు ఏపీ అంటే అభిమానం ఉంది. టాటా ట్రస్ట్ మొత్తం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంది. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతోంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ పర్యటనకు కూడా టాటా వచ్చారు. చంద్రబాబు సీఎంగా ఉండి ఉంటే.. ఎలాగైనా ఆ పరిశ్రమను ఏపీకి తీసుకొచ్చేవారనే చర్చ సాగుతోంది. టాటాలకు ఆ ఆలోచన ఉన్నప్పుడే ఆయన రంగంలోకి దిగేవారని, ఎలాగైనా ఒప్పంచి పరిశ్రమను ఏపీకి తీసుకువచ్చేవారని చెబుతున్నారు. ఇప్పుడు విపక్షాలను టార్గెట్ చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉన్న జగనన్న పాలనలో.. టాటా పరిశ్రమ కోసం ఏపీకి పోటీ పడే తీరిక లేదనే విమర్శలు వస్తున్నాయి. 

టాటా పరిశ్రమ ఏపీని పట్టించుకోవడం లేదనే అంశంపై డీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రానికి పరిశ్రమలు గుడ్ బై చెప్పడమే కాదు, కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చేందుకు విముఖత చూపుతూ ఇతర రాష్ట్రాల వైపు చూస్తున్నాయని వివరించారు. టాటా గ్రూపు... 300 మిలియన్ డాలర్లతో ఏర్పాటు చేయతలపెట్టిన సెమికండక్టర్ పరిశ్రమ కోసం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల వైపు చూస్తోందని వెల్లడించారు. ఆ మేరకు ఓ మీడియా సంస్థలో వచ్చిన కథనాన్ని లోకేశ్ ట్విట్టర్ లో పంచుకున్నారు. అంతేకాదు, లులూ గ్రూప్ ఏపీకి ఇక జన్మలో వచ్చేది లేదని తీర్మానించుకుందంటూ మరో వెబ్ సైట్ లో వచ్చిన కథనాన్ని కూడా లోకేశ్ ప్రస్తావించారు.

చంద్రబాబు హయాంలో వైజాగ్ పెట్టుబడిదారులకు ఎంతో ఆకర్షణీయమైన గమ్యస్థానంలా విలసిల్లిందని, కానీ జగన్ వచ్చి ఒప్పందాలను రద్దు చేయడంతో 10 వేల ఉద్యోగాలు వెనక్కి వెళ్లిపోయాయని ఆరోపించారు. "లులూ గ్రూప్ కానివ్వండి, సింగపూర్ పరిశ్రమల కన్సార్టియం కానివ్వండి, టాటా రెన్యూవబుల్ పవర్, ఆసియా పల్ప్ అండ్ పేపర్ పరిశ్రమలు కానివ్వండి ... జగన్ అతడి ముఠా కారణంగా ఏపీకి దూరమయ్యాయి. ఇక్కడి ప్రజలకు ఉపాధి దూరమైంది. ఏపీ ఇంత దుస్థితిలో చిక్కుకోవడానికి జగనే కారణం" అని నారా లోకేష్ విమర్శించారు.