మండే నుంచి శీతాకాల మంటలు.. ఏపీ ఎంపీలు ఏం చేస్తారో?

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈనెల (నవంబర్) 29 న ప్రారంభమవుతాయి. సుమారు పక్షం రోజులకు పైగా జరిగే సమావేశాలు, ఒక విధంగా ప్రభుత్వానికి చెమటలు పట్టించడం ఖాయంగా కనిపిస్తోందని రాజీకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరో వంక అధికార ప్రతిపక్షలు రెండూ కూడా అస్త్ర శస్త్రాలతో యుద్దానికి సిద్ధమవుతున్నాయి.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం గడచిన ఏడేళ్ళలో, తొలి సారిగా ప్రతిపక్షాల నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా ప్రతిఘటన ఎదుర్కుంటున్న సమయంలో జరుగుతున్న శీతాకాల సమావేశాలు గతానికి భిన్నంగా, ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా ఉంటాయని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంత వరకు ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా, ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రజాకర్షక శక్తి ముందు రాహుల్ గాంధీ సహ ప్రతిపక్ష నేతలు ఎవరు నిలవలేక పోయారు. అలాగే, ప్రజల మద్దతు దండిగా ఉందన్న భరోసాతో, విపక్షాలను  అధికార కూటమి పెద్దగా పట్టించుకోలేదు. ఒక విధంగా ప్రతిపక్షాన్ని అధికార కూటమి బేఖాతరు చేసింది. 

కానీ  ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. కొవిడ్ నేపధ్యంగా తలెత్తిన సమస్యలు, ముఖ్యంగా  ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య, వంటి సమస్యల కారణంగా ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాపులారిటీ గ్రాఫ్ కూడా నేల చూపులు చూస్తోంది. గణనీయంగా పడిపోయింది. ఈ పరిస్థితులలో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలన తగ్గించడం మొదలు కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది. అయితే, గతంలో ఎప్పుడు లేని విధంగా, ధరల పెరుగుదల, వ్యవసాయ ఉత్పాతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)వంటి కీలక సమస్యల విషయంలో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత కొనసాగుతోంది. మరో వంక  విపక్షాలు,ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా సభ లోపలే కాకుండా, సభవెలుపల కూడా ఆందోళనకు సిద్దమవుతున్నాయి. 

ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, విపక్ష కూటమి నాయకత్వం విషయంలో మమతా బెనర్జీ  తృణమూల్ కాంగ్రెస్ నుంచి వస్తున్న పోటీని ఎదుర్కునేందుకు, పెద్దన్న పాత్రను నిలుపుకునేందుకు, ప్రజాందోళనకు కూడా సిద్దమవుతోంది.ఇందులో భాగంగా     పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే, పెరుగుతున్న ధరలను నిరసిస్తూ.. కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు డిసెంబర్ 12న ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.ఈ ర్యాలీలో భాగంగా ధరల పెరుగుదలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మాట్లాడతారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
అదలా ఉంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున వివిధ పార్టీలకు చెందిన విపక్ష నేతలు దిల్లీలో సమావేశం కానున్నారు. పార్లమెంట్లో ఏకతాటిపై ఉండటం, ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. లోక్సభ, రాజ్యసభలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలకు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే. లేఖ రాశారు. కీలకమైన అంశాలను పార్లమెంట్లో లేవనెత్తేందుకు ఈ భేటీ ఉపయోగపడుతుందని సూచించారు. 

ఇదలా ఉంటే, మూడు సాగు చట్టాల రద్దుకు సంబంధించి కేంద్రం తదుపరి ప్రక్రియను ప్రారంభించింది. సోమవారం నుంచి పార్లమెంట్ శీతకాల సమావేశాలు మొదలుకానున్న నేపథ్యంలో.. వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆ చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజున  బీజేపీ  ఎంపీలందరూ లోక్‌సభకు హాజరుకావాలని ఆ పార్టీ విప్ జారీ చేసింది. ఈ మేరకు సంబంధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి. రాజ్యసభ ఎంపీలకు దీనిపై ఇప్పటికే విప్‌ జారీ అయ్యింది.
ఈసారి సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదానికి 26 బిల్లులు ఎదురుచూస్తున్నాయి. అందులో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు కూడా ఒకటి. దాంతో పాటు వివాదాస్పద క్రిప్టో కరెన్సీ బిల్లు, అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వం వాటాను 51 శాతం నుంచి 26 శాతానికి తగ్గించేందుకు ఉద్దేశించిన బిల్లు కూడా ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి.కేంద్రం గత ఏడాది వర్షాకాల సమావేశాల్లో మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. వాటిపై పంజాబ్, హరియాణా, యూపీలోని కొన్ని ప్రాంతాల రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. వారు చేపట్టిన నిరసనల్లో కొన్ని అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. వాటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. కొద్ది రోజుల క్రితం సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే, చట్టాల రద్దుతో సంతృప్తి చెందని సంఘాలు ఎం ఎస్ పీచట్టం, కేసుల ఉపసంహరణ వంటి కొత్త డిమాండ్లతో ఆందోళన కొనసాగించేందుకు నిరంయించాయి. సహజంగానే రైతుల కొత్త డిమాండ్స్’కు మద్దతు ఇస్తున్న ప్రతిపక్షాలు వాటి అమలుకు పట్టు పట్టే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే, ముందస్తు చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతు సమస్యలపై చర్చించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దానికింద పంటల వైవిధ్యీకరణ, జీరో బడ్జెట్ ఫార్మింగ్, కనీస మద్దతు ధర వంటి పలు సమస్యలపై చర్చించనున్నారు. ఈ కమిటీలో రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులు కూడా భాగమవుతారని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వెల్లడించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన తర్వాత కూడా రైతులు నిరసనలు కొనసాగించడంలో ఎలాంటి అర్థం లేదు. వారంతా తమ ఆందోళనను విరమించుకొని ఇంటికి వెళ్లాలని కోరుతున్నానని తోమర్ మీడియాతో వెల్లడించారు. మరోపక్క నిరసనల్లో భాగంగా రైతులపై పెట్టిన కేసులు రాష్ట్రాల పరిధిలో ఉన్నాయని మంత్రి అన్నారు. వాటి ఉపసంహరణపై రాష్ట్రాలదే నిర్ణయమన్నారు. అయితే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదటి రోజునుంచే సభలో ఉష్ణోగ్రతలు భాగ్గుమందం ఖాయమని పరిశీలకులు భావిస్తున్నారు.