లోకేశ్ కు ఇదే నా సలహా..

 

ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై జరిగిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. ఇక ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగింది అనుకునే లోపే.. నంది అవార్డుల రచ్చపై స్పందించిన లోకేశ్ వ్యాఖ్యలపై మళ్లీ దుమారం రేగుతోంది. నంది అవార్డుల వ్యవహారంలో పలువురు సినీ పెద్దలు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన సంగతి తెలుసుకదా. దీంతో వాటిపై స్పందించిన లోకేశ్.. ఆంధ్రాలో ఆధార్ కార్డు లేనివారు కూడా ఈ అంశంపై విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. దీంతో లోకేశ్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఇక లోకేశ్ వ్యాఖ్యలపై స్పందించిన పోసానీ అయితే..పలు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇక ఇప్పుడు  ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ దీనిపై మరోసారి స్పందించారు.

 

అవార్డుల ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో చాలా హుందాగా వ్యవహరించారని... కానీ మంత్రి లోకేష్ ఈ అంశంపై స్పందించిన తీరు మాత్రం బాగోలేదని అన్నారు. ఆంధ్రాలో ఆధార్ కార్డు లేనివారు కూడా ఈ అంశంపై విమర్శలు చేస్తున్నారంటూ లోకేష్ మాట్లాడారని... ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి అబ్బాయి ఇలాంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయడం తనకు బాధను కలిగించిందని చెప్పారు. లోకేష్ ఏదైనా మాట్లాడేముందు ఆయన తండ్రి పరువు గురించి ఆలోచించుకోవాలని సూచించారు. అంతేకాదు మీరు ఇప్పటికీ హైదరాబాదులోనే ఉంటున్నారు, మీకు మాట్లాడే అర్హత ఉందా? అని తాము అడిగితే బాగోదని... చాలా అసహ్యంగా ఉంటుందని చెప్పారు. లోకేష్ చాలా హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు. అవగాహన లేకుండా మాట్లాడి మీ పరువు, మీ నాన్నగారి పరువు, రాష్ట్రం పరువు తీయవద్దని సూచించారు.