ఫ్రస్టేషన్ లో తలాక్ చెల్లదు

అఫ్జల్ కు ఇటీవలె నిఖా( పెళ్లి) అయ్యింది.  చెడు వ్యసనాలకు అలవాటుపడ్డ స్నేహితులతో  తిరిగే వాడు. అప్జల్ ప్రతీ రోజు  అర్ధ రాత్రుళ్లు ఇంటికి తప్ప తాగి వచ్చేవాడు. భార్యను బాగా కొట్టేవాడు. ఇది కొత్త పెళ్లికూతురుకు  నచ్చలేదు. తల్లిదండ్రులకు విషయం చేరవేసింది.

కూతురు బాధను అర్థం చేసుకున్న తల్లిదండ్రులు అదే బస్తీలో ప్రవచనాలు (తక్రీర్ ) ఇచ్చే మౌలానాను ఆశ్రయించారు. మౌలానా అభిప్రాయం  ప్రకారం వారు నడచుకోవాలనుకున్నారు. ఒక రోజు మౌలానా దగ్గరికి వచ్చారు. తమ కూతురు అత్తవారింట్లో పడుతున్న బాధలను పూసగుచ్చినట్టు వివరించారు. వచ్చిన వారికి  మౌలానా ఆతిథ్యం ఇచ్చారు.  వాళ్లను దివాన్ ఖానాలో కూర్చోబెట్టి మంచి నీళ్లు ఇచ్చాడు మౌలానా సాబ్  మా  కూతురుకు తలాక్(విడాకులు) ఇప్పించాలని వేడుకున్నారు. తలాక్ లను  మొదట్నుంచి మౌలానా వ్యతిరేకించేవారు. వారిని సముదాయించాలని ఆయనప డిసైడ్ అయ్యారు. 


 మౌలానా: అప్జల్ మంచి యువకుడే. కానీ ఈ మధ్య చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడని అప్జల్ అన్న జాఫర్ తనతో చెప్పిన విషయాన్ని మౌలానా గుర్తు చేశారు.
 తలాక్ అనేది అంత మంచి పద్దతి కాదు. భార్యాభర్తలను విడదీయకుండా ఇస్లాం అనేక నియమాలను రూపొందించింది.  తలాక్ కోరుకునే ముందు భార్యాభర్తలను కొంత కాలం దూరంగా ఉంచాలి. మరికొంత కాలం గడిచిన తర్వాత ఇరు కుటుంబాలు చర్చలు జరపాలి. ఈ చర్చలు గుంపుగుంపులుగా వచ్చి జరపకూడదు. నలుగురిలో పాము చావదు. ఇరు కుటుంబాలమధ్య ఒకే అభిప్రాయం రావడం కష్టం. పైగా మరిన్ని గొడవలు జరుగుతాయి.  అమ్మాయి తరపున ఒకరు, అబ్బాయి తరపున ఒకరు సంప్రదింపులు జరపాలి. కాలమే  సమాధానం చెబుతుంది. ఇద్దరి అభిప్రాయం మారొచ్చు. మళ్లీ సఖ్యత రావొచ్చు అని మౌలానా సముదాయించాడు. 
తలాక్ తీసుకునే ముందు మధ్యే మార్గంగా వేర్వేరుగా ఉండడమే బెటర్. నచ్చజెప్పి చూడాలి.  అల్లా కూడా ఇదే చెబుతున్నాడు.  చాలామంది దంపతులు ప్రస్తుతం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. కొన్ని రోజుల తర్వాత ఈ దంపతులు ఒక్కటయ్యే చాన్స్ ఉంది. ఒకసారి తలాక్ తీసుకుంటే మళ్లీ కలవడం కష్టం. తలాక్ ఇచ్చి తప్పు చేశామన్న భావన రాకూడదు. కోపంతో ఉన్న సమయంలో  తలాక్ వంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఇస్లాం ప్రకారం  అమ్మాయి అబ్బాయికి తలాక్ ఇవ్వడం  కుదరదు. ఇస్లాంలో భర్తే శిరోధార్యం. అంతమాత్రాన భర్తకు బానిసకాకూడదు. భర్తలకు తలాక్ ఇస్తామని భార్యలు హెచ్చరించడం తగదు. సరదాగా  కొందరు భార్యలు  తమ భర్తలకు తలాక్ హెచ్చరికలు చేస్తుంటారు. ఇది ఇస్లాంలో నిషిద్దం. కోపంలో తలాక్ ఇవ్వడం షరియత్ లో లేదు. కోపంలో మెదడు పని చేయదు. ఆవేశంలో సరైన నిర్ణయం తీసుకోలేరు. మద్యం మత్తులో తలాక్ చెల్లదు. తలాక్ వల్ల భర్త ఎక్కువ డిప్రెషన్ లో వెళతాడు. పిల్లలు ఉన్న భార్య డిప్రెషన్ లో వెళ్లే అవకాశం తక్కువ.  ఇస్లాంలో  పెళ్లి సివిల్ కాంట్రాక్ట్  అని చెప్పొచ్చు అని మౌలానా వివరించాడు. మౌలానా  ప్రవచనం విన్న తల్లిదండ్రులు తమ నిర్ణయం మార్చుకున్నారు. తమ అల్లుడులో ఉన్న పాజిటివ్ అంశాలను వెతికే పనిలో పడ్డారు. అల్లుడికి సర్ది చెప్పే ప్రయత్నాలు ప్రారంభించారు. 

బదనపల్లి శ్రీనివాసాచారి