కొరియోగ్రాఫర్ జానీకి రిమాండ్!

తన దగ్గర పనిచేసే డాన్సర్ మీద అత్యాచారం జరిపిన నేరం మీద పోలీసులు అరెస్టు చేసిన కొరియోగ్రాఫర్ జానీకి ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ (అక్టోబర్ 3 వరకు) విధించింది. దీంతో పోలీసులు కొరియోగ్రాఫర్ జానీని చంచల్‌గూడ జైలుకు తరలించారు. కొరియోగ్రాఫర్ జానీ తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. అత్యాచారానికి గురైన యువతిని జానీ దురుద్దేశంతోనే అసిస్టెంట్‌గా చేర్చుకున్నట్లు ఆ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 2020 సంవత్సరంలో ముంబైలోని ఒక హోటల్‌లో జానీ బాధితురాలిపై అత్యాచారం చేశాడని, అప్పడు ఆమె వయసు పదహారేళ్ళని పేర్కొన్నారు. గత నాలుగేళ్ళుగా బాధితురాలిపై జానీ అనేకసార్లు లైంగిక దాడి చేశాడని ఆ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని బయటపెడితే సినిమా ఆఫర్స్ రాకుండా చేస్తానని బెదిరించినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో వుంది.   జానీ భార్య కూడా బాధితురాలిని బెదిరించిదని రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. ఇదిలా వుంటే, ఈ కేసుకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తామని, న్యాయస్థానంలో నిజానిజాలు తేలుతాయని జానీ మాస్టర్‌  భార్య అయేషా  చెప్పారు.