లివర్ కు ముప్పొస్తే ఇంత దారుణం జరుగుతుందని తెలుసా??
posted on Jan 18, 2023 9:30AM
మన శరీరంలో ముఖ్యమైన అంతర్గత అవయవాలలో లివర్ చాలా ముఖ్యమైనది. నిమిషానికి 1.2 లీటర్ల రక్తం లివర్ ద్వారా ప్రవహిస్తుంటుంది. హిపాటిక్ వీన్స్ ద్వారా లివర్ నుంచి రక్తం బయటకు వెళ్తుంది. ఈ వీన్స్లో అడ్డం పడితే హిపాటిక్ వీన్ థ్రాంబోసిస్ వస్తుంది. ఇది చాలా అపాయకరమైన అనారోగ్యము కానీ హెపాటిక్ వీన్స్ సాధారణంగా బ్లాక్ కావు.
లివర్ రెండు లోబ్స్ లోను బైల్ రసం తయారవుతుంది. ఈ రసం బైల్ డక్ట్ అనే మార్గం ద్వారా ఆహార నాళాన్ని డుయోడినమ్ దగ్గర చేరుకుంటుంది. బైల్ డక్ట్, డుయోడినమ్ లోకి ప్రవేశించే ప్రదేశంలో ఒక కవాటము ఉంటుంది. ఆహార పదార్థాలు జీర్ణమవుతూ డుయోడినమ్ లోకి ప్రవేశించినప్పుడు మాత్రం బైల్ రసం లోపలికి వెళ్ళేట్లు చేస్తుంది. మిగతా సమయంలో ఈ రసాన్ని డుయోడినమ్ లోకి రానీయదు. అప్పుడు లివర్లో తయారైన బైల్ రసమంతా మరో మార్గం గుండా గాల్ బ్లాడర్ కి వెళ్ళి నిల్వ ఉంటుంది, అవసరమైనప్పుడు డుయోడినమ్ లోకి వస్తుంది. లివర్, గాల్ బ్లాడర్ నుంచి వచ్చే మార్గాలే కాకుండా పాంక్రియాజ్ నుంచి వచ్చే మార్గం కూడా వీటితో కలసి కామన్డక్ట్ ఏర్పడి, అది డుయోడినమ్కి కలుపబడి ఉంటుంది. అంటే పాంక్రియాటిక్ జ్యూస్ కూడా బైల్ రసంతో పాటే డుయోడినమ్లో కలుస్తుందన్నమాట! కాబట్టి ఈ మార్గంలో ఎక్కడ అడ్డంకి ఏర్పడ్డా ఈ రసాలు డుయోడినమ్ లోకి ప్రవేశించలేవన్నమాట! పాంక్రియాటైటిస్ అనే జబ్బు మనదేశంలో ఎక్కువగా వస్తోంది. సరయిన పోషకాహారం లేక పాంక్రియాజ్ దెబ్బ తింటే ఇన్సులిన్ ఉత్పత్తి ఉండదు. దాంతో రక్తంలో షుగర్ పెరుగుతుంది.
మన శరీరంలో మెదడు తర్వాత అతి క్లిష్టమైన, ముఖ్యమైన అవయవము లివర్. ఇది రక్తాన్ని శుభ్రం చేయడం, బైల్ రసాన్ని ఉత్పత్తి చేయడంతో పాటు మరెన్నో ముఖ్యమైన పనుల్ని కూడా నిర్వర్తిస్తోంది. మనం తిన్న ఆహారాన్ని కేలరీస్ లో శక్తిగా మార్చేది లివరే! క్రొవ్వుల్ని వాటిలో కరిగి వుండే విటమిన్లని స్వీకరించేది లివరే.. లివర్ కె అనారోగ్యం వస్తే క్రొవ్వులు శరీరంలో స్వీకరించబడకుండా మలము ద్వారా బయటకు వెళ్ళిపోతుంటాయి. విటమిన్ ఎ.డి.కె లు క్రొవ్వుల్లో కరిగి ఉంటాయి. కాబట్టి లివర్ కి జబ్బు వస్తే ఈ విటమిన్లను శరీరం స్వీకరించలేదు. ఇవన్నీ మలము ద్వారా బయటకి వెళ్ళిపోతుంటాయి.
విటమిన్ 'ఎ' తగ్గితే రక్తం గాయం ద్వారా బయటికొచ్చేప్పుడు స్రావం ఆగదు. లివర్ అనారోగ్యం వస్తే ఈ విటమిన్లని ఇంజక్షన్స్ ద్వారా ఇవ్వాల్సి వస్తుంది. సెక్స్ హార్మోన్ల ఉత్పత్తిని కూడా లివర్ క్రమపరుస్తుంటుంది. లివర్ అనారోగ్యం వల్ల ఆడవాళ్ళలో రుతుక్రమం దెబ్బతింటుంది. మగవాళ్ళలో శరీరం మీద వెంట్రుకలు రాలిపోవడం, ఇంపాటెన్సీ కలగవచ్చు. ఏవైనా కణాలు దెబ్బతింటే, ఆ ప్రాంతంలో క్రొత్త కణాలని ఉత్పత్తి చేసే ఎంజైమ్స్, ప్రొటీన్స్ ను కూడా లివరే తయారు చేస్తుంటుంది. కాబట్టి లివర్ కి అనారోగ్యం వస్తే దెబ్బతిన్న కణాల స్థానంలో క్రొత్త కణాలు తయారవడం కూడా ఆలశ్యమవుతుంది. లివర్ జబ్బు వున్న వాళ్ళకు యాక్సిడెంట్లయినా, ఆపరేషన్ అయినా తిరిగి మామూలు స్థితికి రావడానికి ఆలశ్యమవుతుంది.
గుండె, ఊపిరితిత్తులు మొదలైన అవయవాలకి అనారోగ్యము వస్తే నొప్పి ద్వారా మను వెంటనే తెలుసుకోగలం, కానీ లివర్ అనారోగ్యం ప్రారంభదశలో ఇలాంటి నొప్పులేమీ ఉండవు కాబట్టి వస్తున్న ఆపాయాన్ని ముందు పసిగట్టలేము. కాబట్టి లివర్ విషయంలో అందరూ తగినంత జాగ్రత్తగా ఉండటమే శ్రీరామరక్ష!!