మందు చేసే మాయ మీకు తెలుసా?

"అవును! ఇంతకీ పార్టీ ఎప్పుడు?" ఎవరు ఏ శుభవార్త చెప్పినా ఎదుటి వ్యక్తి నుండి వచ్చే మొదటి ప్రశ్న ఇది.


'పార్టీ' అనే దానికి ఇప్పుడు అర్ధం చాలా వరకు మారిపోయింది. 'డ్రింక్స్' లేని పార్టీ పార్టీయే కాదు అనే మిత్రులూ మన మధ్య ఉన్నారు. ఇలా ఏదో సరదాకి ప్రారంభమై ఈ మధ్యపానానికి బానిసలై పీడింపబడుతున్న వాళ్లు, ప్రాణాల్ని కూడా కోల్పోయిన వాళ్లు ఎందరో ఉన్నారు.


'బాధల్ని మరచిపోవడానికి ఇదే మంచి మందు' అంటూ మందు కొట్టడాన్ని ప్రారంభించి మరిన్ని బాధల్లో కూరుకుపోయిన వాళ్లూ కోకొల్లలు ఉంటారు.  ఏవో కొన్ని కథల్లో చదివో, కొన్ని సినిమాల్లో చూసో ప్రేమ విఫలమైనా, కష్టాలు వచ్చినా ఇలా మందు ఒక్కటే మార్గమని భావించే అమాయకులూ మనలో లేకపోలేదు.. కారణమేదైనా పర్యవసానమే 'ముందు'కి బానిస కావడం! సరదాకి ప్రారంభించి సమస్యయి కూర్చుంటుంది. విశ్రాంతి కలిగిస్తుందని తీసుకుంటున్నది కాస్తా ఆరోగ్యాన్ని చెడగొట్టి, అవిశ్రాంతిని పెంచుతుంది!!! బాధల్ని మరచిపోవాలని మొదలు పెట్టింది. మరింత బాధాకరంగా తయారవుతుంది!!! మనిషిలో ఒంటరితనాన్ని, హింసా ప్రవృత్తిని పెంచుతుంది!!!


అన్ని రకాల మద్య పానాలలోను ఉండేది ఇథైల్ ఆల్కహాల్. ఇది పులియబెట్టడం వలన వస్తుంది. త్రాగడం ప్రారంభించిన ప్రతి పదిమందిలోను ఒకళ్లు తప్పక దానికి బానిసలైపోతున్నారు. ఆల్కహాలు మనసుని ఉత్తేజపరచదు. కేంద్రనాడీ మండలాన్ని నిరుత్సాహ పరచి మెదడు, వెన్నెముకల పని తీరుని తగ్గిస్తుంది. మద్యాన్ని సేవిస్తే అది మిగతా పదార్థాలలా జీర్ణమై రక్తంలో కలువదు. సరాసరి రక్తంలో కలుస్తుంది. అందుకని త్రాగిన క్షణాల్లోనే శరీరంలోని అన్ని భాగాలకు చివరకు మెదడుకు కూడా ఇది ప్రవహిస్తుంది. మెదడుని మొద్దుబారేట్లు చేస్తుంది. 


దాంతో త్రాగిన వ్యక్తి ప్రవర్తనలో మార్పు కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. దీనివల్ల ఆ వ్యక్తికి, అతని తాలూకు వాళ్లకి ఎన్నో నష్టాలు కలుగవచ్చు. ఒక డ్రింక్ త్రాగిన 45 నిమిషాల తరువాత మాత్రమే ఆ ఆల్కహాల్ని లివర్ బ్రధ్ధలు కొట్టగలదు. అందుకనే నిర్దేశించిన కాలంలో ఇంతకన్నా ఎక్కువ ఆల్కహాల్ త్రాగితే లివర్ దెబ్బతింటుంది. అందరూ అనుకున్నట్టు చన్నీటి స్నానం, మజ్జిగ, కాఫీ, భోజనం మొదలైనవేవీ ఆ వ్యక్తిని మామూలు స్థితిలోకి తీసుకురాలేవు. కేవలం త్రాగిన పరిమాణానికి తగ్గ సమయము తర్వాతే మామూలు స్థితికి రాగల్గుతాడు.


 రెండు పెగ్గులు తాగితే అది తగిన గంటలోపు చెమటలు పట్టడం, విచక్షణ కొద్దికొద్దిగా తగ్గడం మొదలవుతుంది. మూడు పెగ్గులకి తల తిరగడంతో పాటు విచక్షణ బాగా దెబ్బతింటుంది. అయిదారు పెగ్గులకి సరిగ్గా కనిపించకపోవడం, మాటలు తడబడడం, రికలక్షన్స్ బాగా నెమ్మదైపోవడం జరుగుతుంది. ఎనిమిది, తొమ్మిది పెగ్గులైతే బాలన్స్ పూర్తిగా తప్పుతుంది. ఒకళ్ళు ఇద్దరుగా కనిపిస్తారు, స్పృహ తప్పిపోవచ్చు. అంతకు మించితే ప్రాణమూ పోవచ్చు.


తన అలవాటుమీద ఎప్పుడైతే తన అదుపు తప్పిందో అప్పుడే ఆ వ్యక్తి కష్టాలలో పడ్డట్లు. ఈ మద్యపాన అలవాటుని ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికన్ మెడికల్ అసోసియేషన్ 1956లోనే ఒక జబ్బుగా గుర్తించాయి. మానాలనే ధ్యాస ఉండాలే గాని ఈ 'జబ్బు'ని నయం చేయడం అసాధ్యమేమీకాదు. త్రాగుడు అలవాటే ఓ జబ్బు. అంతేగాని ఇది ఏ జబ్బుకీ లక్షణం కాదు. అందుకని దీని ద్వారా వచ్చే జబ్బుల్ని వేటిని నయం చేయాలన్నా మొదట  ఈ అలవాటుని మానిపించాలి. 


ఈ జబ్బుని నయం చేసుకోవడానికి ప్రయత్నించకపోతే రోజురోజుకి పెరిగిపోతుంది. రోజూ కొద్దికొద్దిగా తీసుకుంటున్న చాలా కాలమయ్యే సరికి దాని ప్రభావం ఆరోగ్యం మీద ఉండి తీరుతుంది. మొదట్లో కొద్ది పరిమాణమే ఆనందాన్ని కలిగించవచ్చు. కానీ శరీరం త్వరలోనే దానికి అలవాటు పడడంతో అంతకన్నా ఎక్కువ తీసుకుంటేగాని 'కిక్' ఫీలవ్వరు. ఇలా క్రమక్రమంగా ఈ అలవాటు పెరిగిపోతుంది. ఆల్కహాల్లో ఉండేవి 'ఎంప్టీ కాలరీస్' అందుకని సరైన ఆహారం తీసుకోకపోతే శరీరం ఇంకా త్వరగా దెబ్బతింటుంది. ఇదీ మందు చేసే మాయ..


                               ◆నిశ్శబ్ద.