ఫ్రిజ్ సమస్య తీర్చమంటూ సుష్మాకి ట్వీట్... నేను ఏం చేయలేను..
posted on Jun 14, 2016 12:27PM

సోషల్ మీడియా ఎక్కుప ప్రాచుర్యం పొందిన తరువాత రాజకీయ నాయకులు ప్రజలకు మరింత చేరువయ్యారనే చెప్పవచ్చు. ఏకంగా వాటి ద్వారానే తమ సమస్యలను నేతలకు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి తన సమస్యను వివరిస్తూ విదేశాంగ శాఖ, కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ కు ట్వీట్ చేశాడు. ట్విట్టర్లో ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ.. తాము ఆపదలో ఉన్నామంటూ చిన్న ట్వీట్ చేస్తే చాలు.. సుష్మాస్వరాజ్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటారు. అలాంటి ఆమె సదరు ట్వీట్ చూసి ఒకింత షాక్ కు గురై.. ఆతరువాత ఆ వ్యక్తికి సమాధానం ఇచ్చారు. ఇంతకీ సుష్మ షాక్ అయ్యేలా చేసిన ట్వీట్ ఏంటనుకుంటున్నారా..!
కేంద్రమంత్రులు సుష్మాస్వరాజ్, రామ్‌విలాస్ పాసవన్‌ను ట్యాగ్ చేస్తూ.. వెంకట్ అనే పేరుతో ఉన్న ట్విట్టర్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. అదేంటంటే.. ‘డియర్ మినిస్టర్స్.. ఓ కంపెనీ నాకు చెడిపోయిన రిఫ్రిజిరేటర్ అమ్మింది. అడిగితే.. వారు ఫ్రిజ్ వెనక్కి తీసుకోడానికి సిద్ధంగా లేరు సరి కదా.. బాగుచేయించుకోమని సలహా ఇచ్చారు’ అని ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌కు సుష్మాస్వరాజ్ చాలా నిజాయతీగా జవాబిచ్చారు. ‘రిఫ్రిజిరేటర్ విషయంలో తాను సాయం చేయలేనని.. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో తాను బిజీగా ఉన్నానని’ సుష్మ ట్వీట్ చేశారు.