ప్రత్యేకరాయలసీమకు పెరుగుతున్న స్పందన?
posted on Jul 17, 2012 12:19PM
రాయలతెలంగాణా ఇస్తామని కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం కదిపిన అంశం ఇప్పుడు ఒక ప్రత్యేక డిమాండుకు ప్రాతిపదక అయి కూర్చుంది. దీని కారణంగానే తమకు ప్రత్యేక రాయలసీమను ఇవ్వాలని కొత్తడిమాండు తెరపైకి వచ్చింది. అంతేకాకుండా ఈ డిమాండుకు నానాటికీ ఆదరణ పెరుగుతోంది. రాయలసీమలోని పలుప్రాంతాల నుంచి ఈ డిమాండుకు స్పందన వస్తోంది. కర్నూలులోని కొండారెడ్డి బురుజు కేంద్రంగా ఈ డిమాండుకు టిడిపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి బైర్రెడ్డి రాజశేఖరరెడ్డి బీజం వేశారు. రాయలసీమ పరిరక్షణ సమితిని కూడా ఏర్పాటు చేశారు. ఆయన ఈ సమితికి అధ్యక్షునిగా ఉండి అందరినీ కూడగట్టే ప్రయత్నాలు ప్రారంభించారు.
చారిత్రక ప్రాశస్త్యం ఉన్న తమ రాయలసీమకు ఫ్యాక్షన్ ప్రాంతమని అపవాదు సృష్టించి రాయలసీమ వాసుల మంచితనాన్ని, గొప్పదనాన్ని మరుగున పడేశారని రాజశేఖరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎందరో ప్రముఖుల పుట్టినిల్లు అయిన రాయలసీమను గతంలో రత్నాలసీమ అనేవారని, ఇప్పుడు నిత్యం ఫ్యాక్షన్ తగాదాలతో మిగిలి ఉన్న ప్రాంతమంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖ్యాతిగడిరచిన ఇంజనీరు విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్రాన్ని పాలించిన నేతలు రాయలసీమలోనే పుట్టారని గుర్తుంచుకుని తమ డిమాండుకు కేంద్రం ఆమోదాన్ని తెలపాలని కోరుతున్నారు. తెలంగాణావాదులు కావాలనే తమపై బురదజల్లుతున్నారని, కర్నూలు కేంద్రంగా తమకు ప్రత్యేకరాష్ట్రాన్ని ఆమోదిస్తే దారిద్య్రంతో సతమతమవుతున్న తమ ప్రాంతం తిరిగి రత్నాలసీమ అని పొగడ్తలను అందుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఈయనకు మద్దతుగా కొండారెడ్డిబురుజు చుట్టూ క్యాండిల్స్‌తో ప్రదర్శన చేశారు. కేంద్రప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి తమకు న్యాయం చేయాలని రాజశేఖరరెడ్డి డిమాండు చేశారు.