భారత్ పై ఆత్మాహుతి దాడులు.. కలకలం రేపుతున్న మసూద్ అజహర్ ఆడియో
posted on Jan 12, 2026 9:42AM

గణతంత్ర దినోత్సవ వేడుకల తరుణంలో భారత్ పై భారీ ఎత్తున దాడులకు పాకిస్థాన్ ఉగ్ర సంస్థ జైషే హమ్మద్ కుట్ర పన్నుతోంది. భారత్ పై దాడులకు వేల మంది బాంబర్లు అంటే ఆత్మాహుతి దళ సభ్యులు రెడీగా ఉన్నారన్న సమాచారం కలకలం రేపింది. ఇందుకు సంబంధించి నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ఆడియో క్లిప్పింగ్ ఆదివారం సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది.
మసూద్ అజహర్ గొంతుకగా చెబుతున్న ఈ ఆడియో క్లిప్పింగ్ లో భారత్‌పై దాడులకు వేలమంది ఆత్మాహుతి దళ సభ్యులు సిద్ధంగా ఉన్నాన్న హెచ్చరికలు కలకలం రేపాయి. ఈ ఆడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. ఆ ఆడియో మేరకు వెయ్యి మందికి పైగా ఆత్మాహుతి సభ్యులు భారత్ పై ఏ క్షణంలోనైనా దాడికి దిగే అవకాశం ఉంది. తమ యోధులు ప్రాపంచిక సుఖాల కోసం కాకుండా షహాదత్ అంటే అమరత్వం బలిదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆ ఆడియో పేర్కొంది. ఇలా అమరత్వం కోసం భారత్ పై ఆత్మాహుతి దాడులకు సిద్ధంగా ఉన్న వారి సంఖ్య పదులు, వందలు, వేలూ కాదనీ, అంతకు మించి అని ఆ ఆ ఆడియోలో స్పష్టంగా ఉంది. అయితే ఈ ఆడియో ప్రామాణికతపై ఇంత వరకూ ఎటువంటి స్పష్టతా లేదు.
అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి మసూద్ అజహర్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పాకిస్థాన్ లో ఆ నిషేధిత ఉగ్ర సంస్థ అధినేతకు రాచమర్యాదలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ లో రాజభోగాలు అనుభవిస్తూ.. అక్కడ నుంచి భారత్‌పై విషం చిమ్ముతూ మసూద్ అజహర్ పలు ఉగ్రదాడులకు కుట్రపన్నిన సంగతి తెలిసిందే. 2001 పార్లమెంట్ దాడి, 2008 ముంబై దాడులతో సహా పలు భారీ ఉగ్రవాద ఘటనలకు మసూద్ అజహరే సూత్రధారి అన్న సంగతి విదితమే. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ భారీగా నష్టపోయింది.
ఆ సంస్థకు చెందిన అనేక మందిని భారత్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ లో భాగంగా జరిపిన దాడులలో హతం చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మసూద్ అజహర్ విడుదల చేసినట్లుగా చెబుతున్న ఆడియో హెచ్చరిక ఆందోళన కలిగిస్తున్నది. ఈ హెచ్చరికల నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దుల వెంబడి గస్తీని కట్టుదిట్టం చేశాయి.