ప్రపంచాన్ని పునీతం చేసే దయాగుణం!

ఈ ప్రపంచంలో ఎన్నో మనస్తత్వాల మనుషులు ఉంటారు. ఒక్కొక్కరిలో ఒక్కొ గుణం మనకు అనుభవంలోకి వస్తుంది. అయితేయాన్ని గుణాలలోకి దయ చాలా గొప్పదని అంటారు. శత్రువులను కూడా క్షమించి తనవారిలా మార్చుకునే లక్షణాన్ని దయ మనుషుల్లో పెంపొందిస్తుంది. 


దయ గురించి సుమతీ శతక కర్త ఇలా చెబుతాడు..


తన కోపమె తన శత్రువు,

తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ

తన సంతోషమె స్వర్గము,

తన దుఃఖమె నరక మండ్రు తథ్యము సుమతీ!!


దయ మనిషికి చుట్టంలాగా ఉంటే అది మనిషి జీవితాన్ని స్వర్గతుల్యం చేస్తుంది. ఇప్పుడు ఈ దయ గురించి ఎందుకంత చర్చ అనే అనుమానం అందరికీ వస్తుంది. అయితే.. మనిషిలో దయా గుణం పెంపొందడానికి, దయా గుణం ఇతరుల పట్ల చూపించవలసిన ఆవశ్యకత గురించి చర్చించడానికి ఒకరోజు కేటాయించారు. అదే "National Rondom Acts Of Kindness Day"..


ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీన "నేషనల్ రాండం యాక్ట్స్ ఆఫ్ కైండ్ నెస్ డే" జరుపుకుంటారు. ఈ ప్రపంచంలో ఈ దినోత్సవాలను జరుపుకోవడం కంటే ముందే భారతీయ ధర్మంలో జాలి, కరుణ, దయ మొదలైన గుణాలను పెంపొందించుకోవాలని నీతి కథల నుండి పురాణ కథల వరకు అన్నింటిలో భాగం చేసి చెప్పారు. బుద్ధుడు అన్నాడు దయ, కరుణ మనుషుల్లో ఉండాలని, అవి అహింసను రూపుమాపే గొప్ప ఆయుధాలు అవుతాయి. అడుగు అడుగులో..పలుకు పలుకులో చిన్నతనం నుండి పిల్లలకు నీతి కథలు, నీతి వాక్యాలు, దయ, కరుణ వంటి గుణాలు నూరిపోస్తూ పెంచుతాం. అయితే ఈ జాలి, కరుణ, దయ అనేవి కేవలం మాటల్లో చెప్పుకునేవి కాదు. చేతల్లో చూపించాల్సినవి. 


మనం ఒకరి పట్ల దయతో, ప్రేమతో ప్రవర్తిస్తే.. ఇతరులు ఇంకొకరి పట్ల అదే విధంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. సరిగ్గా గమనిస్తే ఈ ప్రపంచంలో మనిషి తనకు ఏ అనుభూతి ఎదురైతే అదే ప్రపంచంలో ఉందని గట్టిగా విశ్వసిస్తాడు. హింసకు గురయ్యే మనిషి ప్రపంచమంతా హింసే.. ప్రతి వ్యక్తి ఇతరులను హింసకు గురిచేస్తూ ఉంటారని అనుకుంటారు. అదే ఒక వ్యక్తికి దయాపూరిత అనుభవం ఎదురైతే ఆ మనిషి ఈ ప్రపంచంలో మంచితనం, మంచి మనుషులు, మంచి గుణాలు ఉన్నాయని నమ్ముతాడు. తాను కూడా ఇతరుల పట్ల దయ చూపించడం చేస్తాడు. 


ఇలా ఇతరుల పట్ల దయ చూపించడం అనేది ఓ మంచి గుణాన్ని తమ నుండి తమ చుట్టూ ఉన్న ప్రపంచానికి వ్యాప్తం చేస్తుంది.


కష్టాల్లో ఉన్నవారిని, ప్రకృతీ విలయాల కారణంగా అనాథలుగా మారిన వారిని, ఒంటరితనంతో కొట్టుమిట్టాడుతున్న వారిని, వృద్ధులను జీవితంలో ఎంతోమంది ఎన్నో రకాల సమస్యలలో చిక్కుకుపోయి ఉంటారు వాళ్ళందరినీ కూడా సగటు మనిషిగా ఆదుకోవచ్చు.


జంతువులు, మనుషులు, మొక్కలు, ఈ ప్రపంచాన్ని ఆవరించి ఉన్న సకల జీవరాశులు కూడా దాయా గుణానికి చలిస్తాయి. కాబట్టి దయ అనేది మనిషిని ఉన్నతంగా మారుస్తుంది. మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి దయను అందించండి.. ఈ ప్రపంచాన్ని ఒకానొక దయాపూరిత గుణంతో నింపండి.


                                 ◆నిశ్శబ్ద.

Related Segment News