ఒమిక్రాన్.. ఏం చేయాలి? ఏం చేయ‌కూడ‌దు? ఫుల్ డిటైల్స్‌..

1. ఒమిక్రాన్‌. ఇది కొత్త కరోనా వేరియంట్‌. డెల్టా ర‌కం కంటే ఆరు రెట్లు ఎక్కువ వేగంగా విస్తరిస్తుంది. 

2. ఒమిక్రాన్‌ను దక్షిణాఫ్రికా దేశంలో ముందుగా గుర్తించారు. ఆస్ట్రేలియా, ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్, బ్రిటన్, ఇజ్రాయెల్, హాంగ్ కాంగ్, బోట్స్వానా, బెల్జియం దేశాల్లో వేగంగా విస్త‌రిస్తోంది. 

3. ఒమిక్రాన్ బాధితుల‌ లక్షణాలు:- అలసటగా ఉండడం, కండరాల నొప్పి, గొంతులో గరగర, పొడి దగ్గు. జ్వరం. క‌రోనా వేరియంట్లు అన్నిటికీ ఒకే త‌ర‌హా ల‌క్ష‌ణాలు ఉంటాయి.

4. ఒమిక్రాన్ ఎవ‌రికైనా సోక‌వ‌చ్చు. ఇమ్మ్యూనిటీ బాగా వీక్‌గా ఉంటే మిన‌హా.. దీని ప్రభావం స్వల్పం అంటున్నారు. అసలు వచ్చినట్టే తెలియదని చెబుతున్నారు. 

5. ఒమిక్రాన్‌కు భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేదు. జాగ్ర‌త్త‌లు మాత్రం త‌ప్ప‌నిస‌రి. నిర్ల‌క్ష్యం మ‌హా ప్ర‌మాదం. 

6. రెండు డోసుల వ్యాక్సినేష‌న్ పూర్తి కాని వారు.. ఇప్ప‌టి వ‌ర‌కూ క‌రోనా సోక‌ని వారు.. ఒమిక్రాన్ బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా ఉండాలి. వీలైనంత త్వ‌ర‌గా వ్యాక్సినేష‌న్ పూర్తి చేసుకోవాలి. 

7. ప్రస్తుత వ్యాక్సిన్‌ల వల్ల పొందే యాంటీబాడీలు ఒమిక్రాన్‌ ను తటస్థీకరించేందుకు సరిపోయేలా కనిపించడం లేదు. అయినప్పటికీ తీవ్ర వ్యాధి బారినపడే అవకాశాలు మాత్రం తక్కువే. భారత్‌లో 40ఏళ్ల వయసు పైబడిన వారికి బూస్టర్‌ డోసును ఇచ్చే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చని జీనోమ్‌ శాస్త్రవేత్తలు సిఫార్సు చేశారు. ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ సీక్వెన్సింగ్‌ కన్సార్టియం (INSACOG) విడుదల చేసిన వారాంతపు నివేదికలో ఈ విషయం తెలిపింది.

8. ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఇప్పటికే గుర్తించిన దేశాల నుంచి కొనసాగే రాకపోకలపైనా పర్యవేక్షణ ముమ్మరం చేయాలని ఇన్సాకోగ్‌ సూచించింది. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ను సమర్థవంతంగా చేపట్టడంతో పాటు నిర్ధారణ పరీక్షలను భారీగా పెంచాలని స్పష్టం చేసింది.

9. అంతర్జాతీయ ప్రయాణికులను నిరంతరం పర్యవేక్షించడానికి సమాయత్తం కావాలి. ప్రధానంగా ముప్పు అధికంగా ఉన్న దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు పరీక్షలు చేయించి, పాజిటివ్‌గా తేలిన అన్ని నమూనాలను జన్యు పరిణామక్రమ విశ్లేషణ కోసం ఇన్సాకాగ్‌ ఆధ్వర్యంలోని ల్యాబ్‌లకు తప్పనిసరిగా పంపాలి. 

10. వైరస్‌ సోకిన వారికి తక్షణం వైద్యసేవలు అందించాలి. నాణ్యమైన వైద్యం అందించడంలో ఏమాత్రం రాజీ పడకూడదు. పాజిటివిటీ రేటు 5% లోపునకు పరిమితం చేసే లక్ష్యంతో పనిచేయాలి. రోగులను ఆదిలోనే గుర్తించి, వారిని ఐసోలేష‌న్‌లో ఉంచి వైరస్‌ వ్యాప్తిని నిరోధించాలి. కొవిడ్‌పై అసత్య ప్రచారాలు ప్రజల్లో ఆందోళనకు దారితీస్తాయి.