ఓ హీరోకి ₹3 కోట్లు మ‌స్కా.. కిలేడీ శిల్పా...

శిల్పా చౌద‌రి. వారం రోజులుగా న్యూస్‌లో ట్రెండ్ అవుతున్న కి..లేడీ. చిన్నాచిత‌కా చీటింగ్ కేసులు కావు ఆమెవి. కొడితే కోట్లు వ‌చ్చిప‌డాల‌నేదే ఆమె టార్గెట్‌. అందుకే శిల్పా చౌద‌రి మోసాలన్నీ కోట్ల‌లోనే. తాజాగా, ఆమె చేతిలో మోస‌పోయిన వారిలో ఓ సినీ హీరో కూడా చేరారు. ఆ హీరో నుంచి ఏకంగా 4 కోట్లు కొట్టేసింది. ఆ మేర‌కు పోలీసుల‌కు మ‌రో ఫిర్యాదు అందింది. 

సినీ హీరో హర్ష.. శిల్పా చౌద‌రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెహరి చిత్రంలో హీరోగా నటించిన హర్ష.. శిల్పా చౌదరి తన ద‌గ్గ‌ర‌ ₹3 కోట్లు తీసుకొని తిరిగి ఇవ్వ‌లేదంటూ పోలీసుల‌కు కంప్లైంట్ చేశారు. ఇక్క‌డ మ‌రో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. హ‌ర్ష హీరోగా చేసిన‌ సెహ‌రి సినిమాకు నిర్మాత శిల్పా చౌద‌రీనే. 

హ‌ర్ష ఫిర్యాదుతో ఇప్పటివరకు శిల్పా చౌద‌రి చేసిన‌ మోసాల విలువ‌ ₹10 కోట్లుగా తేలింది. అంతకు ముందు.. శిల్పాచౌదరిపై నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో ముగ్గురు మహిళలు ఫిర్యాదు చేయగా.. వారి నుంచి ₹7.05 కోట్లు తీసుకుందని పోలీసులు తేల్చారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్లలోనూ ఆమెపై కేసులు నమోదయ్యాయి. 

కిట్టీ పార్టీల పేరుతో మహిళలను ఆకట్టుకున్న శిల్ప.. స్థిరాస్తి వ్యాపారం కోసం డబ్బు తీసుకొందని పోలీసులు గుర్తించారు. భారీగా లాభాలు ఇస్తామని నమ్మించి మోసం చేసిందని ఆమెపై ఫిర్యాదులు అందాయి. వీకెండ్‌ పార్టీల పేరుతో తొలుత కొంతమందితో మొదలైన కిట్టీ పార్టీలను తర్వాత జూదంగా మార్చేశారు. దివానోస్‌ పేరుతో క్యాసినో స్టార్ట్ చేశారు. సంపన్న కుటుంబాలకు చెందిన 90 మంది మ‌హిళ‌ల‌ను సభ్యులుగా చేర్పించుకున్నారు. వారాంతాల్లో విందులు, వినోదాల పేరుతో జ‌ల్సాలు చేయిస్తూ.. అప్పుల పేరుతో డ‌బ్బులు లాగేసేవారు. హీరో మహేశ్‌బాబు సోదరి ప్రియదర్శిని నుంచి 2 కోట్లు వ‌సూలు చేశారు. తాజాగా, హీరో హ‌ర్ష త‌నను 3 కోట్ల‌కు మోసం చేసిందంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

శిల్పా చౌద‌రి బాధితుల సంఖ్య పెరుగుతుండ‌టంతో.. తదుపరి విచారణకు 7 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. అయితే, రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది కోర్టు. ఆమె ఎవరెవరి వద్ద నుంచి ఎంత సొమ్ము తీసుకుందనే వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే, ఆ డబ్బును ఎక్కడికి మళ్లించారు? బ్యాంకు ఖాతాలకు సంబంధించిన లావాదేవీలపైనా లోతుగా ఆరా తీస్తున్నారు. 

విచార‌ణ‌లో భాగంగా శిల్పాచౌద‌రికి చెందిన రెండు అకౌంట్లను పోలీసులు ఫ్రీజ్‌ చేశారు. అయితే వాటిలో అంతగా డబ్బు లేదని తెలిసింది. దీంతో మ‌రి కొల్ల‌గొట్టిన కోట్ల‌న్నీ ఆమె ఎక్కడికి తరలించారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. హ‌వాలా మార్గంలో విదేశాల‌కు పంపించార‌ని అంటున్నారు. మ‌రోవైపు, శిల్పాచౌదరి భర్త శ్రీకృష్ణ శ్రీనివాస్‌ ప్రసాద్‌ స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడన్న సమాచారంతో ఆయ‌న‌ ఎక్కడెక్కడ భూములు కొన్నారన్న వివరాలను సేకరిస్తున్నారు.