భద్రాద్రి సీతమ్మకు బంగారు నేత చీర!
posted on Apr 5, 2025 10:38AM

భద్రాచలం సీతారామ స్వామి కల్యాణానికి సీతమ్మ తల్లికి బంగారు పట్టు చీరను నేసి బహూకరించనున్నారు సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్. శ్రీరామనవమి సందర్భంగా సీతమ్మ తల్లికి బంగారు పట్టుచీరను నేసిన హరిప్రసాద్.. ఈ చీర కొంగులో భద్రాద్రి మూల విరాట్ దేవతలను తీర్చి దిద్దారు. అలాగే బార్డర్ లో శంఖు చక్రాలు, హనుమంతుడు, గరుత్మంతుడు వచ్చే విధంగా నేశారు. అత్యంత కళాత్మకంగా నేసిన ఈ చీర మొత్తం శ్రీరామ శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకం 51 ఒక్కసార్లు ఉంది. ఈ చీరలో ఒక గ్రాము బంగారు జరీ పట్టు దారం ఉపయోగించారు. చీర బరువు ఎనిమిది వందల గ్రాములు కాగా ఇది ఏడు గజాల బంగారు చీర.
గతంలో ఇలాంటి అరుదైన ఎన్నో చీరలు నేసిన చేనేత కళాకారుడు హరిప్రసాద్ కు సీతమ్మ వారి కోసం ఈ బంగారు చీర నేయడానికి పది రోజుల సమయం పట్టింది. ఈ అరుదైన సీతమ్మవారికి సమర్పించాలన్నది ఆయన ఆకాంక్ష, అభిలాష. ప్రతి ఏటా భద్రాద్రి సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు నేసే అవకాశాన్ని సిరిసిల్ల నేతన్నలకే ఇవ్వాలని ఆయన సీఎం రేవంత్ ను కోరుతున్నారు. గత మూడేళ్లుగా సీతారాముల కళ్యాణానికి హరిప్రసాద్ ప్రత్యేకమైన చీరలు నేస్తున్నారు.