పీసీసీకి సిద్దూ రాజీనామా.. పంజాబ్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటో? 

పంజాబ్ రాజకీయం మరో మలుపు తిరిగింది. పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ  రాజీనామా చేశారు. కొట్లాడి మరీ తెచ్చుకున్న పదవికి రెండున్నర నెలల్లోనే రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సిద్దూ షాక్ ఇచ్చారు. మరో వంక సిద్ధూ రాజీనామా చేయడంపై స్పందించిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, సిద్ధూకు నిలకడ లేదని తాను ముందే చెప్పానంటూ ట్వీట్ చేశారు. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌కు సిద్ధూ సరైన నేత కాదని కెప్టెన్ మరోసారి పునరుద్ఘాటించారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం పరిస్థితి మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వి నందుకు అన్నట్లుగా తయారైంది. 

అమరీందర్ సింగ్ బీజేపీ పెద్దలను ఢిల్లీలో కలవబోతున్నారని ప్రచారం జరిగింది. అమరీందర్ బీజేపీలో చేరతారని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇంతలోనే సిద్ధూ పంజాబ్ పీసీసీకి రాజీనామా చేయడం కలకలం రేపింది.రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపిన సిద్ధూ. తమ రాజీనామాకు కారణం ఏమిటన్నది మాత్రం  స్పష్టం చేయలేదు. పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న సిద్ధూ దేశానికి ప్రమాదకారి అని అమరీందర్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై ఆయన నొచ్చుకున్నట్లు సమాచారం. అమరీందర్ సింగ్ చేసిన, ‘దేశ ద్రోహి’ వ్యాఖ్యలు ఆయన్ని కలిచి వేశాయని అందుకే ఆయన రాజీనామా చేశారని ఆయన వర్గం ప్రచారం చేసుకుంటోంది.

ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో తన అనుయాయులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనే అసంతృప్తి కారణంగానే రాజీనామా చేసినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే సోనియా గాంధీకి రాసిన లేఖలో సిద్ధూ కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. పంజాబ్ ప్రజల సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్‌ విషయంలో రాజీపడబోనని పేర్కొన్నారు.కానీ, ఆయన కాంగ్రెస్’లో కొనసాగేది అనుమానమే అంటున్నారు. ఆప్’లో చేరే అవకాశాలు లేక పోలేదని ఆయన సన్నిహిత వర్గాల నుంచి వినవస్తోంది.  

సిద్ధూ రాజీనామా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పెద్ద  షాక్’గానే భావించవలసి ఉంటుందని, పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, సిద్దూల మద్య చాలా కాలంగా సాగుతున్న అంతర్గత ,ముఠా తగవుల పర్యవసానంగా కాంగ్రెస్ అధిష్టానం సిద్దూను పీసీసీ చీఫ్’గా నియమించింది.ఆయినా, ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదరక చివరకు ముఖ్యమంత్రి అమరీందర్ రాజీనామా చేయడం అయన స్థానంలో, చరణ్జిత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రిగా నియమించడం చకచకా జరిగి పోయాయి.ఇంతలోనే, సిద్దూ రాజీనామాతో కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం మళ్ళీ తిరిగొచ్చింది.దీంతో, రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా,చేసిన  ‘యువ నాయకత్వం’ ప్రయోగానికి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలినట్లు అయిందని అంటున్నారు.