జోరు వాన‌లో.. పెరుగు కోసం వెళ్లి.. చావు కొనితెచ్చుకొన్న టెక్కీ..

అధికారుల అల‌స‌త్వం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నిర్ల‌క్ష్యం.. రెండూ క‌లిసి మ‌ణికొండ‌లో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీలో ప‌డి గ‌ల్లంతైన ర‌జ‌నీకాంత్ ఉదంతం విషాదాంత‌మైంది.  42 గంట‌ల సుదీర్ఘ సెర్చ్ ఆప‌రేష‌న్ త‌ర్వాత అత‌ని మృత‌దేహం ల‌భ్య‌మైంది. ర‌జ‌నీకాంత్ డ్రైనేజీలో ప‌డుతున్న వీడియో వైర‌ల్ కావ‌డం మ‌రింత క‌ల‌క‌లం రేపింది. శనివారం రాత్రి గల్లంతైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గోపిశెట్టి రజనీకాంత్ (42) మృతదేహం.. సోమవారం నెక్నాంపూర్‌ చెరువులో దొరికింది. భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లున్న ఆ కుటుంబంలో విషాదం నింపింది. జోరు వాన‌లో ఇంటి నుంచి ఎందుకు బ‌య‌ట‌కు వెళ్లాడు?  చావు నోట్లో ఎలా చిక్కుకున్నాడు? అనే డీటైల్స్ ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. 

పాపం.. రాత్రిపూట పెరుగు కోసం బయటకు వచ్చాడ‌ట రజనీకాంత్. వాన ప‌డితే హైద‌రాబాద్ య‌మ డేంజ‌ర్ అని తెలిసి కూడా ఆ సాఫ్ట్‌వేర్ పెరుగు కోసం అంత సాహ‌సం ఎందుకు చేశాడో మ‌రి. హైద‌రాబాద్ గురించి గొప్ప‌లు చెప్పుకునే టీఆర్ఎస్ పాల‌న‌లో డ్రైనేజీలు అలా తెరిచి ఉంటాయ‌ని మ‌రిచిపోయిన‌ట్టున్నాడు. 9 గంటల సమయంలో పెరుగు కోసం బయటకు వచ్చిన ర‌జ‌నీకాంత్‌... పెరుగు ప్యాకెట్‌ తీసుకుని రాత్రి 9.14 గంటల సమయంలో గోల్డెన్‌టెంపుల్‌ ఎదురుగా ఉన్న డ్రైనేజీ మీద ఉన్న దారి మీదుగా ఇంటికి వెళ్తూ మురుగుకాల్వలో పడిపోయాడు. అప్పటికే భారీగా వరద ప్ర‌వాహం ఉండ‌టంతో వెంట‌నే కొట్టుకుపోయాడు.

సమీపంలోని ఓ వ్యక్తి వరదను తన సెల్‌ఫోన్లో వీడియో తీస్తుండగా రజనీకాంత్ డ్రైనేజీలో ప‌డటం,  కొట్టుకుపోవడం రికార్డయింది. ఆ వెంట‌నే అత‌ను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అప్రమత్తమైన పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. డ్రోన్ కెమెరాల‌తోనూ సెర్చ్ చేశారు. ఆ నాలా కలిసే నెక్నాంపూర్‌ చెరువులో ఆదివారం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. మూడోరోజు సోమవారం మధ్యాహ్నం నెక్నెంపూర్‌ చెరువులో గుర్రపుడెక్క తొలగిస్తుండగా రజనీకాంత్‌ మృతదేహం బయటపడింది. దుస్తుల ఆధారంగా మృతుడిని గుర్తించారు. 42 గంటల పాటు నీటిలోనే ఉండటంతో ముఖం, శ‌రీరం గుర్తుపట్టలేనంతగా ఉబ్బిపోయింది. పెరుగు కోసం బయటకు వెళ్లకుండా ఉన్నా ర‌జ‌నీకాంత్ తమకు దక్కేవాడని కుటుంబ‌స‌భ్యులు విల‌పిస్తున్నారు.