షోకాజ్ కు వివరణ ఇచ్చిన పోచారం
posted on Apr 25, 2011 2:15PM
హైదరా
బాద్: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఉప సభాపతి నాదెండ్ల మనోహర్‌ను కలిసి షోకాజ్ నోటిసుకు వివరణ ఇచ్చుకున్నారు. తాను గత శాసనసభ కోటా మండలి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఎందుకు ఓటు వేయలేదో వివరణ ఇచ్చుకున్నారు. వివరణ ఇచ్చుకున్న అనంతరం ఆయన నాదెండ్లను తన రాజీనామాను త్వరగా ఆమోదించాల్సిందిగా కోరారు. అయితే గత శాసనమండలి ఎన్నికలలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థికి ఓటు వేసిన విషయం తెలిసిందే. గత నాలుగు నెలలుగా ఆయన ప్రత్యేక తెలంగాణపై తెలుగుదేశం పార్టీ వైఖరిని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించక పోవడం వల్లే తాను టిడిపిని వీడుతున్నట్టు చెప్పారు. అయితే ఆయన గత సాధారణ ఎన్నికలలో టిడిపి మ్యానిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ప్రత్యేక తెలంగాణకు కట్టుబడి లేనందునే తాను వ్యతిరేకంగా ఓటు వేశాననే వివరణ ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు.