టీఆర్ఎస్ కి తాజా మాజీ ఎమ్మెల్యే రాజీనామా
posted on Nov 21, 2018 1:30PM
టీఆర్ఎస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఒక్కొక్కరు పార్టీ వీడుతుండటం ఆ పార్టీని కలవరపెడుతుంది. ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యి చేరికపై మంతనాలు జరిపారు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే తాజాగా వికారాబాద్ జిల్లా వికారాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించిన తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావు టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. టీఆర్‌ఎస్ అధిష్టానం వికారాబాద్ టికెట్‌ను డాక్టర్ మెతుకు ఆనంద్‌కు కేటాయించింది.అనారోగ్య కారణాలతో సంజీవరావుకు టికెట్ నిరాకరించింది. దీంతో టీఆర్ఎస్ పార్టీకి సంజీవరావు గుడ్‌బై చెప్పారు.ఈ మేరకు రాజీనామా లేఖను టీఆర్ఎస్ కార్యాలయానికి పంపారు. అంతేకాకుండా అభ్యర్థి విషయంలో తనని సంప్రదించలేదని, పార్టీలో తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థికి మద్దతు తెలుపుతానని ప్రకటించారు. వరుస రాజీనామాలతో 100 స్థానాలు గెలుస్తామన్న టీఆర్ఎస్ ధీమా పటా పంచలయ్యింది.