షర్మిల అడుగులు తెలుగుదేశం వైపు?

కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్ డోలాయమానంలో పడిందా? నెమ్మది నెమ్మదిగా కాంగ్రెస్ పార్టీ ఆమెను పక్కన పెట్టేయాలని భావిస్తోందా?  లేదా షర్మిల అలా భయపడుతున్నారా? తన కంటే తన అన్న జగన్ ను పార్టీలోకి తీసుకుంటేనే బెటర్ అని కాంగ్రెస్ హైకమాండ్ సంకేతాలు ఇస్తోందని షర్మిల భావిస్తున్నారా? అంటే ఇటీవలి కాలంలో ఆమె చేస్తున్న ప్రకటనలు, మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్న మాటలు వింటే ఔననే అనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

జగన్ ఇటీవలి కాలంలో కాంగ్రెస్ కు దగ్గర అవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. బెంగళూరు వేదికగా జగన్ తరచూ కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ అవుతున్నారనీ, ఆ భేటీల్లో కాంగ్రెస్ కు బేషరతు మద్దతు ప్రతిపాదన తీసుకు వచ్చారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి బలం చేకూర్చే విధంగానే జగన్ చర్యలు, ప్రకటనలు కూడా ఉంటున్నాయి. రాజ్యసభలో బీజేపీకి వ్యతిరేక స్టాండ్ తీసుకోవడం నుంచి ఆయన వరుసగా వేస్తున్న అడుగులు కాంగ్రెస్ తో ఒప్పందం లేదా పొత్తు స్థాయిని దాటి విలీనం దాకా వెళ్లాయని కూడా వైసీపీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 

ఈ నేపథ్యంలోనే షర్మిల తన దారి తాను చూసుకోకతప్పదని గ్రహించారని అంటున్నారు. అందుకే ఆమె విమర్శల దాడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి సర్కార్ పై కాకుండా కనీసం విపక్ష హోదా కూడా లేని తన అన్న పార్టీ వైసీపీ మీదనే ఎక్కువగా ఉంటోందని అంటున్నారు. దీంతో ఆమె చేస్తున్న రాజకీయం రాష్ట్రంలో కాంగ్రెస్ కు కాకుండా తెలుగుదేశం కు ప్రయోజనం కలిగేలా ఉంటున్నది. ఈ విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు రహస్యంగా కాదు బాహాటంగానే చెబుతున్నాయి. ఇటీవల అచ్చుతాపురం ప్రమాదం విషయంలో షర్మిల విమర్శలన్నీ వైసీపీ టార్గెట్ గానే  ఉండటాన్ని కాంగ్రెస్ వర్గాలు ఉటంకిస్తున్నాయి. అచ్చుతాపురం ప్రమాదానికి కారణం వైసీపీ సర్కార్ నిర్వాకమేనని ఆమె కుండబద్దలు కొట్టడమే కాకుండా, తెలుగుదేశం కూటమి సర్కార్ ను వెనకేసుకు వచ్చేలా మాట్లాడారని అంటున్నాయి.

 అచ్యుతాపురం ప్రమాదం విషయంలో అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష  వైసీపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. తమ ప్రభుత్వం వచ్చి రెండు నెలలే అయింది,గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకమే ఈ ప్రమాదానికి కారణమని తెలుగుదేశం ఆరోపిస్తుంటే,  వైసీపీ తమ ప్రభుత్వ హయాంలో  ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన ప్రమాదాన్ని ఎలా హ్యాండిల్  చేశామో గుర్తు తెచ్చుకోండి అంటూ తెలుగుదేశం తక్షణ స్పందన విషయంలో ఘోరంగా విఫలమైందని విమర్శలు గుప్పిస్తున్నది. ఈ మధ్యలో షర్మిల తన నోటికి పని చెప్పారు. అచ్చుతాపురం ప్రమాదం జరగడానికి  గత వైసీపీ సర్కార్ నిర్వాకమే కారణమని కుండబద్దలు కొట్టేశారు. భద్రతా ప్రమాణాలు సరిగా లేవంటూ గత డిసెంబర్ లోనే ప్రభుత్వానికి నివేదిక అందినా జగన్ సర్కార్ పట్టించుకోలేదని ఆరోపించారు.  

ఆమె మాటలు నిస్సందేహంగా తెలుగుదేం కూటమి సర్కార్ కు మద్దతుగా అనుకూలంగా ఉన్నాయి.  షర్మిల తీసుకున్న ఈ స్టాండ్  రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం కావడానికి ఏ మేరకు దోహదపడుతుందో తెలియదు కానీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి మాత్రం గట్టి రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది. ఇక్కడే  షర్మిల అడుగులు కాంగ్రెస్ కు ఎడంగా, తెలుగుదేశం వైపుగా పడుతున్నాయా అన్న సందేహాలు రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నాయి.