షారుక్, ఆమీర్ కు సెక్యూరిటీ కుదింపు.. అసహనమే కారణమా..?
posted on Jan 8, 2016 2:08PM

ముంబై పోలీసులు తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్లలో భారీ భద్రత కలిగి ఉన్న కొంత మందికి సెక్యూరిటీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అలా భద్రత తగ్గించిన వారిలో బాలీవుడ్ అగ్రనటులు షారూక్ ఖాన్.. అమీర్ ఖాన్ లతో పాటు బాలీవుడ్ ప్రముఖులు విదు వినోద్ చోప్రా.. రాజ్ కుమార్ హిరానీ.. ఫరాఖాన్.. కరీం మొరాని తదితరులు ఉన్నారు. అయితే కొంత మందికి మాత్రం అలానే భద్రత సిబ్బందిని కొనసాగిస్తున్నారు. అందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్.. దిలీప్ కుమార్.. లతామంగేష్కర్ ఉన్నారు. ఈ సందర్భంగా ముంబై పోలీసులు మాట్లాడుతూ ప్రముఖులకు పెద్ద ఎత్తున భద్రతను కల్పించటం కారణంగా సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
అయితే అంతా బానే ఉన్నా షారుక్ ఖాన్, ఆమీర్ ఖాన్ భద్రతను తగ్గించడంపైనే పలువురు పలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అసహనం పై అమీర్ ఖాన్ వ్యాఖ్యలు చేయడం.. దానికి షారుక్ ఖాన్ మద్దతు పలకడం వల్లే సూపర్ స్టార్లు అయిన వీరిద్దరి భద్రతను తగ్గించారని అనుకుంటున్నారు. మరి ఏది నిజమో వాళ్లకే తెలియాలి.