ఆగిపోయిన మరో కలం.. సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువా మృతి 

Sప్రముఖ సీనియర్ పాత్రికేయుడు వినోద్ దువా కన్నుమూశారు. సుదీర్ఘ అస్వస్థతతో కొంత కాలంగా చికిత్స పొందుతున్న ఆయన శనివారంనాడు తుది శ్వాస విడిచారు.  ఈ విషయాన్ని ఆయన కుమార్తె మల్లికా దువా సోషల్ మీడియా పోస్ట్‌లో ధ్రువీకరించారు. ఇటీవలే కోవిడ్ బారిన పడి కోలుకున్నారు వినోదు దువా. అయినా ఆయన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ వచ్చారు. 67 ఏళ్ల దువా వైద్యుల సలహా మేరకు గత వారంలో ఢిల్లీలోని అపోలో ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ చనిపోయారు. వినోద్ దువా అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీలోని లోథి క్రిమిటోరియంలో నిర్వహించనున్నట్టు ఆయన కూతురు మల్లికా దువా తెలిపారు.

హిందీ జర్నలిజం ఆద్యులలో ఒకరిగా పేరున్న వినోద్ దువా దూరదర్శన్‌, ఎన్‌డీటీవీలో పనిచేశారు. ఇటీవల పలు వెబ్‌షోలలో రాజకీయ కామెంట్రీలతో కూడా అలరించారు. ఢిల్లీలోని శరణార్థుల కాలనీల నుంచి జర్నలిజంలో అత్యున్నత స్థాయికి చేరి, 42 ఏళ్లకు పైగా సేవలందించారని మల్లికా దవా తన 'ఇన్‌స్టాగ్రామ్' పోస్ట్‌లో పేర్కొన్నారు. కోవిడ్ సెకెండ్ వేవ్ తారాస్థాయిలో ఉన్న దశలో వినోద్ దువా, ఆయన భార్య గురుగావ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కోవిడ్‌తో ఆమె కన్నుమూశారు. వినోద్ దువా ఆసుపత్రి నుంచి డిశ్చార్చి అయినా ఆరోగ్య సమస్యలు వెన్నాడుతూ వచ్చాయి. దువా దంపతులకు బకుల్ దువా అనే మరో కుమార్తె కూడా ఉన్నారు. జర్నలిజంలో చేసిన అత్యుత్తమ సేవలకు గాను 1996లో రామ్‌నాథ్ గోయెంగా ఎక్స్‌లెన్స్ ఇన్ జర్నలిజం అవార్డును వినోద్ దువా అందుకున్నారు. 2008లో భారత ప్రభుత్వం 'పద్మశ్రీ' పురస్కారంతో గౌరవించింది.