ప్రభుత్వానిదే పాపం.. మాతృభాషకు పట్టం.. కలం ఆగిపోయింది.. మెరిసిన సింధు.. టాప్ న్యూస్@8PM

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అన్నమయ్య ప్రాజెక్టు వైఫల్యంపై మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. వైసీపీ ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదని మండిపడ్డారు. జగన్‌ బాధ్యతలకు అతీతుడు కాదని.. బాధ్యతలకు వెనకాడితే సీఎంగా ఉండే అర్హత జగన్‌కు లేదన్నారు. తెలిసో తెలియకో ఓట్లేసిన పాపానికి ప్రజల ప్రాణాలు తీస్తారా? అని బాబు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. 
-------
భువనేశ్వరికి కన్నీళ్లుతో కాళ్లు కడుతానని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. మహిళను ఎవరు కించపరిచినా అది తప్పేనన్నారు. ఈ విషయానికి ముగింపు పలకాలని ఎమ్మెల్యేగా విజ్ఞప్తి చేస్తున్నానని ప్రకటించారు. ఒకవేళ భువనేశ్వరి అక్క తనని అనరాని మాటలు, వ్యక్తిత్వాన్ని కించపరిచారని భావించి ఉంటే.. ఆమె అనుమతితో కన్నీళ్లతో కాళ్లు కడుగుతానని తెలిపారు. 
-------
కొణిజేటి రోశయ్య మృతికి రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. రోశయ్య, తాను  ఒకేసారి సీఎంలుగా పనిచేశామని ఆయనతో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. రోశయ్య మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 
------
కేంద్ర పథకాల నిధులకు సీఎం తమ పేర్లు పెట్టుకుంటున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు తప్పుబట్టారు. దీనిపై గత నెల 10న కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశానని తెలిపారు. ప్రజాధనం వృధాకావొద్దనే లేఖ రాశానని పేర్కొన్నారు. అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు పాడయ్యాయి.. అందులో భాగంగానే నీటి తాకిడికి గేట్లు కొట్టుకుపోయాయని తెలిపారు. జగనన్న శాశ్వత గృహ హక్కు కాదు.. జగనన్న నిర్బంధ గృహ హక్కుగా ఉందని రఘురామ  విమర్శించారు.
---
పాదయాత్రకు పోలీసులు ఆటంకాల సృష్టిస్తున్నారని అమరావతి జేఏసీ నేతల ఆగ్రహం వ్యక్తం చేసింది. అడుగడుగునా ఆటంకం కలిగిస్తున్నారని, మహిళల పట్ల సీఐ నాగమల్లేశ్వరరావు అగౌరవంగా వ్యవహరిస్తున్నారని జేఏసీ మండిపడింది. పలు ప్రాంతాల్లో రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అమరావతి రైతుల మహాపాదయాత్ర 34వ రోజు హుషారుగా సాగింది. 
-----
టీఎస్‌ ఐపాస్‌ ద్వారా ఇండస్ట్రీయల్ పాలసీ తీసుకొచ్చామని, దీని ద్వారా 15 రోజుల్లో అనుమతులు లభిస్తాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.ఇప్పటివరకు 17,500 పరిశ్రమలకు అనుమతులిచ్చామని చెప్పారు. రాష్ట్రానికి రూ.2,30,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని, లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించామని పేర్కొన్నారు. మరిన్ని పెట్టుబడులు రావడానికి చాలా ఉపయోగపడుతుందన్నారు
-------
తమిళనాడులోని అన్ని ప్రభుత్వోద్యోగాలకు అర్హత పరీక్షగా తమిళంను తప్పనిసరి చేస్తూ తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల పరీక్షల్లోనూ తమిళ భాషలో అర్హత పరీక్షను తప్పనిసరిగా అభ్యర్థులు ఉత్తీర్ణులవాలని తెలిపింది. తమిళ భాష పరీక్షలో కనీసం 40 శాతం మార్కులు వస్తేనే, మిగిలిన సబ్జెక్టుల పేపర్లను పరిశీలించనున్నట్లు వివరించింది. 
------

ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు వినోద్ దువా సుదీర్ఘ అస్వస్థతతో  కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె మల్లికా దువా సోషల్ మీడియా పోస్ట్‌లో ధ్రువీకరించారు. ఇటీవలే ఆయన కోవిడ్ బారిన పడి కోలుకున్నప్పటికీ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ వచ్చారు. 67 ఏళ్ల దువా వైద్యుల సలహా మేరకు గత వారంలో ఢిల్లీలోని అపోలో ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరారు. 

---
ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నూరులో ఓ కొత్త రోడ్డును బీజేపీ ఎమ్మెల్యే సుచి చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఓ కొబ్బరికాయ కొట్టి పూజ చేశారు. ఆమె కొబ్బరికాయ పగలాలనుకున్నారు కానీ దానికి బదులుగా ఆ రోడ్డులోని కంకరరాళ్ళు బయటకు వచ్చాయి. దీంతో ఆమెకు చాలా కోపం వచ్చింది.  అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అక్కడికక్కడే ధర్నా చేశారు. ఇంత నాసిరకంగా రోడ్డును నిర్మిస్తారా? అంటూ నిలదీశారు. 
-----
న్యూజీలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా పట్టు బిగించింది. బౌలర్ల విజృంభణతో తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యత సాధించింది. మొదటి ఇన్నింగ్స్ లో 325 పరుగులు చేసిన భారత్.. బౌలింగ్ లో అదరగొట్టింది. సీమర్లు, స్పిన్నర్లు పోటీ పడి మరీ బౌలింగ్ చేశారు. దీంతో కేవలం 28.1 ఓవర్లలో 62 పరుగులకు న్యూజీలాండ్ అలౌట్ అయింది. భారత్ కు తొలి ఇన్నింగ్సులో 263 పరుగుల భారీ లీడ్ లభించింది.
---
తెలుగుతేజం పీవీ సింధు మరో ప్రపంచ టైటిల్ కు అడుగుదూరంలో నిలిచింది. ఇండోనేసియాలోని బాలిలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ చాంపియన్ షిప్ లో సింధు ఫైనల్స్ కు దూసుకెళ్లింది.  మూడు గేమ్ ల పాటు హోరాహోరీగా సాగిన సెమీఫైనల్ పోరులో సింధు జపాన్ షట్లర్ యమగుచిని 21-15, 15-21, 21-19తో ఓడించింది. సింధు ప్రపంచ ర్యాంకింగ్స్ లో ఏడో స్థానంలో ఉండగా, యమగుచి మూడో స్థానంలో ఉంది.