భువనేశ్వరి కాళ్లను కన్నీళ్లతో కడుగుతానన్న వైసీపీ ఎమ్మెల్యే 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నారా భువనేశ్వరిపై అసభ్య పదజాలం వాడుతూ కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై జనాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. జనాల నుంచే కాదు వైసీపీ పార్టీలోనూ సభలో కొందరు సభ్యులు మాట్లాడిన తీరుపై తీవ్ర అసహనం వస్తుందట. చాలా తప్పు జరిగిందని కొందరు ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలతో చెప్పారని తెలుస్తోంది. అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో పార్టీకి చాలా డ్యామేజీ జరిగిందని, మహిళలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని కొందరు చెప్పారట. అంతేకాదు ఒక్కొక్కరుగా బయటికి వస్తూ భువనేశ్వరికి మద్దతుగా మాట్లాడుతున్నారు.

భువనేశ్వరిపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నట్లు ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశి తెలిపారు. ‘నేను అలా మాట్లాడి ఉండకూడదు.. పొరపాటున ఓ మాట దొర్లాను.. అలా మాట్లాడటం తప్పే..! ఎవరు అలా మాట్లాడినా తప్పే.. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి క్షమాపణ చెప్పడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’’ అని వంశీ ప్రకటించారుతాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే భువనేశ్వరికి మద్దతుగా నిలిచారు. భువనేశ్వరికి కన్నీళ్లుతో కాళ్లు కడుతానని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. 

మహిళను ఎవరు కించపరిచినా అది తప్పేనన్నారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఈ విషయానికి ముగింపు పలకాలని ఎమ్మెల్యేగా విజ్ఞప్తి చేస్తున్నానని ప్రకటించారు. ఒకవేళ భువనేశ్వరి అక్క తనని అనరాని మాటలు, వ్యక్తిత్వాన్ని కించపరిచారని భావించి ఉంటే.. ఆమె అనుమతితో కన్నీళ్లతో కాళ్లు కడుగుతానని తెలిపారు. వైఎస్ సతీమణి విజయలక్ష్మి అయినా.. చంద్రబాబు సతీమణి అయినా ఒకే గౌరవం ఉంటుందని చెప్పారు. రాచమల్లు ఓపెన్ గా చెప్పగా.. పార్టీలోని చాలా మంది నేతలు అభిప్రాయం ఇలానే ఉందని అంటున్నారు.