శాపంలా వృద్ధాప్యం
posted on Jun 15, 2016 11:22AM
వృద్ధాప్యం ఓ భిన్నమైన జీవన దశ! కాలంతో పాటే యవ్వన ఛాయలు కరిగిపోతూ..దశాబ్ధాల శ్రమ ఫలితంగా శరీరం అరిగిపోతోందన్న సంకేతాలు అందే సమయం. జీవితంలో చివరి దశ కావడంతో శారీరక మార్పులను ఆపడం ఎవరి తరం కాదు. మనిషికే కాదు, ప్రతి జీవికి ఈ మజిలీ తప్పదు. ముదిమి వయసులో శారీరక సమస్యలు, మానసిక ఇబ్బందులు ఇలా ఆ రెంటీకి ఆర్ధిక సమస్య కలిస్తే ఆ జీవితం నరకమే. కాని ఆ వయసులో వృద్ధులు పిల్లల నుంచి ఆదరణ కోరుకుంటారు. కాని నేటీ సమాజంలో వారిని భారంగా తలుస్తూ..అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారు. కడుపునిండా తిండి పెట్టకపోవడం, అవసరానికి మందులు కొనకపోవడం, భావోద్వేగాలతో బెదిరించడం, అరవడం, తిట్టడం, కొట్టడం, నిర్బంధించడం వంటి దారుణాలతో కృష్ణా, రామా అనుకుంటూ వెళ్లిపోవాల్సిన దశలో వృద్ధాప్యం శాపంగా మారుతోంది. ఇలా నిత్యం ఛీత్కారాలు ఎదుర్కొంటూ..ఇబ్బందులు పడుతూ కుమిలిపోతున్న పెద్దలెందరో..! వేధింపులకు గురవుతున్న వృద్ధుల ప్రత్యేక దినం సందర్భంగా ప్రత్యేక కథనం
పండుటాకుల్లో ఎక్కువమంది నిత్యం కుమారుల చేతుల్లోనో..కుమార్తెల చేతుల్లోనో వేధింపులకు గురవుతున్నారు. ప్రపంచంలో ఎక్కువ మంది వృద్ధులు ఉన్న దేశంగా ఛైనా మొదటి స్ధానంలో ఉంది. ఇక్కడ 60 ఏళ్లకు పైబడిన వారు 16 కోట్ల 70 లక్షల మంది, 80 ఏళ్లకు పైబడిన వారు పది లక్షల మంది ఉన్నారు. జపాన్‌లో నూటికి 30 మంది 60 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. ముప్పై ఏళ్ల క్రితం వయసు మళ్లిన వారు అన్ని దేశాల్లోనూ తక్కువే. 2010 నాటికి 23 దేశాల్లో వీరి సంఖ్య క్రమంగా పెరిగింది. 2050 నాటికి 64 దేశాలు 30 శాతం వృద్ధులతో నిండిపోనున్నాయి. అంటే వృద్ధుల జనాభా 120 కోట్లకు చేరుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే 80 శాతం మంది వృద్ధులుంటారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది.
ఇక భారత్ సంగతి చూస్తే స్వాతంత్ర్యం వచ్చినపుడు సగటు ఆయుర్దాయం కేవలం 27 ఏళ్లు. జీవన ప్రమాణాలు మెరుగుపడటం, వైద్య రంగంలో వచ్చిన అనూహ్య పురోగతి కారణంగా దేశంలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 1960లలో మనదేశంలో 2.4 కోట్ల మంది వృద్ధులుండగా..2001 జనాభా లెక్కల నాటికి 7 కోట్లకు చేరుకున్నారు. ఇప్పటికీ దేశ జనాభాలో అధిక భాగం గ్రామాల్లోనే కనిపిస్తుంది. నూటికి 70 మంది సీనియర్ సిటీజన్లు పల్లెల్లోనే నివసిస్తున్నారు. దినసరి కూలీలు, వ్యవసాయ కూలీలు, చేతివృత్తుల వారు 60 సంవత్సరాల తర్వాత శరీర సత్తువ తగ్గి సంపాదించుకులేకపోతున్నారు. వీళ్లకు ఏవిధమైన ఆర్ధిక వనరులు లేకపోవడం వలన ఆకలితో అలమటిస్తున్నారు.
ఎంతో కష్టపడి, రెక్కలు ముక్కలు చేసుకుని పైసా పైసా కూడబెట్టి తమలాగా తమ పిల్లలు కష్టపడకూడదని పై చదువులు చెప్పించి ప్రయోజకుల్ని చేస్తే వాళ్ల చేతనే ఈ వృద్ధులు నిరాదరణకు గురవుతున్నారు. ఉద్యోగ రీత్యా మరో ప్రాంతంలోనో, మరో దేశంలోనో స్ధిరపడి తల్లిదండ్రులను ఆదుకోని వారు కోకొల్లలు. ధీర్ఘకాల రోగల బారినపడి ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఎంతోమంది శేష జీవితాన్ని దుర్భరంగా గడుపుతున్నారు. అయితే వీరితో పోలిస్తే నగరాల్లో, పట్టణాల్లో ఉండే వారి పరిస్ధితి కాస్త నయం. డబ్బు లేదా ఆస్తులు, పెట్టుబడులు, పొదుపు మొత్తాలు, వారసత్వం లేదా ప్రేమగా చూసుకునే పిల్లలు ఉండటంతో కొద్ది మంది వృద్ధులు వృద్ధాప్యాన్ని హాయిగా గడిపేస్తున్నట్లు గణంకాలు చెబుతున్నాయి.
దేశానికి మార్గదర్శకుల్లాంటి వృద్ధుల సమస్యలపై చాలా దేశాలు దృష్టిసారించాయి. 2004లో స్సెయిన్‌లో జరిగిన 86 దేశాల సమీక్షా సమావేశంలో వృద్ధుల సంక్షేమం కోసం 46 తీర్మానాలను ఆమోదించారు. ప్రభుత్వం కూడా వృద్ధులకు తమ హక్కుల పట్ల చైతన్యం కలిగించడంతో పాటు వారి ప్రయోజనాలను పరిరక్షించే విధానాలను అమలు చేయాలి. ఇప్పటికే చాలా దేశాలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తూ ఆర్ధికంగా చేయూతనిస్తున్నాయి. అటు వృద్ధులు కూడా నాలుగు గోడల మధ్య ఒంటరితనంతో కుంగిపోకుండా స్నేహితులతోనూ, ఇరుగు పొరుగు వారితోనూ సంబంధాలను కొనసాగించడం..స్నేహాన్ని పంచుకోవడం చేయాలి. వీలైనంతగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మానసిక ఒత్తిడి నుంచి బయటపడవచ్చు.