ఆకాశవీధిలోకి సామాన్యుడు

అబ్బా ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలనుకుని..ఆ స్థోమత లేక కలల్లో విమానం ఎక్కే పేదవారికి ఇక నుంచి ఆ కల నిజం కానుంది. 130 కోట్ల మంది జనాభా ఉన్న మనదేశంలో ఏటా 80 లక్షల మంది మాత్రమే విమాన ప్రయాణం చేస్తున్నట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. గగన విహారాన్ని మరింత చౌకగా, సులువుగా మార్చేస్తూ సరికొత్త విమానయాన విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆఖరి నిమిషంలో ఛార్జీలు పెంచేసి ప్రయాణీకుల జేబులు గుళ్లచేసే పలు సంస్థలకు ముకుతాడు వేసింది.  ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కొత్త పౌర విమానయాన విధానాన్ని రూపొందించాల్సిన ఆవశ్యకతపై చర్చించింది. గత కొన్నేళ్లుగా తీవ్ర ఇక్కట్లతో పీకల్లోతు కష్టాల్లో ఏటికి ఎదురీదుతున్న విమానయాన రంగాన్ని పునర్జీవింప చేసేందుకు కొత్త పౌర విమానయాన విధానానికి కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది.

 

దేశీయ విమానయాన రంగాన్ని సమూలంగా మార్చివేసే పాలసీగా దీనిని పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు అభివర్ణించారు. ఈ పాలసీ విజయవంతమైతే 2022 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా భారత్ అవతరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విధానం ప్రకారం ఇకపై గంట వ్యవధి గల విమాన ప్రయాణాలకు రూ.2,500 మాత్రమే టికెట్ ఛార్జీని వసూలు చేయాలి. అదే అరగంటకైతే రూ.1,250 మాత్రమే ఛార్జీ ఉండాలి. విదేశాలకు విమాన సర్వీసులను నడిపేందుకు కొత్త ఎయిర్‌లైన్స్ కంపెనీలకు అడ్డుగా ఉన్న వివాదాస్పద 5/20 నిబంధనను రద్దు చేశారు. దీని ప్రకారం కొత్త ఎయిర్‌లైన్స్ కంపెనీలు విదేశీ రూట్లలో సర్వీసులను నడపాలంటే కార్యాకలాపాలు ప్రారంభించి 5 ఏళ్లు పూర్తవడంతో పాటు కనీసం 20 విమానాలు కంపెనీకి ఉండాలి. ఈ నిబంధనను రద్దు చేసి దీని స్థానంలో 0/20 నిబంధనను ప్రవేశపెట్టనున్నారు. అంటే విదేశీ రూట్లలో సర్వీసులు విస్తరించాలంటే కనీసం 20 విమానాలు కలిగి ఉంటే సరిపోతోంది. లేదంటే తమ విమానాల్లో 20 శాతాన్ని దేశీయ కార్యకలాపాలకు ఉపయోగిస్తే ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తుంది. ఈ కొత్త పాలసీ వల్ల విస్తారా, ఎయిర్ ఆసియా వంటి కొత్తగా సర్వీసులు ప్రారంభించిన సంస్థలు కూడా విదేశీ సర్వీసులు నిర్వహించే అవకాశం కలుగుతుంది.

 

దేశంలో విమాన సర్వీసులకు ప్రాంతీయ అనుసంధాన్ని పెంచే ఉద్దేశ్యంతో రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ప్రవేశపెడుతున్నారు. దీని ప్రకారం దేశవ్యాప్తంగా నిరుపయోగంగా ఉన్న 350 ఎయిర్‌స్ట్రీప్‌లు, ఎయిర్‌పోర్ట్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం రీజనల్ కనెక్టివిటీ ఫండ్‌ను ఏర్పాటు చేసి నిధుల నిమిత్తం డొమెస్టిక్ టికెట్లపై రెండు శాతం లెవీ వసూలు చేస్తారు. ఇలాంటి ప్రాంతాల్లో సర్వీసులు ప్రారంభించే విమానయాన సంస్థలు పన్ను ప్రోత్సాహకాలు పొందే అవకాశాన్ని కల్పించనున్నారు. చివరి నిమిషంలో ఫ్లైట్ రద్దు కావడం..ఎయిర్‌లైన్స్‌లు ప్రత్యామ్నాయ మార్గాలను చూపకపోవడం వంటి ఘటనలను సీరియస్‌గా తీసుకున్న కేంద్రం ఇకపై ఇలాంటి పనులు చేస్తే తాట తీయనుంది.

 

బోర్డింగ్ పాస్ ఇచ్చాకా ఏ కారణంగానైనా ఎయిర్‌లైన్స్ ఫ్లయిట్ రద్దు చేయడం, ప్రయాణానికి అనుమతించకపోతే ఇకపై భారీగా నష్టపరిహారాన్ని చెల్లించాల్సి వస్తుంది. కొత్త పాలసీ ప్రకారం విమానం రద్దయిన గంటలోపు మరో విమానాన్ని సిద్ధం చేస్తే ఓకే ..అలా కాకుండా 24 గంటల్లోపు ప్రయాణానికి వీలు కల్పిస్తే..నష్టపరిహారం 200% ఉంటుంది. 24 గంటల తర్వాత ప్రత్యామ్యాయ ఫ్లైట్ ఏర్పాటు చేస్తే..నష్టపరిహారం 400% చెల్లించుకోవాలి. అదే విధంగా ఫ్లైట్ లేదా టికెట్ రద్దయితే ప్రయాణికుడికి 15 రోజుల్లోగా రిఫండ్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే విమానాల్లో చెక్-ఇన్ కింద ఉచితంగా 15 కేజీల వరకూ బ్యాగేజీని అనుమతిస్తున్నాయి. అదనంగా లగేజీని తీసుకువెళ్లాలంటే ప్రతీ కేజీకి రూ.250 నుంచి రూ.350 ఛార్జీని వసూలు చేస్తున్నాయి. కొత్త పాలసీలో దీనిని రూ.100కి తగ్గించారు. విమానయాన రంగంలో నిపుణులైన ఉద్యోగుల కోసం స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లను ఏర్పాటు చేసి 2025 నాటికి 3.3 లక్షల మందిని ఈ రంగానికి అందివ్వనున్నారు. అత్యవసర సమయాల్లో వైద్య సేవల అందించడానికి ఎయిర్‌ అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం నాలుగు హెలీహబ్స్ అభివృద్ధి చేయడానికి కేంద్రం సాయం చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు, పీపీపీ పద్ధతిలో విమానాశ్రయాల అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి. పౌరవిమానయానశాఖ కేవలం నిర్ణయాత్మకంగా వ్యవహరించనుంది.

 

ఏపీకి వరం:


కొత్త విమానయాన విధానం ఆంధ్రప్రదేశ్‌కు వరం కానుంది.. ఎందుకంటే విశాఖ, విజయవాడ, తిరుపతి ఇప్పటికే అభివృద్ధి చెందిన విమానాశ్రయాలు. అయితే కడప, పుట్టపర్తి విమానాశ్రయాలు చిన్నవి కావడంతో ఇక్కడి నుంచి సర్వీసులు ప్రారంభించడానికి విమానయాన సంస్థలు అంతగా ఆసక్తి చూపించడం లేదు. కొత్త పాలసీ ద్వారా ఈ ఎయిర్‌పోర్ట్‌లపై ఎయిర్‌లైన్స్లు దృష్టిసారించనున్నాయి. విమానయాన రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దీని విలువ తెలుసుకున్న సర్కార్ విమాన ఇంధనంపై పన్నును 1 శాతానికి తగ్గించడంతో ఏపీలో వృద్ధి రేటు దాదాపు 60% ఉంది. ఈ కొత్త పౌరవిమానయాన విధానాన్ని ఆసరాగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరిన్ని కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.