పెద్దన్నా..! ముందు నీ సంగతి చూసుకో

అర్థ, అంగ బలాలతో ప్రపంచాన్ని కనుసైగతో శాసిస్తోంది అమెరికా..తన మాట వినని ఏ దేశాన్నైనా  సామ, దాన, భేద, దండోపాయాలతో దారికి తెచ్చుకోవడం దానికి వెన్నతో పెట్టిన విద్య. అలా ఏ డౌట్ వచ్చినా..ఏ సాయం కావాల్సి వచ్చినా తను తప్ప వేరే దిక్కులేదన్నట్టు చేసుకుని ప్రపంచానికి పెద్దన్నగా ప్రకటించుకుంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా యుద్ధమే దానికి పెద్ద పరిష్కారంగా భావించి తనతో పాటు సంకీర్ణదళాలను ఏర్పాటు చేసి ఇరాక్, ఆఫ్గాన్‌లపై సైనిక చర్య జరిపి ఆ దేశాలను నామరూపాల్లేకుండా చేసింది. ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ పేరు చెప్పి మరోసారి యుద్దవాతావరణం సృష్టిస్తోంది. ఇలా ఆయన దానికి కాని దానికి కయ్యానికి కాలు దువ్వుతున్న అమెరికాకు సొంతదేశంలోనే సొంతప్రజలు సవాలు విసురుతున్నారు. అమెరికాలోని ఆర్లాండోలోని ఒక నైట్ క్లబ్‌లో ఒమర్ మతీన్ అనే వ్యక్తి తాజాగా తుపాకీతో విరుచుకుపడి ఏకంగా 49 మందిని పొట్టనబెట్టుకున్న ఘటన అమెరికాతో పాటు ప్రపంచాన్ని దిగ్బ్రాంతిలో ముంచేసింది. దీనింతటికి కారణం "ఆత్మరక్షణ".

 

శతాబ్దాలుగా అమెరికా చరిత్రతో తుపాకులు ముడిపడిపోయాయి. ముఖ్యంగా 1800ల నుంచీ తెల్లజాతి వలస ప్రజలు పశ్చిమదిశగా విస్తరించాయి. సారవంతమైన భూమి ఉండటాన్ని గుర్తించిన వలస జాతీయులు స్థానిక రెడ్ ఇండియన్లతో పోరాటాలు చేస్తూ, పశ్చిమ హద్దులను క్రమేపీ విస్తరించుకుంటూ టెక్సాస్, కాలిఫోర్నియాలతో పాటు 1830ల నాటికి అయోవా, మిస్సోరీ, ఆర్కాన్సాస్ వంటి ప్రాంతాలన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా బలం లేకపోవడం, స్థానిక రెడ్ ఇండియన్లతో పోరాటాలు చెయ్యాల్సి రావడంతో వలసదారులు తుపాకుల మీద ఆధారపడటం ఎక్కువైంది. తొలినాళ్లలో అక్కడంతా బంజరు నేలలే కావడంతో ఆహారం కోసం తుపాకులతో వేటాడటం నిత్యకృత్యమైంది. ఈ వేట రానురాను సంస్కృతిలో భాగమై ఒక క్రీడగా జీవన విధానంలో భాగమైపోయింది. దానికి తోడు హాలీవుడ్ హీరోల్లో తుపాకితో స్టైల్‌గా నడుచుకుంటూ వచ్చే కౌబోయ్ సినిమాలు అప్పుడప్పుడే వస్తుండటంతో ఆ కాలపు యువత తుపాకీని ధరించడం ఫ్యాషన్‌గా ఫీలయ్యేవారు.

 

అలా తుపాకీ అమెరికన్ల జీవితంతో పెనవేసుకుపోయి ప్రాధమిక హక్కుగా మారింది. 1791లోనే పౌరుల హక్కులను నిర్దేశిస్తూ రాజ్యాంగానికి 2వ సవరణ తెచ్చారు. భద్రతరీత్యా తుపాకులు ఉంచుకోవడం, తీసుకువెళ్లడం పౌరుల హక్కు అని ఆ సవరణ స్పష్టం చేసింది. మరలా 2008లో అమెరికా సుప్రీంకోర్టు ప్రజలకు తుపాకులు, ఆయుధాలు తమతో ఉంచుకునే హక్కును ఈ రెండో సవరణ స్పష్టంగా పరిరక్షిస్తోందని స్పష్టంగా తెలిపింది. దేశంలో ఏ ప్రాంతంలోనైనా పళ్లు, కూరగాయాలు దొరికినంత ఈజీగా తుపాకులు దొరుకుతున్నాయి. వీటిని ఆత్మరక్షణ కోసం మాత్రమే వాడాల్సిన ప్రజలు దొంగతనాలకు, బెదిరింపులకు వాడి రాజ్యాంగం ఇచ్చిన హక్కును దుర్వినియోగం చేస్తున్నారు. కొంతమంది ఉగ్రవాద సానుభూతిపరులు, మతిస్థిమితం లేని వారి చేతుల్లోకి ఈ ఆయుధాలు వెళ్లడం వల్ల దశాబ్దాలుగా ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.

 

దీంతో తుపాకుల మీద నియంత్రణ అవసరమన్న వాదన బలంగా వినపడుతోంది. ముఖ్యంగా 1960లలో కెనడీ, మార్టిన్ లూథర్ కింగ్‌లను తుపాకులతోనే హత్యలు చేసిన నేపథ్యంలో వాటిని కట్టడి చెయ్యటం చాలా అవసరమన్న భావన బలపడింది. దీంతో తుపాకీ నియంత్రణ చట్టం తెచ్చారు గానీ అది చాలా వరకూ తుపాకుల రవాణా, పంపిణీ లైసెన్సుల వంటి వ్యవహారాలకే పరిమితమైంది. కానీ ఈ మధ్యకాలంలో తరచూ పౌరుల చేతుల్లో తుపాకులు గర్జిస్తుండటంతో అమెరికా అధినాయకత్వం ఆలోచనలో పడింది. సాక్షాత్తూ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా తుపాకీ సంస్కృతిపై ఎప్పటి నుంచో వాపోతూనే ఉన్నారు.

 

తాజాగా నైట్ క్లబ్ ఘటనతో ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "ఆయుధాలు తేలిగ్గా లభించే తరహా దేశాన్ని మనం వాంఛిస్తున్నామా? అమెరికన్లు దీనిని తేల్చుకోవాలంటూ" ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఇలా స్పందించడం ఇది తొలిసారి కాదు..2012 డిసెంబర్ 14న కనెక్టికట్‌లోని న్యూటౌన్ పాఠశాల పిల్లలపై కాల్పుల తర్వాత తుపాకులపై కఠినంగా వ్యవహరించాలంటూ పిల్లలు సాక్షాత్తూ ఒబామాకు లేఖలు రాయడంతో ఆయన స్పందించి తుపాకుల నియంత్రణ కోసం తన అధికార పరిధిలో, కాంగ్రెస్ అనుమతి అవసరం లేని 23 ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అమెరికా సెనేట్ ఆమోదం పొందడంలో అది విఫలమైంది. ఈ విధంగా దేశం అశాంతిలో మగ్గుతుంటే అమెరికా పక్క దేశాల్లో శాంతి నెలకొల్పుతానంటూ బయలుదేరింది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని మన పెద్దలు ఊరికే చెప్పలేదు.