సరస్ మేళా 2026ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

 

మహిళల ఆర్థిక ప్రగతి కోసం తాను స్థాపించిన డ్వాక్రా సంఘాలు  దేశానికే ఆదర్శంగా నిలిచాయని సీఎం చంద్రబాబు అన్నారు. పొదుపు సంఘాల ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించినందుకు సంతోషంగా ఉందన్నారు. గుంటూరులో సరస్ మేళా 2026ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం సందర్శించారు. 

అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ...డ్వాక్రా సంఘాలను చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. మహిళలు ఆర్థికంగా వారి కాళ్లపై సొంతగా నిలబడాలనే ఉద్దేశంతో నేను 30 ఏళ్ల క్రితం డ్వాక్రా వ్యవస్థను తీసుకొచ్చాను. ఆనాడు డ్వాక్రా మహిళలు మీటింగుల కోసం బయటకు వస్తే ఎంతోమంది ఎగతాళి చేశారు. కానీ నేడు డ్వాక్రా సంఘలు తిరుగులేని వ్యవస్థగా దేశంలోనే రికార్డు సృష్టించాయి. డ్వాక్రా, మెప్నా సంఘాలు నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. రాష్ట్రంలో కోటీ 13 లక్షలమంది డ్వాక్రా మహిళలు రూ. 26 వేల కోట్ల నిధిని, రూ. 5,200 కోట్ల కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయం. 

2024-25లో డ్వాక్రా సంఘాలు రూ. 46,590 కోట్ల బ్యాంకు రుణాలు తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే ఇలాంటి కార్యక్రమాన్ని మన రాష్ట్రంలోనూ ఏర్పాటు చేసిన  కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను అభినందిస్తున్నాను. ఈ ఎక్స్‌పోను చూస్తుంటే మినీ ఇండియాను తలపిస్తోంది. అంతటా పండుగ వాతావరణం నెలకొంది.  సరస్ మేళా సంప్రదాయ హస్తకళలు, హ్యాండ్లూమ్స్, స్థానిక ఆహార ఉత్పత్తులకు బ్రాండింగ్ తీసుకురావడంతో పాటు మార్కెట్ లింకేజీ సదుపాయాన్ని కల్పిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. 

ఆడబిడ్డలతో ప్రత్యేక అనుబంధం

ఆడబిడ్డలతో తెలుగుదేశం పార్టీ అనుబంధం ఈ నాటికి కాదు. ఆనాడు ఎన్టీఆర్ మగవారితో సమానంగా మహిళలకు ఆస్తిహక్కు కల్పించారు. మహిళల కోసం తిరుపతిలో పద్మావతీ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. నేను ముఖ్యమంత్రి అయ్యాక డ్వాక్రా సంఘాల ద్వారా మహిళకు ఆర్థిక భరోసా కల్పించాను. రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల్లో 89 లక్షలమంది, మెప్నా సంఘాల్లో 24 లక్షల మంది సభ్యులున్నారు. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే బ్యాంకులు మరిన్ని రుణాలు ఇస్తాయని నేను చెప్పిన మాటను పొదుపు మహిళలు తూచా తప్పకుండా పాటించి ఆర్థిక ప్రగతి సాధించారు. 

2024-25లో రూ. 46 వేల 590 కోట్ల రూపాయి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు.  నేనిచ్చిన ఐటీ పిలుపుతో ఎంతోమంది దేశ విదేశాల్లో ఆర్థికంగా ఉన్నతంగా స్థిరపడ్డారు. ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 93 వేలమంది మైక్రో, ఎంఎస్ ఎంఈ ఎంట్రప్రెన్యూర్లు అయ్యారు.  డ్వాక్రా మహిళలు విదేశాలు కూడా వెళ్లి ఎంతోమందికి ట్రైనింగ్ ఇచ్చారు. డ్వాక్రా సంఘాలను మరింత సమర్థవంతంగా తయారుచేసే బాధ్యత నాదని సీఎం చంద్రబాబు అన్నారు. 

ముఖ్యమంత్రి అంటే పెత్తందారు కాదు

ముఖ్యమంత్రి అంటే పెత్తందారు కాదు. ప్రజా సేవకుడు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోంది. తల్లికి వందనం కింద ఏడాదికి రూ.10,090 కోట్లు 67 లక్షల మంది విద్యార్ధుల తల్లుల ఖాతాలో జమ చేస్తున్నాం.  ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కోసం స్త్రీ శక్తి పథకం తీసుకువచ్చాం. దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల ఉచితంగా అందిస్తున్నాం. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరుల వద్దకే ప్రభుత్వ సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. 

సంజీవని కార్యక్రమం ద్వారా ఐదు కోట్ల ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నాం. పేదరికం లేని రాష్ట్రం లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని సీఎం స్పష్టం చేశారు. అంతకుముందు స్త్రీ నిధి పథకం కింద డ్వాక్రా సంఘాలకు రుణంగా రూ.1,375 కోట్ల చెక్కును సీఎం అందించారు. సెర్ప్ నుంచి రూ.2171 కోట్లను పొదుపు సంఘాలకు రుణంగా అందించారు. చేనేత వస్త్ర స్టాళ్లను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి తన సతీమణి భువనేశ్వరికి చీరను కొనుగోలు చేశారు.  భర్తకు ఆరోగ్యం బాగోలేదని తన దృష్టికి తీసుకొచ్చిన పొదుపు మహిళకు సీఎం సహాయ నిధి నుంచి రూ.6 లక్షలు ముఖ్యమంత్రి చంద్రబాబు మంజూరు చేశారు.
  
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu