అరెస్టు లేకపోయినా.. అవినాష్ లో ఎందుకీ ఆందోళన, అసహనం?
posted on Feb 25, 2023 9:29AM
వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్.. రెండో సారి సీబీఐ విచారణ నుంచి బయటకు వచ్చారు. శుక్రవారం (ఫిబ్రవరి 24) ఆయన హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ సారి అవినాష్ అరెస్టు తథ్యం అంటూ పలు విశ్లేషణలు వెలువడ్డాయి. రాజకీయ పరిశీలకులే కాదు.. వైసీపీ వర్గాలు కూడా అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయమనే భావించారు.
ఎందుకంటే రెండో సారి విచారణకు రావాలంటూ ఆయనకు వాట్సాప్ ద్వారా నోటీసులు పంపిన అనంతరం సీబీఐ హైకోర్టులో వేసిన ఓ కౌంటర్‌లో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పక్కా ప్రణాళిక ప్రకారం వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేశారో పేర్కొన్నారు. ఆ కౌంటర్ కూడా వివేకా హత్య కేసులో అరెస్టయిన సునీల్ యాదవ్ బెయిలు పిటిషన్ ను వ్యతిరేకిస్తూ దాఖలు చేశారు. దీంతో సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తుందనే అంతా భావించారు. అయితే సీబీఐ అవినాష్ ను ఐదు గంటలపాటు ప్రశ్నించి వదిలేసింది. మరో సారి విచారణకు రావాల్సి ఉంటుందని కూడా చెప్పలేదు. ఈ పరిణామం సహజంగా అవినాష్ కు ఎంతో ఊరట కలిగించి ఉండాలి. కానీ సీబీఐ విచారణ నుంచి బయటకు వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడిన అవినాష్ రెడ్డిలో ఆ ఊరట కనిపించలేదు సరికదా.. గతంలో ఎన్నడూ లేనంత ఆందోళన కనిపించింది. ఖంగారు కనిపించింది.
సీబీఐ దర్యాప్తు సరైన దిశలో సాగడం లేదు.. ఏడాది కాలంగా విపక్ష తెలుగుదేశం ఏవైతే ఆరోపణలు చేసిందో వాటికి అనుగుణంగానే సీబీఐ విచారణ, ప్రశ్నలు ఉన్నాయని ఆరోపించారు. సీబీఐని విపక్ష తెలుగుదేశం మ్యానేజ్ చేస్తోందన్న అర్ధం వచ్చేలా ఆయన మాటలు ఉన్నాయి. పనిలో పనిగా మీడియాపైనా విమర్శలు గుప్పించారు. దుష్ప్రచారం చేస్తన్న మీడియా బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని మండి పడ్డారు. అయితే వివేకా ఆందోళన వెనుక, సీబీఐ దర్యాప్తు సరైన దిశలో సాగడం లేదంటూ చేస్తున్న విమర్శలు, ఆరోపణల వెనుక.. రెండో సారి విచారణలో సీబీఐ ఆయనకు సంధించిన ప్రశ్నలే కారణమని తెలుస్తోంది. తొలి సారి విచారణలో ఆయన తప్పించుకోలేని విధంగా వివేకా హత్య తరువాత ఎవరెవరికి ఫోన్ చేశారన్న దానిపై ప్రశ్నలు సంధించిన సీబీఐ ఈ సారి పూర్తిగా అవినాష్ ఆర్థిక వ్యవహారాలు, బ్యాంకు లావాదేవీలపై కాన్ సన్ ట్రేట్ చేసిందని తెలుస్తోంది.
ముఖ్యంగా ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఆధారంగా అవినాష్ పై ప్రశ్నల వర్షం కురిపించిందని చెబుతున్నారు. ఆర్థిక వ్యవహారాలపై సీబీఐ ప్రశ్నించడంతో అవినాష్ ఉక్కిరిబిక్కిరి అయ్యారనీ, అందుకే మీడియాతో మాట్లాడుతూ ఆందోళన, అసహనాన్ని దాచుకోలేకపోయారని అంటున్నారు. ఇప్పటికే లాజికల్ గా ఒక కంక్లూజన్ కు వచ్చేసిన సీబీఐ అరెస్టుల కంటే.. ఈ కేసులో సూత్రధారులను కూడా వెలికి తీయడం అన్న అంశంపైనే దృష్టి పెట్టిందని దర్యాప్తు తీరును పరిశీలిస్తున్న న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే ఈ కేసులో సీబీఐ కోర్టుకు తెలిపిన వివరాలు, సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై దాఖలు చేసిన కౌంటర్ లో ప్రస్తావించిన అంశాలనూ గమనిస్తే.. ముందు ముందు మరిన్ని సంచలన విషయాలు వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అందుకే అవినష్ రెడ్డిలో తనను సీబీఐ అరెస్టు చేయలేదన్న ఊరట కనిపించడం లేదని చెబుతున్నారు.