సజ్జల చెప్పేస్తున్నారుగా?
posted on May 16, 2024 9:32AM
సజ్జల రామకృష్ణారెడ్డి వాస్తవాలు చెప్పేస్తున్నారు. సూటిగా కాకున్నా సూచనలు, సలహాలంటూ రాష్ట్రంలో వైసీపీ మరో సారి అధికారం చేపట్టే అవకాశం లేదని పార్టీ క్యాడర్ ను ముందుగానే ప్రిపేర్ చేస్తున్నారు. గెలుపు ఓటములపై బెట్టింగులకు పాల్పడి నష్టపోవద్దంటూ పార్టీ కార్యకర్తలకు సూచలను ఇస్తున్నారు. సలహాలు చెబుతున్నారు. తద్వారా వైసీపీ గెలిచే అవకాశాలు మృగ్యమని వారికి సంకేతాలు పంపిస్తున్నారు. అదే సమయంలో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగలేదనీ, పోలీసులు తెలుగుదేశం కూటమికి కొమ్ము కాశారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. సాధారణంగా పోలీసులు అధికారంలో ఉన్న తమకు కాకుండా విపక్ష కూటమికి కొమ్ము కాసారని చెప్పడం అంటే తమకు ఓట్లు పడలేదని అంగీకరించడమేనని, ఇలాంటి మాటలన్నీ సాధారణంగా ఓడిపోయే పాటి.. సాకులు వెతుక్కునే ప్రయత్నంగా చెబుతుందనీ రాజకీయ పండితులు అంటున్నారు.
అయితే సజ్జల అక్కడితో ఊరుకోకుండా పరిస్థితులను చూస్తుంటే ఓట్ల లెక్కింపు కూడా సక్రమంగా జరుగుతుందని అనిపించడం లేదంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మాటలు చెప్పడానికి ముందు వరకూ, అంటే పోలింగ్ కు ముందు వరకూ కూడా ఎన్నికల ప్రక్రియ అంతా తమ గుప్పెట్లో ఉంచుకోవడానికి సజ్జల, వైసీపీ చేయని ప్రయత్నాలు లేవు. అవి ఫలించలేదని పోలింగ్ ప్రక్రియను గమనించిన వారికి స్పష్టంగానే అర్ధమైపోతోంది. ఇంకా అర్ధం కాని వారు ఎవరైనా ఉంటే వారికి అర్ధమయ్యేలా సజ్జల చెబుతున్నారు.
ఇన్ని ఆరోపణలు, నిష్టూరాలూ వేస్తూ ఎన్నికల ప్రక్రియ సరిగా జరగలేదనీ, ఎన్నికల సంఘం, పోలీసులు విపక్ష తెలుగుదేశం కూటమికి వత్తాసు పలికారనీ ఆరోపణలు గుప్పిస్తున్న సజ్జల చాలా జిల్లాల్లో అధికారులు చాలా వరకూ వైసీపీకే కొమ్ముకాసిన విషయాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. అయినా అధికార పార్టీ అయి ఉండీ దాడులకు వైసీపీ తెగపడిందంటేనే ఆ పార్టీకి గెలిచే అవకాశం లేదన్న విషయం పోలింగ్ రోజే స్పష్టమైపోయిందని పరిశీలకులు అంటున్నారు.
ఇప్పుడు ఓటమికి సాకులు వెతుక్కునే క్రమంలో ఎన్నికల సంఘంపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. తెలుగుదేశం ఆఫీసు నుంచి వచ్చిన ఆదేశాలను ఎన్నికల సంఘం అమలు చేసిందనీ, ఆ పార్టీ ఎలా చెబితే అలా వ్యవహరించిందనీ ఆరోపిస్తున్నారు. ఓటమిని అంగీకరించడానికి ఇంత కన్నా ఇంకా చెప్పాల్సింది ఏముందని పరిశీలకులు అనడమే కాదు. వైసీపీ క్యాడర్ కూడా ఇదే విషయాన్ని చర్చించుకుంటోంది. ఎన్నికల్లో ఓడిపోతున్నామని చెప్పడానికి ఇంత కన్నా పెద్ద సాక్ష్యం ఏముంటుందని వైసీపీ నేతలు కూడా గుసగుసలాడుకుంటున్నారు.