ఈ నలుగురికీ సీన్ అర్ధమైపోయిందా?

వైసీపీలో  నైరాశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. గెలుపుపై ఆశలు ఇసుమంతైనా కనిపించడం లేదు. పార్టీ అధినేత జగన్ నుంచి, ఆ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల వరకూ అందరూ మౌనముద్రలోకి వెళ్లిపోయారు. అంబటి వంటి ఒకరిద్దరూ, ఇంత కాలం పార్టీకీ, ప్రభుత్వానికీ  సలహాలిచ్చిన సజ్జల మాత్రం ఎన్నికల సంఘంపైనా, పోలీసులపైనా విమర్శలు గుప్పిస్తూ ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో పడ్డారు. ఇక  అవసరమున్నా లేకున్నా విపక్షంపై నోరేసుకు పడిపోయే రోజా, కొడాలి వంటి వారు ఆశ్చర్యకరంగా మౌనముద్రలోకి వెళ్లిపోయారు. పోలింగ్ రోజున తనకు సొంత పార్టీ వారే వ్యతిరేకంగా పని చేశారంటూ ఆరోపణలకు గుప్పించిన రోజా ఆ తరువాత మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. ఇక కొడాలి నాని అయితే పోలింగ్ రోజున తీరిగ్గా ఎప్పుడో సాయంత్రం వచ్చి కుటుంబంతో సహా ఓటేసి వెళ్లిపోయారు. ఎక్కడా ఎన్నికల తీరు గురించి మాట్లాడలేదు. తన విజయంపై ధీమా వ్యక్తం చేయలేదు. ఇక గన్నవరం ఎమ్మెల్యే వంశీ అయితే పోలింగ్ రోజున ఏదో హల్ చల్ చేయాలని ప్రయత్నించి భగంపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయినా ఆయనైతే పోలింగ్ కు ముందే ఇవే తన చివరి ఎన్నికలు, వచ్చే ఎన్నికలలో పోటీ చేయను అని ప్రకటించేసి ముందుగానే గెలుపు ఆశలు వదిలేసుకున్నారు. 

దీంతో ఇప్పుడు రాష్ట్ర మంతటా వైసీపీ ఫైర్ బ్రాండ్ బ్యాచ్ గా పేరుపడ్డ ఈ నలుగురిపైనే చర్చ జరుగుతోంది. వీరి పరిస్థితి ఏమిటి? గెలుపా? ఓటమా? అన్న ఆసక్తి వ్యక్తం అవుతోంది.  ఆ ఫైర్ బ్రాండ్ బ్యాచే  కొడాలి నాని, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ. అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు కూడా ఉన్నప్పటికీ, పార్టీ అధినేతే వారి గెలుపు చీటీ చింపేసి నియోజకవర్గం మార్చేశారు కనుక అటువంటి వారిపై పెద్దగా చర్చ జరగడం లేదు.  

తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై వీరు వ్యక్తిగత విమర్శలకు పాల్పడ్డారు. జగన్ మీద ఈగ వాలితే ఆ ఈగను కూడా చంద్రబాబే పంపించారు అనే స్థాయిలో విరుచుకుపడేవారు. అటువంటి ఈ నలుగురూ ఈ సారి తమతమ నియోజకవర్గాలలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. 

ముందుగా కొడాలి నాని విషయానికి వస్తే ఆయన గుడివాడ నియోజకవర్గం నుంచి 2004నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు. మొదటి రెండు సార్లే తెలుగుదేశం అభ్యర్థిగా, ఆ తరువాత రెండు సార్లూ వైసీపీ అభ్యర్థిగా ఆయన విజయం సాధించారు.  జగన్  తొలి క్యాబినెట్ లో మంత్రిగా కూడా ఉన్నారు. అటువంటి నాని ఈ సారి గుడివాడలో విజయం సాధించే అవకాశాలు దాదాపు మృగ్యమనే చర్చ వైసీపీ లోనే జరుగుతోంది.  ప్రభుత్వ వ్యతిరేకతకు, నాని వ్యవహారశైలి, ఆయన అనుచిత భాషా ప్రావీణ్యంతోడైందనీ, అందుకే ఆయనకు నియోజకవర్గంలో గడ్డు పరిస్థితి ఎదురైందని అంటున్నారు.

 ఇక రోజా విసయానికి వస్తే ఆమె నగరి నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికలలో విజయం సాధించారు. జగన్ మలి క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు.   అయితే ఈ సారి మాత్రం ఆమె విజయం అంత సులువు కాదని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు ఆమె వ్యవహారశైలి కారణంగా సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఆమె విజయానికి పార్టీ పరంగా నగరిలో సహకారం కరవైందని అంటున్నారు. అంతే కాకుండా సొంత పార్టీ నేతలే తెలుగుదేశంకు అనుకూలంగా పని చేశారని అంటున్నారు. వేరే ఎవరో అనడం కాదు, పోలింగ్ రోజున స్వయంగా రోజాయే ఆ విషయం చెప్పి తన ఓటమిని పరోక్షంగానైనా ముందే అంగీకరించేశారు.  

ఇక అంబటి రాంబాబు విషయానికి వస్తే సత్తెన పల్లిలో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.  ఆయన వ్యవహారశైలి, ఇష్టారీతిగా నోరు పారేసుకునే విధానం కారణంగా సొంత పార్టీలోనే ఆయన పట్ల అసంతృప్తి వ్యక్తం అయ్యిందంటున్నారు. ఇక ఆయన కూడా పోలీసులు, ఈసీ తెలుగుదేశం కూటమికి అనుకూలంగా పని చేశాయని ఆరోపణలు గుప్పించి, తన ఓటమిని తానే చాటుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఇక చివరిగా గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ విషయానికి వస్తే... తెలుగుదేశం అభ్యర్థిగా 2019లో విజయం సాధించిన వంశీ ఆ తరువాత వైసీపీ గూటికి చేరిపోయారు. చేరి ఊరుకోకుండా గన్నవరం తెలుగుదేశం శ్రేణులపై వేధింపులకు పాల్పడ్డారు. పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఈ సారి ఎన్నికల నామినేషన్ సందర్భంగానే వంశీ పట్ల నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకత ఏమిటన్నది గోచరమైంది. ఆయన నామినేషన్ ర్యాలీ నామ్ కే వాస్తేగా జరిగింది. పార్టీ శ్రేణులు కూడా దాదాపు ముఖం చాటేశాయని అప్పట్లో గట్టిగా వినిపించింది. మొత్తం మీద ఈ సారి వంశీ గట్టెక్కడం కష్టమేనన్న అభిప్రాయమే వ్యక్తం అవుతోంది.