కొండా సురేఖపై పరువు నష్టం దావా  కేసులో కెటీఆర్ స్టేట్ మెంట్ రికార్డు

మంత్రి కొండా సురేఖపై నాంపల్లి క్రిమినల్ కోర్టులో  మాజీ మంత్రి కెటీఆర్ వేసిన పరువు నష్టం దావా సోమవారం విచారణకు వచ్చింది.   కేటీఆర్‌  కంటే ముందు హీరో నాగార్జున పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఇవాళ నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణ చేపట్టింది. కేటీఆర్​ తరఫు న్యాయవాది ఉమా మహేశ్వర్‌రావు వాదనలు వినిపించారు.  ఈ నెల 18వ తేదీన కేటీఆర్ స్టేట్​మెంట్​తో పాటు నలుగురు సాక్షులు స్టేట్​మెంట్లు రికార్డు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేటీఆర్, సాక్షులు బాల్క సుమన్, సత్యవతి రాఠోడ్, తులా ఉమా, దాసోజు శ్రవణ్ స్టేట్​మెంట్లు రికార్డ్ చేయనుంది. నాగ చైతన్య, సమంత విడాకులకు కెటీఆర్ ప్రధాన కారణమని మంత్రి కొండా సురేఖ మీడియా ఎదుట బాహాటంగా ఆరోపించారు. అయితే సమంతకు క్షమాపణ చెప్పిన కొండా సురేఖ కెటీఆర్ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కెటీఆర్ కోర్టులో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తొలుత అతని స్టేట్ మెంట్ కూడా రికార్డు చేయాలని కోర్టు ఆదేశించింది. కొండా సురేఖపై పరుదు నష్టం దావా వేసిన నాగార్జున స్టేట్ మెంట్ ను ఇప్పటికే రికార్డు చేసిన కోర్టు కెటీఆర్ స్టేట్ మెంట్ కోసం వేచి చూస్తోంది.